ప్రభుత్వానికి సినిమా టికెట్స్ మీద ఉన్న ఏకాగ్రత సమస్యల మీద లేదు

రైల్వేకోడూరు, క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రపంచ క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని జనసేన పార్టీ రైల్వేకోడూరు నాయకులు గంధం శెట్టి దినకర్ దినకర్ తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక సమస్యలు రాష్ట్ర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా… వైసీపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల పైన ఏకాగ్రత ఏర్పరుచుకోవడం దురదృష్టకరమైన విషయమని రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు విమర్శించారు. ప్రభుత్వం రాష్ట్ర సమస్యలైన రాజధాని, పోలవరం, నిత్యావసర ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు, నిరుద్యోగ సమస్య మొదలగు అనేక సమస్యలు ఉన్నా… వీటన్నిటినీ కాదని ఏమాత్రం ఉపయోగం లేని సినిమా టికెట్లు రేట్లు తగ్గించడం సమంజసం కాదన్నారు. పులివెందులలో ఆక్వాహబ్ ఏర్పరచడం సంతోషదాయకమైననూ, మొదటి నుండి వై.ఎస్.ఆర్ కుటుంబానికి వెన్నుదన్నుగా ఉన్న రైల్వేకోడూరు నియోజకవర్గానికి వైసీపీ ప్రభుత్వం ఏమి చేయకపోవడం అన్యాయమన్నారు. నాలుగు పర్యాయాలు శాసనసభ్యునిగా ఎన్నికైన ప్రస్తుత విప్ అయిన కొరముట్ల శ్రీనివాసులు అసెంబ్లీ సమావేశాలలో కనీసం రైల్వేకోడూరు సమస్యలపైన ఒక్కసారైనా స్పందించడం ప్రజలు చూడలేదన్నారు. ఒకవేళ ఆయన స్పందించి తెచ్చిన ఏ ఒక్క అభివృద్ధి పథకం ఏమాత్రం ఈ ప్రాంతంలో కనిపించడం లేదన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు, రోడ్లపై గుంతలు నాసిరకంగా పూడ్చడం తప్ప ఇంకా ఏమీ చేయలేదని, అవి కూడా సరైన పద్ధతిలో పూర్తి చేయలేదన్నారు. కరెంటు చార్జీలు, బస్సు చార్జీలు, సిమెంట్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. PMGAY పథకం కింద గత రెండేళ్లలో ఒక్క ఇల్లు నిర్మించలేని వైసీపీ ప్రభుత్వం ఓటిఎస్ పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. కనీసం మిగిలిన రెండున్నర సంవత్సర కాలంలోనైనా ప్రభుత్వం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆశిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో హరి, అనంత రాయలు, మాదం సుబ్రహ్మణ్యం, మధు, మణి తదితరులు పాల్గొన్నారు.