అవినీతికి అసలు పుత్రుడు అరాచకాలకు దత్తపుత్రుడు జగన్ రెడ్డే

*జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు
*పరిపాలన చేతకాక, సమస్యలను పరిష్కరించలేకే పవన్ పై విమర్శలు
*అనుభవరాహిత్య పాలనతో రెండున్నరేళ్లలోనే రాష్ట్రాన్ని అప్పులకుంపటిగా మార్చారు
*సీఎం తాడేపల్లి గడప దాటితే ప్రజలు సంక్షేమంగా ఉన్నారో సంక్షోభంలో చిక్కి ఎలా విలవిలలాడుతున్నారో తెలుస్తుంది
*ప్రభుత్వ అసమర్ధ పాలనపై విరక్తి చెందిన ప్రజలు వైసీపీకి ఘోరీ కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు
*పవన్ ని టీడీపీ దత్తపుత్రుడు అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన పార్టీ నేతలు

నాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోచుకొని నేడు ముఖ్యమంత్రి హోదాలో వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేసి నకిలీ మద్యం, ఇసుక, మైనింగ్ అక్రమ రవాణా, భూకబ్జాలు వంటి అరాచక పాలనతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుంటున్న జగన్ రెడ్డే అవినీతికి అసలు పుత్రుడు అరాచకాలకు దత్తపుత్రుడని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు అన్నారు. పవన్ కళ్యాణ్ ని టీడీపీ దత్తపుత్రుడు అంటూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జగన్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, న్యాయమైన తమ డిమాండ్లను తీర్చాలని, నిరసనలు, ఉద్యమాలు చేస్తే వాటిని పరిష్కరించడం చేతకాని ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగుల వెనుక జనసేన ఉందంటూ విమర్శించటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారని సమస్యలను పరిష్కరించడం చేతకాని అసమర్ధ వైసీపీ నేతలు ప్రజల దృష్టి మరల్చేంచేందుకు క్షుద్రరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఒక అయోగ్యుడు అందలం ఎక్కితే పరిపాలన ఎలా ఉంటుందో రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే అర్ధమవుతుందన్నారు. మాట్లాడితే సంక్షేమం సంక్షేమం అంటూ చెప్పే ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక్కసారి బయటికి వచ్చి చూస్తే ప్రజల జీవితాలు సంక్షేమంగా ఉన్నాయో సంక్షోభంలో ఎలా చిక్కిశల్యమవుతున్నాయో అర్ధమవుతుందన్నారు. రాష్ట్ర కార్యదర్శి నాయబ్ కమాల్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో టీడీపీని కుంభస్థలంపై కొట్టి తెరుకోలేని విధంగా చేసింది జనసేనేనని అయినా ఇంకా విషప్రచారం చేస్తుండటం వైసీపీ కుహనారాజకీయలకు నిదర్శనం అన్నారు. ఉంటే నువ్వన్నా ఉండాలి లేకపోతే నేను అన్నా ఉండాలన్న లోపాయకారి ఒప్పందంతో టీడీపీ, వైసీపీలు కుట్రరాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. రెండున్నరేళ్ల వైసీపీ అసమర్ధ, అనాలోచిత పాలనపై విరక్తి చెందిన ప్రజలు వైసీపీకి రానున్న ఎన్నికల్లో ఘోరీ కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నీతినిజాయితీకి నిలువెత్తు నిదర్శనమైన ఉన్నతవిలువలతో కూడిన జీరో పాలిటిక్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. విలేకరుల సమావేశంలో నాయకులు ఆళ్ళ హరి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అడపా మాణిక్యాలరావు, ప్రధాన కార్యదర్సులు యన్ ప్రసాద్, బిట్రగుంట మల్లిక, యడ్ల మల్లి, శిఖా బాలు తదితరులు పాల్గొన్నారు.