లక్ష్యం 120 రోజులు

  • టిడిపి గన్ అయితే జనసేన బుల్లెట్
  • మనం చేయాల్సింది రాజకీయం కాదు – యుద్దం
  • జనసేన, టిడిపి సమన్వయ సమావేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఉద్వేగ భరిత ప్రసంగం

తిరుపతి: టిడిపి నాయకులు అనుభవం ఉన్న గన్ లు అయితే జనసేన యువత బుల్లెట్లు లాంటి వారన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. గన్ లేకపోయినా బుల్లెట్లు పనికి రావని… బుల్లెట్లు లేకపోతే గన్ లు పనిచేయవన్నారు. గన్, బుల్లెట్లు కలిశాయని జగన్ ను గద్దె దింపడం ఖాయమన్నారు. బుధవారం కపిలతీర్థం వద్ద ఉన్న టిడిపి కార్యాలయంలో జరిగిన జనసేన, టిడిపి సమన్వయ సమావేశంలో ఆయన ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. జనసేన, టిడిపి కలయికను రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రజలు ఆహ్వానిస్తున్నారన్నారు. అన్నదమ్ముల కలయికలా రెండు పార్టీలు ఉమ్మడిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బలవంతుడైన రాక్షసున్ని ఓడించాలంటే ఈ కలయిక చాలా అవసరమన్నారు. ఇరు పార్టీలు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ముందుకు సాగాలన్నారు. ఇప్పటి వరకు ట్రెండ్ ను ఫాలో అయ్యామని ఇకపై ట్రెండ్ సెట్ చేస్తామన్నారు. వైసిపి పతనం ఖాయమని జోస్యం చెప్పారు. 2019 లో ఒక్క అవకాశం అంటే ప్రజలు ఓటు వేశారన్నారు. ఇప్పుడు ఆ ఓటు వేసిన ప్రజలే కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు టిడిపి జనసేన కు ఓటు వేయాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యారని, ఆ విషయం జగన్ కు కూడా తెలుసన్నారు. అయినా సరే శకుని చేతిలో పాచికలాగ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారన్నారు. ఇప్పుడు చేయాల్సింది రాజకీయం కాదన్నారు. యుద్దానికి సిద్దం కావాలని రెండు పార్టీల నేతలకు పిలుపునిచ్చారు. ఈ అరాచక పాలనపై ప్రజలకు భయం ఉందని, ఆ ప్రజలకు ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత రెండు పార్టీలపై ఉందన్నారు. ఏకపక్షంగా వైసిపి కండువాలు కప్పుకొని పనిచేస్తున్న వ్యవస్థలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రజలు అడుగుతున్నది పధకాలు కాదని స్వాతంత్ర్యం కావాలని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్నది ప్రజా స్వామ్యమా? నియమనతృత్వమా? అని ప్రశ్నించారు. ఎన్నికలకు 120 రోజుల సమయం ఉందని, అందుకు ప్రతి ఒక్కరూ సన్నద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. తిరుమలలో అన్నం ప్రసాదంగా ఇస్తుంటే నీటిని మాత్రం 60 రూపాయలకు కొనాల్సి వస్తోందన్నారు. తిరుపతిలో ఏ విధంగా అభివృద్ధి మాటున అవినీతి జరుగుతుందో ప్రజలందరూ గమనిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ మాజీ ంళా సుగుణమ్మ, జనసేన తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షులు రాజారెడ్డి, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, టీడీపీ అబ్సర్వర్ సురేంద్ర కుమార్, జనసేన టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.