వైసీపీ ప్రభుత్వానికి మత్స్యకారులను ఆదుకోవాలన్న మనసు లేదు

•సమయమంతా స్వార్ధ రాజకీయాలకే వృథా చేస్తున్నారు
•లక్షల కోట్లు ఖర్చు చేస్తారు.. గ్రామాల్లో మంచినీటి సదుపాయం ఉండదు
•హార్బర్ నిర్మాణం మాటలకే పరిమితం
•కేంద్రం నుంచి ప్రోత్సాహకాలు ఉన్నా ప్రభుత్వానికి పట్టదు
•బటన్లు నొక్కుతారు ఫించన్లు పడవు
•మత్స్యకారుల సమస్యల పట్ల చిత్తశుద్ది ఉన్న పార్టీ జనసేన మాత్రమే
•జనసేన అధికారంలోకి వస్తే హార్బర్లు నిర్మిస్తాం.. రక్షిత మంచినీరు అందిస్తాం
•డి.మత్స్యలేశం గ్రామంలో మత్స్యకారులతో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్


వైసీపీ ప్రభుత్వానికి మత్స్యకారులను ఆదుకోవాలన్న మంచి మనసు లేదు.. మానవత్వం లేదు.. వారి కోసం మంచి కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన అంతకంటే లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు మత్స్యకారుల్ని కేవలం ఓటు బ్యాంకుగా చూస్తూ.. నిత్యం రాజకీయాలకే పరిమితమై.. సుపరిపాలన అందించాల్సిన సమయం అంతా స్వార్ధ రాజకీయాలకే వృధా చేస్తున్నారని ఆరోపించారు. జనసేన పార్టీ మత్స్యకారుల సంక్షేమం కోసం నిజాయితీగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. జనసేన పార్టీ అధికారంలోకి రాగానే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, రక్షిత మంచినీటి సౌకర్యానికి తొలి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా, ఎచ్చర్ల నియోజకవర్గం, డి.మత్స్యలేశం గ్రామంలోని తీర ప్రాంతంలో పర్యటించారు. ఆ గ్రామానికి చెందిన మత్స్యకారులతో గంటకు పైగా మాట్లాడారు. ఆ గ్రామ మత్స్యకారుల్లో కొందరు చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్ ఖైదీలుగా చిక్కారు. వారితోనూ, వారి కుటుంబ సభ్యులతోను మాట్లాడారు. ప్రభుత్వ విధానాల కారణంగా వారు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మత్స్యకారులను ఉద్దేశించి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “తీర ప్రాంతాల్లో నివశించే మత్స్యకారుల సమస్యలు తెలుసుకుని వాటిని శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లి, జనసేన పార్టీ తరఫున వారికి ఏ విధంగా అండగా నిలబడతామనే విషయాన్ని తెలియచెప్పడానికి ఇక్కడికి వచ్చాం. 2018లో తిత్లీ తుపాను సంభవించినప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కలసి ఈ గ్రామాన్ని సందర్శించాం. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు ఏ మాత్రం మారలేదు. చిన్న చిన్న మౌలిక సదుపాయాలు కూడా ప్రభుత్వం కల్పించలేకపోతోంది. లక్షల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వం ఈ గ్రామంలో కనీసం తాగు నీటి సదుపాయం ఎందుకు కల్పించలేకపోతోంది.
* మత్స్యలేశం ప్రాంతం నుంచి 10 వేల మంది వలస వెళ్లారు
ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నా పట్టించుకోరా.. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరిశ్రమలు వెదజల్లే రసాయన వ్యర్ధాల కారణంగా 17 రకాల చేపలు ఈ ప్రాంతం నుంచి దూరంగా వెళ్లిపోయాయని తెలిసింది. ఈ గ్రామం పరిసరాల నుంచి 10 వేల మంది ఉపాధి కోసం వలసలు వెళ్ళిపోగా.. మత్స్యలేశం గ్రామం నుంచి వేటకు వెళ్లే వారు కేవలం ఆరుగురు మాత్రమే మిగలడం చాలా బాధాకరం.
•జెట్టీలు కడితే వలసలు వెళ్లాల్సిన అవసరం ఏంటి?
మత్స్యకారుల సమస్యల పట్ల జనసేన పార్టీకి ఉన్న చిత్తశుద్ది ఏంటో అందరికీ తెలుసు. గత ఎన్నికల్లో మత్స్యకార గ్రామాల అభ్యున్నతి కోసం పార్టీ మానిఫెస్టోలో కొన్ని అంశాలు పొందుపరిచాం. పేద మత్స్యకారుల కోసం మానిఫెస్టోలో పొందుపరిచిన కార్యక్రమాలు చేయాల్సి ఉంది. ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి రూ.20 కోట్లు మించి ఖర్చవదు. అతి తక్కువ సమయంలో నిర్మాణం పూర్తి చేయోచ్చు. కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు కూడా ఉన్నాయి. అయినా ఈ ప్రభుత్వానికి పట్టదు. గుజరాత్ తీరం వెంబడి ప్రతి 20 కిలోమీటర్లకు ఓ హార్బర్ ఉంటుంది. 150 కిలోమీటర్ల మేర ఉన్న శ్రీకాకుళం తీర ప్రాంతంలో అలాంటివి ఏడు జెట్టీలు నిర్మించే అవకాశం ఉంది. అలాంటి ప్రయత్నాలు జరగకపోవడం దురదృష్టకరం. జెట్టీలు కడితే మత్స్యకారులు వలసలు పోవాల్సిన పని లేదు. ఇక్కడే ఉపాధి అవకాశాలు దొరుకుతాయి.
•నాయకులు చిత్తశుద్దితో పని చేయాలి
జనసేన పార్టీ తరఫున దాని కోసం ప్రత్యేక కార్యక్రమం రూపొందించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చే విధంగా ముందుకు తీసుకువెళ్తాం. పిల్లలను చదివించేందుకు ఓ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి శిక్షణ ఇప్పించే ఏర్పాటు చేస్తాం. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చి ముద్దులు పెట్టుకుంటూ తిరిగే వ్యక్తులు జనసేన పార్టీలో లేరు. మేము నిజాయితీగా పని చేస్తాం. మత్స్యకారులకు అండగా నిలబడతాం. జనసేన పార్టీ ప్రభుత్వం రాగానే ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపడతాం. రక్షిత మంచినీటి పథకం ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెంపొందించే విధంగా కృషి చేస్తాం. నాయకులు సరిగా పని చేయకపోవడం వల్లే ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. నాయకులు చిత్తశుద్దితో పని చేస్తే ఈ పరిస్థితి ఉండదు. జనసేన పార్టీ అలా చేయదు. కోవిడ్ సమయంలో గుజరాత్ లో మత్స్యకారులు చిక్కుకుంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట స్పందించి అక్కడ ప్రభుత్వాలతో మాట్లాడి ఇబ్బందులు కలగకుండా చూశారు. మా జనసైనికులు భోజనాలు ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ మీకు అండగా నిలబడుతుంది. ఇక్కడ మెడికల్ క్యాంపులు నిర్వహించి ఆరోగ్యపరమైన ఇబ్బందులు రాకుండా చూస్తాం. మత్స్యకారులకు అన్ని విధాలా అండగా ఉంటాం.
•మీ పోరాటానికి జనసేన మద్దతిస్తుంది
మేము ఓట్ల కోసం రాలేదు. మత్స్యకారుల సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం పోరాటం చేయడానికి వచ్చాం. హార్బర్లు అన్నారు… వందల కోట్ల కేటాయింపులు అన్నారు.. ఇక్కడ చూస్తే ఏమీ లేదు. బటన్లు మాత్రం నొక్కుతున్నారు. ఇక్కడ ఫించన్లు మాత్రం రావడం లేదు. మత్స్యకారుల ఇబ్బందులు తెలుసుకుని నిజాయితీగా స్పందించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఈ ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కోసం చేసే పోరాటానికి జనసేన పార్టీ మద్దతు ఇస్తుందని మాటిస్తున్నాం” అన్నారు.
•మత్స్యకారులకు అండగా నిలచిన ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్: శ్రీ బొమ్మిడి నాయకర్
జనసేన మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ శ్రీ బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ “మత్స్యకారులను ఈ ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తోంది. మత్స్యకారుల సమస్యలు తెలుసుకుని వారికి ఉపయోగపడే విధంగా ఒక్కరు కూడా కార్యక్రమాలు చేయడం లేదు. 197 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లా మొత్తానికి ఒక్క జెట్టీ కూడా నిర్మాణం లేకపోవడాన్ని మించిన దౌర్భాగ్యం ఏముంటుంది. పాదయాత్రలో ముఖ్యమంత్రి గారు హామీలు ఇచ్చుకుంటూ వెళ్లారు. ఒక్క సమస్య పరిష్కరించలేదు. మత్స్యకారులకు అండ గా నిలచిన ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారే. 217 జీవోపై మత్స్యకార భరోసా సభ నిర్వహించి పోరాటం చేశారు. మనమంతా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలవాలి అని పిలుపునిచ్చారు.
•ఇక్కడ జెట్టీలు ఉంటే వలసలు పోవాల్సిన పనేంటి?:డి.మత్స్యలేశం గ్రామ మత్స్యకారులు
గ్రామ తీర ప్రాంతంలో వలలకు మరమ్మతులు చేస్తున్న మత్స్యకారుల్ని శ్రీ మనోహర్ గారు కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలు ఏకరువు పెట్టారు. ఒకసారి టీడీపీకి ఓటు వేశాం.. జెట్టీలు కడతామన్నారు. కట్టేలేదు. ఇప్పుడు వైసీపీకి వేశాం. ఓట్లు వేసేంత వరకు మీకు న్యాయం చేస్తామన్నారు. తర్వాత పట్టించుకోలేదు. మా ఒక్క గ్రామం నుంచే 3 వేల మందికి పైగా వలసలు వెళ్లిపోయారు. గుజరాత్ తీరంలో ప్రతి 20 కిలోమీటర్లకు ఒక జెట్టీ ఉంది. ఇక్కడ 100 కిలోమీటర్లకు కూడా ఒక్క జెట్టీ లేదు. జెట్టీలు లేకే ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నాం. అక్కడికి వెళ్లాక మా పరిస్థితులు ఎలా ఉంటాయో అర్ధం కాని పరిస్థితి. ఇక్కడ జెట్టీలు ఉంటే వలసలు పోవాల్సిన పని లేదుగా. లక్షల పెట్టుబడి పెట్టి బోట్లు కొనుక్కున్నా రోజుకి వెయ్యి కూడా రావడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.
•ఒక్క రోజు దాటితే ఫించన్ ఉండదు
మత్స్యకారులకు 40 ఏళ్లకే ఫించన్ ఇస్తామన్నారు. ఒక నెల తీసుకోకపోతే రద్దు చేసేస్తున్నారు. ఫించన్ కి దరఖాస్తు చేసుకుని అది శాంక్షన్ అయ్యాక.. వేట కోసం వలసలు పోతాం. అది రద్దయిపోతుంది. చాలా మంది మత్స్యకారులు ఒక్క నెల కూడా తీసుకున్న దాఖలాలు లేవని వాపోయారు. ఒక్క రోజు దాటినా.. వేటకు వెళ్లి సమాయానికి రాకపోయినా ఇక ఫించన్ పోయినట్టేనని తెలిపారు. రూ. 10 వేల మత్స్యకార భరోసా కూడా అందరికీ అందడం లేదని చెప్పారు. గత ఏడాది లబ్దిదారులు ఈ ఏడాది లబ్దిదారులు కాకుండా పోతున్నారు. అదేమంటే మీకు 100 ఎకరాలు ఉంది.. 70 ఎకరాలు ఉందని చెబుతున్నారు. మీ సేవకు వెళ్లి అడిగితే మీ పేరుతో ఏమీ లేదంటారు. వాలంటీర్లు తెలియదంటారు. సచివాలయానికి వెళ్లి నిలదీస్తే బెదిరిస్తున్నారని శ్రీ మనోహర్ గారికి వివరించారు. మా సమస్యలన్నీ శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాలని.. హార్బర్ల నిర్మాణం కోసం చేసే పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
•మా వారు పాకిస్థాన్ కి దొరికిపోయారు
గుజరాత్ వలస వెళ్లి సాగర జలాల్లో పాకిస్థాన్ కి చిక్కిన శ్రీ రామారావు అనే మత్స్యకారుడి భార్య మాట్లాడుతూ.. మా కుటుంబ సభ్యులు వలసలు వెళ్తే వేటకు వెళ్లి తిరిగి వచ్చే వరకు ఎక్కడ ఉన్నారో తెలియని మా ప్రాంత మహిళల్లో భయం. నేను 7 నెలల కడుపుతో ఉన్నప్పుడు మా వారు పాకిస్థాన్ చేతికి చిక్కారు. వారి కోసం 22 మంది మహిళలం కలసి గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్లాం. ఇక్కడ హార్బర్ లేకపోవడంవల్లే ఎక్కడికో వలస పోయి దొరికిపోవాల్సి వచ్చింది. హార్బర్ ఇక్కడే ఉంటే కుటుంబాన్ని చూసుకుంటూ ఉండొచ్చంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ కోన తాతారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి, పార్టీ నేతలు డా.మూగి శ్రీనివాస్, సుందరపు విజయ్ కుమార్, కళ్యాణం శివ శ్రీనివాస్, డా.విశ్వక్షేన్, కోరాడ సర్వేశ్వరరావు, గేదెల చైతన్య, దాసరి రాజు, పేడాడ రామ్మోహన్ రావు, బి.ఈశ్వర రావు, దుర్యోధన రెడ్డి, సందీప్ పంచకర్ల, పి.వి.ఎస్.ఎన్.రాజు, బోడపాటి శివదత్ తదితరులు పాల్గొన్నారు.