అన్నదాతలు అందరికీ జాతీయ రైతు దినోత్సవం శుభాకాంక్షలు

* రైతు సంక్షేమమే జనసేన పార్టీ ప్రధాన అజెండా
మట్టిని నమ్ముకుని స్వేదంతో వ్యవసాయం చేసి కడుపులు నింపే అన్నదాతలు అందరికీ ‘జాతీయ రైతు దినోత్సవం’ సందర్భంగా శుభాకాంక్షలు అంటూ జనసేన పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు ఒక ప్రకటన విడుదల చేశారు. పరిపాలన చేతులు మారుతున్నప్పుడల్లా రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి కానీ రైతులకు, రైతు కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆశించిన భరోసా కనబడటంలేదు. రైతును, రైతు కుటుంబాన్ని కేవలం ఓటు కోసం ఉపయోగించుకుంటున్న వై.సీ.పీ. ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకునే స్థితిలో లేదు. అరక, నాగలి జోడెద్దులకు కట్టి దుక్కి దున్నిన కాలం నుంచి ఆధునిక యంత్రాలతో పంటలు పండించే స్థాయికి వ్యవసాయంలో అభివృద్ధి వచ్చినా, వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్న చాలా మంది రైతుల జీవితాల్లో మాత్రం పురోగతి కనబడటం లేదు. గడిచిన మూడున్నర సంవత్సరాలలో 3 వేల మందికి పైగా కౌలు రైతులు ఆర్థిక సమస్యలను అధిగమించలేక ఆత్మహత్యలు చేసుకున్న కారణంగా రైతు కుటుంబాలు దిక్కు తోచని స్థితిలో ఉంటే వై.సీ.పీ. ప్రభుత్వం కనీసం లెక్కలోకి కూడా తీసుకోవడం లేదు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్న ప్రతీ రైతు వివరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతీ మారుమూల ప్రాంతాల నుంచి సేకరించి ‘రైతు భరోసా’ పేరుతో రైతు కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తూనే, స్థానిక నాయకుల సహకారంతో రైతు పిల్లలకు చదువులు చెప్పించడంతో పాటు, రైతు కుటుంబ సభ్యులకు జీవనాధారం కల్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా జనసేన పార్టీ పాలనలో రైతుల సంక్షేమమే ప్రధాన అజెండాగా పరిపాలన ఉంటుంది. వ్యవసాయాన్ని నమ్ముకున్న ప్రతీ రైతుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారని నాగబాబు స్పష్టం చేశారు.