ఏపీకి వరుసగా పొంచి ఉన్న తుఫాన్ల ముప్పు.. డిసెంబర్ లో బురేవి, టకేటి తుఫాన్లు

ఇప్పటికే నివర్ తుఫాను తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అతలాకుతలం చేసిన విషయం విదితమే. అయితే భారీ వర్షాలు, వరదల కారణంగా, తుఫానుల కారణంగా దెబ్బతిన్న ఏపీకి ఇంకా వర్షాలు వరదల బెడద ఉందని చెప్పింది వాతావరణ శాఖ. మరో రెండు తుఫాన్ల ముప్పు ఉందని వాతావరణ విభాగం మరో హెచ్చరిక జారీ చేసింది.

మరోపక్క చిత్తూరు జిల్లాలోని తిరుపతి సమీపంలో వాయుగుండం కొనసాగుతోంది తిరుపతి కి 35 కిలోమీటర్లు నెల్లూరుకు 70 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇది మరింత బలహీనపడి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ వాయుగుండం ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వాతావరణ శాఖ వివరాల ప్రకారం చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

ఈనెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం …

ఈనెల 29వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. అది తీవ్ర వాయుగుండంగా మారనుందని , అది తుఫానుగా మారే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

డిసెంబర్ 2వ తేదీన ‘బురేవి’ తుఫాన్

డిసెంబర్ నెలలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో రెండు తుఫాన్ల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. డిసెంబర్ 2వ తేదీన ‘బురేవి’ తుఫాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావం వల్ల ఉత్తర తమిళనాడు, దక్షిణాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

డిసెంబర్ 5 న ‘టకేటి’ తుఫాన్

ఇక డిసెంబర్ 5వ తేదీన మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, ఈ అల్పపీడన ప్రభావంతో ‘టకేటి’ తుఫాను ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ‘టకేటి’ తుఫాను ప్రభావంతో డిసెంబర్ 7వ తేదీన దక్షిణ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.