బీహార్‌లో ప్రారంభమైన రెండో దశ పోలింగ్

మూడు దఫాల్లో జరుగుతున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో ముఖ్యమైన ఘట్టంగా చెప్పుకుంటోన్న రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. భారీ భద్రత మధ్య 94 స్థానాలకు ఇవాళ పోలింగ్‌ జరుగుతోంది. ఇందుకోసం 17 జిల్లాల్లో మొత్తం 41,362 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మహాకూటమి తరఫున సీఎం అభ్యర్థిగా భావిస్తున్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌(రాఘోపుర్‌), ఆయన సోదరుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌(హసన్‌పుర్‌) పోటీ చేస్తున్న స్థానాలు రెండో దశ పోలింగ్‌ పరిధిలోనే ఉన్నాయి. నీతీశ్‌ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న నంద్‌ కిశోర్‌ యాదవ్‌-భాజపా(పట్నా సాహెబ్‌), శ్రవణ్‌కుమార్‌-జేడీయూ (నలంద), రామ్‌సేవక్‌ సింగ్‌-జేడీయూ(హథువా), రాణా రణ్‌ ధీర్‌ సింగ్‌-భాజపా(మధుబన్‌)ల భవితవ్యాన్నీ ఓటర్లు మంగళవారం నిర్దేశించనున్నారు.