నవ్యాంధ్రకు ఖరారైన ‘మూడు రాజధానులు’

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభoకానుంది. రాజధాని లేకుండా ఏర్పడిన నవ్యాంధ్రకు ఇప్పుడు ‘మూడు రాజధానులు’! పరిపాలనా రాజధానిగా విశాఖ! న్యాయ రాజధానిగా కర్నూలు! శాసన రాజధానిగా అమరావతి! సర్కారు పెద్దల ‘మూడు’ కార్యరూపం దాల్చేలా… వికేంద్రీకరణ. సీఆర్డీయే రద్దు బిల్లులను గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదించారు. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపిన గంటల వ్యవధిలోనే సంబంధిత చట్టాలను నోటిఫై చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.

ఏపీ న్యాయశాఖ కార్యదర్శి మనోహర్ రెడ్డి పేరుతో శుక్రవారం రాత్రి జారీ అయిన ఈ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా.. మూడు రాజధానులు వెంటనే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. సమీకృత అభివృద్ధి చట్టం-2020ను అనుసరించి శాసనసభ అమరావతిలోను, సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయాలు, రాజ్ భవన్ తదితర భవనాలు కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలోనూ ఉంటాయని, అలాగే, జ్యుడీషియల్ రాజధానిగా కర్నూలు ఉంటుందని, అక్కడ హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చొరవ చూపుతందని గెజిట్ లో పేర్కొన్నారు.

సీఆర్డీఏ రద్దు బిల్లు ఆమోదంతో ఇకపై ఆ ప్రాంతాన్ని ‘అమరావతి మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ ఏరియా’గా వ్యవహరించబోతున్నట్లు న్యాయశాఖ కార్యదర్శి మనోహర్ రెడ్డి జారీ చేసిన గెజిట్ నోట్ లో ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే, విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ ఏరియాను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా పిలుస్తారు. కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ ఏరియాను జ్యూడీషియల్ క్యాపిటల్‌గా పిలుస్తారు. ఈ మూడు రీజియన్లను ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ చట్టం – 2016 కింద నోటిఫికేషన్ జారీ చేసి ఏర్పాటు చేస్తారు.