ప్రపంచానికి వంద కోట్ల కరోనా వ్యాక్సిన్లు విరాళంగా ఇవ్వనున్న జీ7 దేశాలు

పేద దేశాలకు ఒక బిలియన్‌ వ్యాక్సిన్‌ డోసుల్ని విరాళంగా జీ7 దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల టీకా డోసుల్ని వివిధ మార్గాల ద్వారా పంపిణీ చేయాలని సభ్య దేశాలు నిర్ణయించాయి. అత్యంత శక్తిమంతమైన జీ7 శిఖరాగ్ర సదస్సు ముగిసింది. ఈ సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వ్యాప్తి, పుట్టుక, టీకా పంపిణీ, చైనా మానవ హక్కుల ఉల్లంఘన సహా వివిధ అంశాలపై చర్చించారు. కొత్తగా గ్లోబల్ మినిమమ్ ట్యాక్స్​ను ప్రతిపాదించారు.

ప్రపంచానికి విరాళంగా ఇచ్చే 100 కోట్ల వ్యాక్సిన్లలో 70 కోట్లను ఈ ఏడాది చివరిలోపే ఎగుమతి చేయాలని జీ7 దేశాలు భావిస్తున్నాయి. వీటిలో 50 శాతం వ్యాక్సిన్లు ఈ జీ7 కూటమిలో లేని దేశాలకే వెళ్తాయని తెలుస్తోంది. చైనా విషయంలో తమ దేశాలన్నీ కలిసి ముందుకెళ్తాయని జీ7 విడుదల చేసిన సంయుక్త ప్రకటన పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పారదర్శకతకు విఘాతం కలిగించే విధానాలను వ్యతిరేకిస్తామని తెలిపింది. మరోవైపు, మానవ హక్కులను గౌరవించాలని చైనాకు సూచించనున్నట్లు వెల్లడించింది. భవిష్యత్తులో కరోనా వంటి ముప్పు రాకుండా చర్యలు తీసుకోవడం, కొత్త రకం వైరస్‌ ముప్పు ఎప్పుడు బయటపడినా దాన్ని వంద రోజుల్లోనే కట్టడి చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. పర్యావరణ పరిరక్షణ దిశగా కఠినమైన లక్ష్యాలను పెట్టుకోవాలని జీ7 దేశాలు నిర్ణయించాయి. బొగ్గు, శిలాజ ఇంధన వినియోగాన్ని క్రమంగా తగ్గించాలని సంకల్పించుకున్నాయి. వాతావరణ మార్పులపై పోరాడేందుకు జీ7 దేశాలు అందించే నిధుల వాటాను 100 బిలియన్ డాలర్లకు పెంచాలని నిర్ణయం తీసుకున్నాయి.