పంట నష్టపోయిన ప్రతి రైతుని రాష్ట్రప్రభుత్వం ఆదుకోవాలి

అనంతపురం: మింగ్ జాం తుఫాన్ తీవ్రతకు పంట నష్టపోయిన ప్రతి రైతుని తక్షణమే రాష్ట్రప్రభుత్వం ఆదుకోవాలని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి పేర్కొన్నారు. శనివారం జయరాం రెడ్డి మీడియా ముఖంగా మాట్లాడుతూ… 20 రోజుల ముందే తుఫాను వస్తుందని హెచ్చరిక తెలిసినా? వ్యవసాయ శాఖ అధికారులు సరైన సమయంలో తగిన చర్యలు తీసుకోకపోవడం వలన, ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యం వలన, రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆరుకాలం శ్రమించి పండించిన పంట, పొలాలన్నీ తుఫాను తీవ్రతకు తీవ్రంగా దెబ్బతిని రైతులు నష్టపోవడం చాలా బాధాకరం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తుఫాను తీవ్రతకు పంట నష్టపోయిన అన్ని పంటల రైతులకు ప్రతి ఎకరాకు 20,000 తక్కువ కాకుండా నష్టపరిహారం అందించాలి. కల్లాలలో తుఫాను తీవ్రతకు తడిచిన ధాన్యాన్ని షరతులు లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం భేషరతుగా ధాన్యాన్ని సేకరించి రైతులకు తగిన నష్ట పరిహారం అందించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన విధానం చూస్తే.. జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల ఎడల ఎంత చిత్తశుద్ధి ఉందో? స్పష్టంగా అర్థం అవుతుంది. పంట నష్టపోయిన పంట పొలాల దగ్గరికి వెళ్లకుండా కేవలం రోడ్లపై కొంతమంది రైతులని పిలిపించుకొని పరామర్శించిన తీరు చాలా బాధాకరం. మాయ మాటలు కల్లిబొల్లి మాటలు చెప్పకుండా, ప్రకటనలకే పరిమితం కాకుండా తక్షణమే పంట నష్టపోయిన అన్ని పంటల రైతుల అందరికీ పంట నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా దారుణ పరిస్థితులు నెలకొన్నాయి పంట పెట్టే సమయంలో అనావృష్టి కారణంగా సకాలంలో వర్షాలు కురువకపోవడం వలన కొంతమంది రైతులు తీవ్రంగా నష్టపోయారు, మరి కొంతమంది రైతులు ఆరుకాలం శ్రమించి పంట చేతికొచ్చిన సమయంలో తుపాను ప్రభావం వలన పంట పండించిన రైతులు పూర్తిగా నష్టపోయారు. పంట నష్టపోయిన రైతులందరూ తీవ్ర ఒత్తిడిలో ఇంకా మేము ఎలా బతికేది అని మనోవేదనతో ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సహాయ సహకారాలు అందించి రైతులందరికీ భరోసా కల్పించి నష్టపరిహారం చెల్లించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని జయరాం రెడ్డి పేర్కొన్నారు.