ఆశయ బలంతో త్రికరణ శుద్ధిగా పని చేసే కార్యకర్తలే జనసేన బలం

• క్రియాశీలక సభ్యులే జనసేన కోర్ ఓటు బ్యాంకు
• క్రియాశీలక సభ్యత్వం కార్యకర్తలకు ఇచ్చే ధీమా
• దురదృష్టకర పరిస్థితుల్లో ఎంతో మందికి అండగా నిలిచాం
• పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్

ఇది మన పార్టీ అని భుజాన వేసుకుని ఆశయ బలంతో, త్రికరణ శుద్ధిగా పని చేసే కార్యకర్తలే జనసేన బలం అని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. జనసేన కోసం డబ్బు లేకుండా, ఏమీ ఆశించకుండా మనస్ఫూర్తిగా పని చేస్తున్నారన్నారు. అలాంటి కార్యకర్తల కుటుంబాలకు ఏమైనా చేయాలని ఆలోచించినప్పుడు రెండేళ్ల క్రితం క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించామని, క్లిష్ట పరిస్థితుల్లో కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకువెళ్లగలిగామని తెలిపారు. క్రియాశీలక సభ్యత్వాన్ని బీమా పథకంగా కాకుండా ఒక కోర్ ఓటు బ్యాంకుగా భావించాలన్నారు. మనసు పెట్టి పని చేస్తున్న పార్టీ వాలంటీర్లని ప్రోత్సహించాలని నాయకులకి సూచించారు. రాబోయే వారం రోజుల్లో కార్యక్రమాన్ని మరింత చురుగ్గా ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. బుధవారం సాయంత్రం పార్టీ పీఏసీ సభ్యులు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇంఛార్జులు, వివిధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గం సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియపై సమీక్షించి, కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే విధంగా దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “జనసేన పార్టీ కేవలం 150 మంది క్రియాశీలక సభ్యులతో ప్రారంభమైంది. ఈ రోజు లక్షల మంది రావడం.. గత ఏడాది ఆ సంఖ్య దాదాపు హాఫ్ మిలియన్ కి చేరడం ఆనందం కలిగించే విషయం. బయట సభలు, సమావేశాలకు వెళ్తున్న సందర్భంలో ఉత్సాహంగా వచ్చే కార్యకర్తలు పలు సందర్భాల్లో ప్రమాదవశాత్తు దెబ్బలు తగిలించుకోవడం చూసి.. రాజకీయ ప్రస్థానంలో అండగా ఉన్న వీరికి ఏమైనా చేయగలమా అని ఆలోచన వచ్చింది. ఆ సమయంలో శ్రీ మనోహర్ గారు, పార్టీ పెద్దలంతా ఆలోచన చేసి ఒక బీమా పథకం లాంటిది తీసుకురావాలని నిర్ణయించాం. రెండేళ్ల క్రితం క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించినప్పుడు ఎన్నో అపోహలు, అనుమానాలు ఉన్నాయి. అన్నింటినీ అధిగమించి దురదృష్టకర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయిన 106 మంది క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున బీమా పథకం కింద అందచేశాం. గాయపడిన 180 మందికి మెడికల్ ఇన్సూరెన్స్ చెక్కులు అందచేశాం. ఇంటికి సరైన పైకప్పు కూడా లేని పరిస్థితుల్లో పార్టీ మీద నమ్మకంతో రూ. 500 సభ్యత్వం స్వీకరించి దురదృష్టకర పరిస్థితులు ఏర్పడినప్పుడు అలాంటి కుటుంబాలకు బీమా పథకం అండగా నిలచింది. క్రియాశీలక సభ్యత్వ నమోదుపై నియోజకవర్గాలు, జిల్లాల బాధ్యులంతా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాలి. ఇది కేవలం పార్టీకి చేస్తున్న సభ్యత్వం కాదు. మీ వెంట నడిచే కార్యకర్తల కోసం, వారి కుటుంబాల కోసం ఒక ధీమా అందించే కార్యక్రమంగా గుర్తించాలి. వాలంటీర్లను ప్రోత్సహించాలి. క్రియా వాలంటీర్లుగా చేరిన ఓ లారీ డ్రైవర్ 120 మందికి, టైలర్ 150 మందికి సభ్యత్వాలు చేశారు. తాపీ పని చేసే వ్యక్తి తన బిడ్డల భవిష్యత్తు కోసం అంటూ రూ. 2 లక్షల విరాళం ఇచ్చారు. వీరంతా బలమైన వాలంటీర్లుగా తయారై వందల్లో సభ్యత్వాలు చేయిస్తున్నారు. తెలంగాణలో కూడా కార్యక్రమం బలంగా సాగుతోంది. రానున్న రోజుల్లో కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకువెళ్లాలి. ప్రతి ఒక్కరు ఒక నిర్ధిష్టమైన లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగాలి. త్రికరణశుద్దిగా అనుకున్న లక్ష్యానికి చేరాలని కోరుకుంటున్నాను” అన్నారు.
• క్రియాశీలక సభ్యత్వాన్ని పవిత్రమైన కార్యక్రమంగా భావించాలి: శ్రీ నాదెండ్ల మనోహర్
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ.. “క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియను ఒక పవిత్రమైన కార్యక్రమంగా ముందుకు తీసుకువెళ్లాలి. రాజకీయాల్లో ఎవరూ ఇటువంటి కార్యక్రమం చేపట్టలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో పార్టీ అధ్యక్షుల వారికి అంతా రుణపడి ఉంటాం. ఈ ఏడాది కూడా ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూ. కోటి విరాళం ఈ రోజు అందించారు. ప్రతి జిల్లాలో కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 70 వేల మంది కొత్తగా క్రియాశీలక సభ్యులుగా చేరారు. సోమవారం నుంచి అధ్యక్షుల వారి సూచన మేరకు అంతా సభ్యత్వాలు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. నాయకులంతా క్షేత్ర స్థాయిలో పర్యటించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల”ని తెలిపారు.