రాష్ట్రానికి జనసేన-టీడీపీ కూటమి అవసరం

  • జనసేన నేత గురాన అయ్యలు

విజయనగరం: అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టానికి జనసేన – టీడీపీ కూటమి అవసరం ఎంతో ఉందని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. జనసేన పార్టీ నేత గురాన అయ్యలు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. వేడుకలలో భాగంగా కార్యకర్తలు, నేతలతో కలిసి కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ అదితి గజపతిరాజులను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ.. 2024 సంవత్సరంలో ఏపీ ప్రజలు తీసుకునే నిర్ణయం రాష్ట్ర పురోగతికి మేలు మలుపు కావాలన్నారు. టీడీపీ అనుభవం, జనసేన యువరక్తం కలిస్తే రాష్ట్రానికి అద్భుత పరిపాలన వస్తుందన్నారు. ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నూతన సంవత్సరంలో అందరం కష్టపడి పనిచేసి జనసేన- టీడీపీ కూటమిని గెలిపించుకుందామన్నారు. పవన్‌ కల్యాణ్‌ లాంటి వ్యక్తులు చాలా అరుదుగా వుంటారన్నారు. 2014లో జనం కోసం, రాష్ట్రం కోసం పోటీ చేయకుండా నిస్వార్థంగా మద్దతుగా నిలిచారన్నారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీతో పొత్తు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఏ పార్టీకి లేని యువ బలం జనసేనకు వుందన్నారు. ఏది సాధించాలన్నా యువతతోనే సాధ్యమన్నారు. గత ఎన్నికల్లో తండ్రిని చూసి కొడుక్కి ఓటు వేశారని, ఇప్పుడు మీ పిల్లల భవిష్యత్తు చూసి జనసేన – టీడీపీ కూటమికి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన-టీడీపీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.