ఉసూరుమంటున్న ఉచిత బోర్ల పథకం

*దరఖాస్తులు 2 లక్షలకు చేరువలో….తవ్వింది 8 వేలే
*ఇవి కూడా విద్యుత్తు కనెక్షన్, పంపుసెట్టు లేక నిరుపయోగం

వైఎస్సార్ జల‘కళ’ తప్పింది. సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు వేసేందుకు 2020 ఖరీఫ్ ప్రారంభంలో ప్రభుత్వం వైఎస్సార్ జలకళ పథకాన్ని ప్రారంభించింది. ఆ తరవాత ఉచిత బోర్లతోపాటు, విద్యుత్ కనెక్షన్ ఇచ్చి, ఉచితంగా పంపుసెట్లు కూడా బిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పథకం ప్రారంభించి ఒకటిన్నర సంవత్సరం గడిచేసరికే దీనిపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా 2020 జూన్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్భాటంగా వైఎస్సార్ జలకళ పథకాన్ని ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తున్నామని ఘనంగా ప్రకటించారు. అర్హులైన రైతులందరికీ ఉచితంగా బోర్లు వేయడంతోపాటు, పంపుసెట్ కూడా బిగించి ఇస్తామని చెప్పారు. పథకం ప్రారంభించడంలో చూపిన చొరవ, అమల్లో చూపకపోవడంతో వైఎస్సార్ జలకళ చతికిలపడింది.

సర్వేలో తీవ్ర జాప్యం

ఉచితంగా ప్రభుత్వమే బోర్లు వేసి, పంపుసెట్లు కూడా బిగించి ఇస్తామని చెప్పడంతో రైతులు ఆనందించారు. 1.95 లక్షల మంది రైతులు వైఎస్సార్ జలకళ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే పథకం ప్రారంభించడంలో చూపిన శ్రద్ధ, అమల్లో చూపలేదు. ఉచిత బోర్లకు రైతులు చేసుకున్న దరఖాస్తుల పరిశీలనలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. ముందుగా క్షేత్ర స్థాయిలో వీఆర్వోలు పరిశీలించి అర్హత కలిగిన రైతుల దరఖాస్తులను డ్వామా సహాయ సంచాలకులకు పంపుతారు. అక్కడ మరోసారి పరిశీలన పూర్తి అయ్యాక అర్హులైన రైతుల పొలాల్లో జియాలజిస్టుల సర్వే మొదలవుతుంది. వీరిచ్చే నివేదిక ఆధారంగానే కాంట్రాక్టర్లు బోర్లు తవ్వుతారు. అయితే దరఖాస్తుల పరిశీలనలో తీవ్ర జాప్యం రైతుల పాలిట శాపంగా మారింది. రాష్ట్రం మొత్తం మీద రైతుల నుంచి 1,95,365 దరఖాస్తులు అందాయని ప్రభుత్వమే ప్రకటించింది. డ్వామా ఏపీడీల స్థాయిలో 1,54,288 దరఖాస్తులకు ఆమోదం లభించగా, అందులో 37,812 దరఖాస్తుదారుల పొలాల్లో మాత్రమే జియాలజిస్టులు సర్వే పూర్తి చేశారు. వీటిల్లో కూడా ఇప్పటి వరకు కేవలం 8 వేల బోర్లు తవ్వారు. ఎక్కడా విద్యుత్ మోటార్లు బిగించిన దాఖలాలు లేవు. ఇక కరెంటు కనెక్షన్ ఊసే లేదు. కాంట్రాక్టర్లకు రూ.57 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో వారు చేతులెత్తేశారు. అయితే ఈ బకాయిలను ఇప్పుడు విడుదల చేశారు. దీంతో పథకం ముందుకు సాగుతుందేమో చూడాలి. ప్రస్తుతం వ్యవసాయ పనులు జరుగుతున్నాయని, అందుకే బోర్లు వేయడం సాధ్యం కావడంలేదని అధికారులు చెబుతున్నారు.

ఏ జిల్లా చూసినా ఇదే వరస

నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ జలకళ పథకం ద్వారా పదివేల ఉచిత బోర్లు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే పథకం ప్రారంభించిన ఒకటిన్నర సంవత్సరంలో జిల్లాలో వేసిన బోర్లు 421 మాత్రమే. ఇది కేవలం ఒక్క నెల్లూరు జిల్లాలోనే కాదు ఏ జిల్లాలోనూ వెయ్యికి మించి బోర్లు తవ్వలేదు. ఒక వేళ బోరు వేసినా కరెంటు కనెక్షన్ ఇవ్వలేదు. పంపుసెట్ బిగించలేదు. దీంతో రాష్ట్రం మొత్తం మీద 8వేల బోర్లు తవ్వినా రైతులకు మాత్రం ప్రయోజనం దక్క లేదు. పంపు సెట్లు, కరెంటు కనెక్షన్ లేక అవి ఉపయోగంలోకి రాలేదు. అంటే తవ్విన కొద్దిపాటి బోర్లు కూడా రైతులు వినియోగించుకోలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. రైతులకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు విద్యుత్ శాఖకు ప్రభుత్వం నిధులు చెల్లించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నిధుల కేటాయింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో రాష్ట్రం మొత్తం మీద ఒక్క బోరుకు కూడా విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు.

నిధుల లేమే అసలు కారణం

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్సార్ ఉచిత బోర్ల పథకం అడుగు ముందుకు పడటం లేదు. ఎన్నికల హామీల్లో భాగంగా పథకాన్ని ప్రారంభించినా, నిధులు కేటాయించి, వాటిని విడుదల చేయడంలో మాత్రం ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. పైసా విదల్చకుండా లక్షలాది రైతులకు ఉచితంగా బోర్లు, పంపుసెట్లు సమకూర్చాలంటే తమ వల్ల కాదని కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. గత ఏడాది మే నుంచి రూ.57 కోట్ల బిల్లుల బకాయిలు నిలిచిపోవడంతో, వారు పనులు ఆపేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అవి ఇప్పుడు విడుదల కావడంతో పనులు తిరిగి మొదలవుతాయనే ఆశ రైతుల్లో నెలకొంది. పథకం ప్రారంభించడంలో చూపిన ఆర్భాటం, ఆచరణలో మాత్రం చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అర్హులైన లక్షలాది మందికి ఉచితంగా బోర్లువేసి, పంపుసెట్లు బిగించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే వైఎస్సార్ జలకళ పథకం కూడా ఎన్నికల హామీగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.

నిబంధనలు సడలించాలి

ప్రభుత్వ నిబంధనలతో చాలా మంది చిన్న, సన్నకారు రైతులు ఈ పథకానికి అనర్హులు అవుతున్నారు. ఒకే చోట కనీసం రెండున్నర ఎకరాలు ఉంటేనే అర్హులని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో లక్షలాది చిన్న,సన్నకారు రైతులు వైఎస్సార్ జలకళ పథకానికి అర్హత సాధించలేకపోతున్నారు. నిబంధనలు సడలించి ఎకరా ఉన్న వారిని కూడా అర్హులుగా చేయాలని రైతులు కోరుతున్నారు.