ఏపీలో మొదలైన రెండో విడత పోలింగ్‌

ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 6.30గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటల వరకు కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో మధ్యాహ్నం 1.30 గంటల వరకు పోలింగ్‌ సమయంగా నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండో విడతలో 3,328 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ కాగా.. 539 చోట్ల సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లోని ఒక్కో గ్రామ పంచాయతీలలో సర్పంచ్‌ పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో మిగిలిన 2,786 చోట్ల సర్పంచ్‌ పదవులకు పోలింగ్‌ నిర్వహణ అధికారులు ఏర్పాట్లు చేశారు. రెండో విడత గ్రామాల్లో మొత్తంగా 2,786 గ్రామ పంచాయతీ సర్పంచ్‌ స్థానాలకు 7,507 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 33,570 వార్డులకు 12,604 ఏకగ్రీవమయ్యాయి. మరో 149 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో మిగిలిన 20,817 వార్డులకు పోలింగ్‌ జరుగుతుండగా.. 44,876 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. కాగా, ఎన్నికలు జరిగే 29,304 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు మొదలుకానుంది.