పదవిలోకి రాగానే పంతం నెగించుకున్న మేయర్

హైదరాబాద్ మేయర్ గా గద్వాల విజయ లక్ష్మీ ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే ఆమె పంతం నెగ్గించుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు షేక్ పేట ఎమ్మార్వో బదిలీనే కారణంగా చెప్తున్నారు. మేయర్ గా ఎన్నికైన వెంటనే షేక్ పేట ఎమ్మార్వో శ్రీనివాస రెడ్డిని బదిలీ చేయడం వివాదాస్పదంగా మారుతుంది.

గతంలో విజయ లక్ష్మి కార్పొరేటర్ గా ఉన్న సమయంలో ఎమ్మార్వో శ్రీనివాస రెడ్డి తో ఆమెకు వివాదం తలెత్తింది. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల విషయంలో ఈ వివాదం జరిగింది. అయితే ఆ సమయంలో విజయలక్ష్మి ఆమె అనుచరులతో కలిసి ఎమ్మార్వో కార్యాలయంలోకి బలవంతంగా వచ్చితనపై దాడి చేశారని అంతేకాకుండా కార్యాలయ విధుల్లో భాగంగా హై కోర్టుకు వెళ్తున్న తనను అడ్డగించి విధులకు ఆటంకం కలిగించారని శ్రీనివాసరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసారు.

ఇప్పుడు ఆ కోపం కారణంగానే ఆయనపై బదిలీ వేటు వేశారని అంటున్నారు. అయితే ఈ విషయంపై స్పందించడానికి మేయర్ విజయలక్ష్మి నిరాకరించారు. తాను ఇప్పుడేమీ మాట్లాడానని తేల్చి చెప్పారు. తామంతా పార్టీ సభ్యత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నామన్నారు. ఈ నెల 22 న మేయర్ గా ప్రమాణస్వీకారం చేయనున్నానని విజయలక్ష్మి పేర్కొన్నారు.

కాగా ఈ వివాదంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి మాట్లాడారు. అధికారులపైనా తమకు ఎలాంటి కోపం లేదన్నారు. విజయలక్ష్మి కార్పొరేటర్ గా ఉన్న సమయంలో ప్రజా సమస్యలపై ఆయన దగ్గరకు వెళితే శ్రీనివాసరెడ్డి ఆమెతో దురుసుగా ప్రవర్తించారని వివరించారు.