అంతర్వేది రథ సంప్రోక్షణకు ముహూర్తం ఖరారు

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నూతన రథంకు ఫిబ్రవరి 13వ తేదీన సంప్రోక్షణ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ విషయాన్ని దేవాదాయశాఖ ఉన్నతాధికారులు విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రల దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు ఆదివారం శారద పీఠానికి వచ్చి సంప్రోక్షణ సందర్భంగా చేపట్టదలచిన వైదిక కార్యక్రమాల గురించి పీఠాధిపతులకు వివరించారు. ఫిబ్రవరి 11, 12, 13 తేదీల్లో సంప్రోక్షణ ప్రక్రియ నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ క్రతువులో నూతన రధానికి కళారాధన, కలశ స్థాపన నిర్వహిస్తామని, చివరి రోజు 13వ తేదీన సంప్రోక్షణ చేపట్టాలని ముహూర్తం నిర్ణయించామని స్వరూపానంద దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. సంప్రోక్షణ కార్యక్రమాన్ని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు తమ స్వహస్తాలతో చేపట్టాలని కోరారు. ఈ మేరకు ఆహ్వాన పత్రాన్ని స్వామికి అందించారు. నూతన రథం విషయంలో ఆగమానుసారం, శాస్త్రోక్తంగా కార్యక్రమాలు చేపట్టాలని అధికారులు, ఆలయ పండితులు, స్థానాచార్యులకు స్వామి స్వరూపానందేంద్ర సూచించారు. అంతర్వేది నారసింహ క్షేత్రంలో ప్రత్యేకమైన వైదిక కార్యక్రమాలు చేపట్టాలని, నిత్య కళ్యాణం చేపట్టే దిశగా యోచించాలని దేవాదాయ శాఖ అధికారులకు స్వామి స్వరూపానందేంద్ర సలహా ఇచ్చారు.