బీరుట్‌ సంఘటన ఏపీలో ఉత్పన్నం కారాదు… పవన్ కల్యాణ్

లెబనాన్ రాజధాని బీరుట్‌లో విలయాన్ని సృష్టించిన పేలుడు పదార్థం అమ్మోనియం నైట్రేట్ రాష్ట్ర రాజకీయాలపైనా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర పరిపాలనా రాజధానిగా ఆవిర్భవించడానికి సిద్దం కానున్న విశాఖపట్నంలో అమ్మోనియం నైట్రెట్ నిల్వలు భారీ ఎత్తున ఉన్నాయని, అవన్నీ విశాఖ నగరానికి ముప్పుగా పరిణమించే ప్రమాదం లేకపోలేదంటూ విశాఖను రాజధానిగా ఏర్పాటు చేయడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడ శివార్లలోని కొండపల్లిలో కూడా వందల టన్నుల్లో అమ్మోనియం నైట్రేట్ నిల్వలు ఉన్నట్లు మీడియా ద్వారా తెలిసిందని అవన్నీ భవిష్యత్తులో ప్రమాదకరంగా మారే అవకాశాలు లేకపోలేదని, వాటిని తొలగించడం మంచిదని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

ఈ పేలుడు పదార్థం ఎలాంటి ఉపద్రవాన్ని తీసుకొస్తుందనే విషయం బీరుట్‌లో చోటు చేసుకున్న సంఘటనల ద్వారా తెలియ వచ్చిందని, అలాంటి పరిస్థితులు ఏపీలో ఉత్పన్నం కాకుండా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. అమ్మోనియం నైట్రెట్ నిల్వల వల్ల జరగరానిది జరిగితే సంభవించే నష్టాన్ని ఊహించలేమని అన్నారు. ఊహించడానికే కష్టంగా ఉందని పేర్కొన్నారు.

మనదేశానికి సంబంధించినంత వరకూ అమ్మోనియం నైట్రెట్ దిగుమతులు ఒక్క విశాఖపట్నం పోర్ట్ నుంచే నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం దిగుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. విశాఖలో వరుసగా పారిశ్రామిక ప్రమాదాలు చోటు చేసుకుంటోన్నాయని, దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. ప్రస్తుతం విశాఖపట్నంలో 19,500 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రెట్ నిల్వలు ఉన్నాయని గుర్తు చేశారు. వాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందుగానే తగు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని హెచ్చరించారు.