చెరువుల కబ్జాకు ఉపయోగించే యంత్రాలను సీజ్ చేయాలి

  • జెసిబిలు, ట్రాక్టర్ల యజమానులపై కేసులు నమోదు చేయాలి పార్వతీపురంలో లక్ష్మనాయుడు చెరువు, దేవుని బంధ, నెల్లిచెరువుల కబ్జాలను ఆపాలి
  • సమస్యలు పరిష్కరించని జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ ఎందుకు…?
  • చెరువుల్లో పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చిన అధికారులను
  • ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు వంగల దాలి నాయుడు

పార్వతీపురం, చెరువుల కబ్జాకు ఉపయోగించే జె.సి.బీ, ట్రాక్టర్లు తదితర యంత్రాలను సీజ్ చేసి, ఆయా యంత్రాలు యజమానులపై కేసులు నమోదు చేయాలని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు వంగల దాలి నాయుడు కోరారు. ఆదివారం ఆ సమితి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ గవిరెడ్డి రఘు సత్య సింహ చక్రవర్తి, పార్వతీపురం మండల అధ్యక్షులు బలగ శంకర్రావు, సీతానగరం మండల అధ్యక్షులు పాటి శ్రీనివాసరావు తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం పార్వతీపురం పట్టణంలోని లక్ష్మనాయుడు చెరువు, దేవుని బంధ, నెల్లిచెరువు లను కబ్జాదారులు దర్జాగా కబ్జా చేస్తున్నారన్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా జెసిబిలు, ట్రాక్టర్లు తదితర యంత్రాలను పెట్టి చెరువులను ఆక్రమిస్తున్నారన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసిన చర్యలు లేకపోవడం శోచనీయమన్నారు. సమస్యలు పరిష్కరించని స్పందన కార్యక్రమం ఎందుకని వారు ప్రశ్నించారు. చెరువుల్లో కబ్జా జరుగుతోందని సోషల్ మీడియాతో పాటు ప్రింట్, మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కోడై కూస్తున్నా రెవెన్యూ, ఇరిగేషన్, సచివాలయ, మున్సిపాలిటీ అధికారుల్లో చలనం లేకపోవడం విడ్డురమన్నారు. చెరువులు కబ్జాలను ఊరంతా చూస్తున్నా అధికారులు సిబ్బంది చూడలేకపోవడం విచిత్రమన్నారు. జిల్లా ఏర్పడ్డాక కబ్జాలు అధికమయ్యాయని, అధికారులు సిబ్బంది తీసుకుంటున్న జీతానికి కూడా కనీసం పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాదారులు రెచ్చిపోయి చెరువుల్లో పక్క భవనాలు నిర్మిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సిన అధికారులు అంధులుగా మారటం అన్యాయం అన్నారు. చెరువుల్లో పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చిన అధికారులను సిబ్బందిని తక్షణమే విధుల నుండి తొలగించాలన్నారు.
పార్వతీపురం పట్టణంతో పాటు జిల్లాలో ఉన్న 15 మండలాల్లో ఆయా మండల కేంద్రాలు, ఆయా గ్రామాలలో ఉన్న చెరువులన్నీ దాదాపు కబ్జాకు గురవుతున్నాయన్నారు. కబ్జాలు నివారించడంలో జిల్లా రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ, సచివాలయ, మున్సిపాలిటీ యంత్రాంగం విఫలమైందన్నారు. జిల్లాలో రియల్ ఎస్టేట్ ధరలు పుంజుకోవడంతో అక్రమార్కులు ప్రభుత్వ చెరువులను ఆక్రమిస్తూ అక్రమ నిర్మాణాలను చేస్తున్నారన్నారు. కళ్ళముందే పట్టపగలు, చెరువులను కబ్జా చేస్తుంటే సంబంధిత ఆయా శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు, సిబ్బంది చోద్యం చూస్తున్నారన్నారు. కోట్లాది రూపాయలు విలువైన ప్రభుత్వ చేరువులను కబ్జాదారులు ఆక్రమిస్తుంటే ఆయా శాఖలకు చెందిన అధికారులు వాటిని అడ్డుకునే పాపాన పోలేదన్నారు. చెరువులు కనుమరుగైతే భావితరాల భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. జలచక్రం నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, పక్షి, జంతు, జల జీవరాశులకు ఆధారమైన చెరువులు కనుమరుగైతే మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లుతుందన్నారు. వర్గాలు కూడా గగనమవుతాయన్నారు. ఈ విషయాన్ని గ్రహించి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు చెరువులను పరిరక్షించాలన్నారు. కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. చెరువుల్లో ఆక్రమణలు, అక్రమ కట్టడాలను తొలగించి, వాటికి పూనుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైతే కబ్జా సమయంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారో వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణమే జిల్లాలోని చెరువులన్నింటికీ సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేసి, ఆక్రమించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకొని, చెరువులను రక్షించాలన్నారు. సర్వేలో కబ్జాకు గురైనట్లు తెలిస్తే కబ్జాదారులపై చర్యలు చేపట్టాలని కోరారు. సంబంధిత ఉన్నతాధికారులు గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించి అమలు చేయాలన్నారు. పబ్లిక్ గా కబ్జాలు జరుగుతున్న విషయాన్ని ప్రజలంతా చూసి, అధికారులను ఆడిపోసుకుంటున్నారని ఈ విషయాన్ని వారు గుర్తించాలన్నారు.