జోగి రమేష్ హడావిడి తప్ప, జిల్లాల పునర్విభజన వల్ల పెడన నియోజకవర్గానికి ఒరిగింది శూన్యం

జోగి రమేష్ ఎంత హడావిడి చేసినా.. ఎన్ని ర్యాలీలు తీసినా.. నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. నియోజకవర్గం లోని సమస్యలు గాలికొదిలేసి, రోడ్డుమీద హంగామా చేయడం తప్ప జోగి రమేష్ కి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఆరో తారీకు వచ్చినా.. జీతాలు రాక ఉద్యోగులు ఉసూరు మంటున్నారు. ధాన్యం అమ్మి మూడు నెలలైనా ఇప్పటికీ డబ్బు రాక రైతులు ఇబ్బంది పడుతున్నారు. కరెంట్ చార్జీల బాదుడు సామాన్యుడి నడ్డి విరిచింది. నియోజకవర్గంలో తాగునీటి సమస్య విలయతాండవం చేస్తుంది. 24 గంటలు ఇసుక దోపిడీ జరుగుతూనే ఉంది.

అన్ని సమస్యలను గాలికొదిలేసి అనవసర ర్యాలీలు వల్ల జనాలకు ఒరిగేదేమిటి జోగన్నా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన కొత్త సమస్యలను, సామాజిక వర్గాల మీద తీవ్రప్రభావాన్ని చూపనుంది. పునర్విభజన కూడా అశాస్త్రీయంగా జరిగింది. ప్రజా సమస్యలను, నిరుద్యోగ సమస్యలను, ఉద్యోగుల ఆందోళనలను పక్కదారి పట్టించేందుకే హడావిడిగా కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ అని పైకి చెబుతున్నా, కొత్త జిల్లాల వల్ల వాస్తవానికి రెవెన్యూ వ్యయం గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగుల జీతాలు పెంచమని ఆందోళన చేసినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేదని చెబుతున్న వైసిపి ప్రభుత్వం ఇప్పుడు జిల్లాల పెంపుతో వచ్చే రెవిన్యూ వ్యయాన్ని ఎలా సర్దుబాటు చేస్తారో కూడా చెప్పాలి.

ఈ కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల మచిలీపట్నానికి ప్రత్యేకంగా వచ్చింది ఏమీ లేదు. ఈ పట్టణ ప్రజలు కోరుకునేది మచిలీపట్నం పోర్టు. కొత్తగా జిల్లా గుర్తింపు కాదు.పక్క రాష్ట్రం అయినా తెలంగాణలో జిల్లాల పునర్విభజనతో సాధించింది శూన్యం. కొత్త జిల్లాలు రాజకీయ నిరుద్యోగులకు కొంత పునరావాస కేంద్రాలుగా ఉపయోగపడ్డాయి తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు.

చివరగా 13 జిల్లాలకు మూడు రాజధానులు అయితే కొత్తగా ఏర్పడబోయే ఇరవై ఆరు జిల్లాలకు 6 రాజధాని కడతారా? గుంతల రోడ్లు, వర్షం వస్తే మునిగిపోయే బస్టాండ్ ఉన్న మనకు 26 ఎయిర్ పోర్ట్లు కడతారా?

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సింది కొత్త జిల్లాలు కాదు. సరి కొత్త నాయకుడు. గాడితప్పిన ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితిని చక్కదిద్దే నవ నాయకుడని ఎస్.వి బాబు సమ్మెట తెలియజేసారు.