మహిళా బిల్లు ఆమోదం పొందటం శుభ పరిణామం

చట్ట సభల్లో మహిళలకు 33 శాతం స్థానాలు కల్పించే విధంగా ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందటం శుభ పరిణామం అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. నూతన పార్లమెంట్ భవనంలో ఆమోదం పొందిన తొలి బిల్లు ఇదే కావడంతో ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ చరిత్రలో నిలిచిపోతుంది. ఆకాశంలో సగం అంటూ మహిళలను మెప్పించే మాటలకు పరిమితం కాకుండా వారి శక్తిసామర్థ్యాలకు చట్ట సభల్లో సముచిత స్థానం కల్పించేలా బిల్లును ప్రవేశపెట్టడంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. వారికి నా హృదయపూర్వక అభినందనలు. ఈ బిల్లును ఉద్దేశించి కేంద్ర హోమ్ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు ప్రసంగిస్తూ పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు. వారికీ, ఈ బిల్లుపై విలువైన చర్చలు చేసి ఆమోదం పొందటంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ మహిళా సాధికారతకు బాటలు వేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.