మరపురాని పాత్రలతో ప్రేక్షక హృదయాల్లో నిలిచిన నట సామ్రాట్

తెలుగు చలన చిత్ర చరిత్రలో దివంగత అక్కినేని నాగేశ్వరరావు గారిది ప్రత్యేక అధ్యాయం. సాత్వికాభినయంతో శ్రీ నాగేశ్వర రావు గారు పోషించిన విభిన్నమైన పాత్రలను సినీ ప్రియులు ఎప్పుడూ గుర్తు చేసుకొంటూనే ఉంటారు. ఆ మహా నటుడి శత జయంతి వేడుకలు నేడు మొదలయిన సందర్భంలో మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక దేవదాసు… ఒక మజ్ను… డాక్టర్ చక్రవర్తి… దసరా బుల్లోడు… బాటసారి… విప్రనారాయణ.. భక్త తుకారాం… బాలరాజు.. సీతారామయ్య గారి మనవరాలు… ఇలా ఏ పాత్ర, ఏ చిత్రం ప్రస్తావించుకున్నా శ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారి అభినయం కళ్ళలో మెదులుతుంది. మరపురాని పాత్రలతో ప్రేక్షక హృదయాల్లో నిలిచిన నట సామ్రాట్ ఆయన. స్వతహాగా నాస్తికత్వాన్ని విశ్వసించినా వెండి తెరపై భక్తి భావనలు పంచే పాత్రల్లో ఒదిగిపోయిన విధానం ఒక నటుడు పాత్రను ఎంతగా జీర్ణించుకోవాలో ఆయన చిత్రాల ద్వారా తెలుస్తుంది. కరుణ రస ప్రధానంగా విషాదాన్ని పలికించడంలో ఆయన శైలి విభిన్నమైనది. ప్రేమ కథలకు, నవలా చిత్రాలకు చిరునామాగా నిలిచారు. కృషి, పట్టుదలతో చలన చిత్రసీమలో శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు ఎదిగిన క్రమం నవతరానికి మార్గ దర్శనం చేస్తుందని జనసేనాని పేర్కొన్నారు.