పరాకాష్టకు చేరిన వైసీపీ క్షుద్ర రాజకీయాలు

గుంటూరు, అధికారం కోసం ఎంతటి దారుణాలకైనా, మారణ హోమాలకైనా వెనుకాడని వైకాపా నేతల క్షుద్ర రాజకీయాలు పరాకాష్టకు చేరాయని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మండిపడ్డారు. సామాజిక పింఛన్ల పంపిణీని కావాలనే ఆలస్యం చేస్తూ విపక్షాలపై కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్న వైసీపీ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పింఛన్ల పంపిణీపై వైసీపీ విషప్రచారం చేస్తుందని దీనిని క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ శ్రేణులు బలంగా తిప్పికొట్టాలని కోరారు. తమ స్వార్ధ రాజకీయాల కోసం అవ్వా తాతలకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు వైసీపీ నరకం చూపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోచుకోవటానికి, తరతరాలకు సరిపడా దాచుకోవటానికి డబ్బుంది కానీ పేదలకు ఇవ్వటానికి లేదా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసేందుకు సరిపడా సచివాలయం సిబ్బంది ఉన్నా కావాలనే ప్రభుత్వం జాప్యం చేస్తుందని విమర్శించారు. పింఛన్ల పంపిణీ సచివాలయంలో చేయాలంటూ సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి ఆదేశాలు ఇవ్వటం బాధ్యతారాహిత్యమని ధ్వజమెత్తారు. సచివాలయాల వద్ద కావాలని వృద్ధులను, వికలాంగులను నిరీక్షించేలా చేసి దీనికి కారణం విపక్షాలే అంటూ వైసీపీ దుష్ప్రచారం చేయటానికి కుట్రలు పన్నిందన్నారు. ఎండలు మండిపోతున్న సమయంలో వృద్ధులకు జరగరానిది ఏదన్నా జరిగితే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలన్నారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి నగదు అందించేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆళ్ళ హరి కోరారు. సమావేశంలో రెల్లి యువ నేత సోమి ఉదయ్ కుమార్, కాటూరి శ్రీనివాసరావు, అక్కి రవి తదితరులు పాల్గొన్నారు.