ప్రజా క్షేత్రంలో ధైర్యంగా పోరాడండి

* జనసేన పార్టీకి వీర మహిళలే ప్రధాన బలం
* మహిళలకు జనసేన పార్టీ పూర్తి ప్రాధాన్యమిస్తుంది
* ఎన్నికల రణక్షేత్రంలోనూ ముందుండాలి
* విజయనగరంలో వీర మహిళలతో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాటామంతీ


మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలరు.. వారికి ఉన్న ఓపిక, పట్టుదల అనిర్వచనీయం. జనసేన పార్టీకి ప్రధాన బలం వీర మహిళలే. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని అందిపుచ్చుకొని, ఆయన కోసం నిత్యం క్షేత్రస్థాయిలో నిజాయితీగా పనిచేసే వీర మహిళలకు జనసేన పార్టీ అన్ని రకాలుగా ప్రాధాన్యమిస్తుందని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఉదయం ఆయనను కలిసేందుకు వచ్చిన ఉత్తరాంధ్ర జిల్లాల వీర మహిళలతో ప్రత్యేకంగా మాట్లాడారు. క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ “పార్టీ తలపెట్టే ప్రతి కార్యక్రమంలోనూ వీర మహిళలు ముందుంటారు. వచ్చే రోజుల్లో సైతం మహిళలకు పూర్తిస్థాయి ప్రాధాన్యం ఇవ్వాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు. జనసేన పార్టీని ముందుండి నడిపించాల్సిన బాధ్యత వీర మహిళలపై ఉంది. స్థానికంగా ఉండే సమస్యలను వీర మహిళలు గుర్తించాలి. ఆ సమస్యలు పరిష్కారమయ్యేలా ప్రణాళికాబద్ధంగా, ప్రజాస్వామ్య యుతంగా పోరాడాల్సిన అవసరం ఉంది. కచ్చితంగా పార్టీ నుంచి అన్ని విధాల సహకారం ఉంటుంది. ఈ పోరాటం మొదట కష్టంగా ఉన్నా తర్వాత ప్రజల మద్దతు కచ్చితంగా ఉంటుంది. మహిళలు చిత్తశుద్ధితో కష్టపడితే కచ్చితంగా పది మంది మద్దతు సమకూరుతుంది. ఈ ప్రభుత్వ తీరు మీద ప్రజలంతా తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. వీర మహిళలు కచ్చితంగా వారిని చైతన్యవంతం చేసి ప్రజా సమస్యల మీద పోరాడేలా చూడండి. జనసేన పార్టీ బలం నిజాయతీ. ప్రజల సమస్యల మీద చాలా సీరియస్ గా దృష్టి పెడతాం. అవి పూర్తిస్థాయిలో పరిష్కారం అయ్యే వరకు వదిలి పెట్టొద్దు. నాయకత్వం అంటే పదిమందిని కలుపుకొని వెళ్లి ప్రజా సమస్యలను తీర్చడమే. ఎవరో మాకు సహకరించడం లేదు. మాకు ఏ కార్యక్రమం ఉన్నా చెప్పడం లేదు అంటూ అనుకోవద్దు” అన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి, వీర మహిళ ప్రాంతీయ సమన్వయకర్తలు శ్రీమతి తుమ్మి లక్ష్మీ రాజ్, శ్రీమతి కిరణ్, శ్రీమతి నాగలక్ష్మి, శ్రీమతి శరణి, శ్రీమతి త్రివేణి, పార్టీ నేత శ్రీమతి లోకం నాగ మాధవి తదితరులు పాల్గొన్నారు.
* అమ్మా… నీ పోరాటం ఓ పాఠం
అధికార పార్టీ అదిలింపులకు ఆమె అదిరిపోలేదు.. పోటీ నుంచి తప్పుకోవాలన్న బెదిరింపులకు బెదిరిపోలేదు. 65 ఏళ్ల వయసు. అప్పటి వరకు ఎన్నికల్లో ఓటు వేయడం తప్ప పోటీ చేయడం అంటే ఏంటో తెలియని అమాయకత్వం. ఓటు ఎలా అడగాలో సరిగా తెలియని అయోమయం. ఇల్లు గడవాలి అంటే కొడుకు వ్యవసాయమే దిక్కు. ఇవన్నీ శ్రీమతి ఎచ్చెర్ల పార్వతి గారిని అడ్డుకోలేకపోయాయి. ఒకటే లక్ష్యం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి… ఒకటే మాట శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి. అదే నినాదం.. నమ్మకంతో ఆమె స్థానిక సంస్థల ఎన్నికల్లో చీపురుపల్లి మండల జడ్పిటీసీగా జనసేన పార్టీ తరఫున పోటీలో నిలిచారు. అధికార పార్టీ అండబలం, కండబలం, ఆర్ధికబలం ఆమెను అడ్డుకోలేకపోయాయి. ఎన్నికల్లో ధైర్యంగా ముందుకు వెళ్లారు. మండలంలో ప్రతి గ్రామం తిరిగారు. ప్రతి ఒక్కరిని తనకు ఓటు వేయాలని అడిగారు. జనసేన పార్టీ నినాదాన్ని, సిద్ధాంతాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. డబ్బులు ఇస్తామని వైసీపీ నాయకులు పెట్టిన ఆశలను దాటుకుని, జెండా కడితే ఊరుకోం అనే హెచ్చరికలు బేఖాతరు చేస్తూ శ్రీమతి పార్వతి ఎన్నికలు చేశారు. చీపురుపల్లి లాంటి కీలకమైన రాజకీయ నేపథ్యం ఉన్న ప్రాంతంలో 65 ఏళ్ల పార్వతి 1000కిపైగా ఓట్లు సాధించారు. అప్పటి నుంచి నేటి వరకు శ్రీమతి పార్వతి ఇంటి మీద జనసేన జెండా ఎగురుతూనే ఉంది. అప్పట్లో ఆమెకు మద్దతు తెలిపేందుకు కూడా ముందుకు రాని జనం ఇప్పుడు నువ్వు గెలిస్తే బాగుండేది… ఈ సారి నీకే ఓటు వేస్తాం అని చెప్పడం శ్రీమతి పార్వతి నైతిక విజయం. ఈ 65 ఏళ్ల వీర మహిళ తన ఎన్నికల అనుభవాలను, తనకు ఎదురైన అవమానాలను, ఇబ్బందులను జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి ముందు వివరించారు. ఆమె తెగువకు, పోరాట స్ఫూర్తి కి మనోహర్ గారు వినమ్రంగా నమస్కరించారు. ఎలాంటి కష్టం వచ్చినా ధైర్యంగా పోటీలో నిలిచిన శ్రీమతి పార్వతి గారి పోరాటం చాలా గొప్పది అని, ఇది జనసైనికులు అందరికీ ఒక స్ఫూర్తి పాఠం అని మనోహర్ గారు చెప్పారు. అధికార పార్టీ నుంచి ఎలాంటి సమస్య వచ్చినా జనసేన పార్టీ భరోసాగా నిలుస్తుందని శ్రీమతి పార్వతికి శ్రీ మనోహర్ గారు హామీ ఇచ్చారు.