రైతు కుటుంబాలను ఆదుకుంటే వైసీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారు

గుంటూరు, ఆరుగాలం పండించిన పంట చేతికి రాక … వచ్చిన పంటకు గిట్టుబాటు ధరలేక అప్పులపాలై దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను మానవతా దృక్పథంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదుకుంటుంటే వైసీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు.కుటుంబ పెద్ద దిక్కుని కోల్పోయిన కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని విమర్శించారు. తన కష్టార్జితంతో సంపాదించిన డబ్బుతో వారికి కొండంత అండగా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ ని అభినందించాల్సింది పోయి విమర్శలకు దిగటం సిగ్గుచేటన్నారు. బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాను సాధించవచ్చుగా అంటూ మాజీమంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఎన్నికల సమయంలో 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తాను అంటూ బీరాలు పోయిన ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాగానే మోడీ ముందు మొకరిల్లాడని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వ 151 మంది శాసనసభ్యులు, 28 మంది పార్లమెంట్ సభ్యులు తాము చేతకాని వాళ్ళం, దద్దమ్మలం అని ప్రకటిస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ హోదా సాధనకు కృషి చేస్తారన్నారు. అంబటి రాంబాబుకు తన శాఖ కన్నా పవన్ కళ్యాణ్ ని విమర్శించటానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రి పదవి పోవటంతో పాటూ తన నియోజకవర్గ ప్రజలే 1500 కోట్ల అవినీతికి పాల్పడ్డావని బహిరంగంగా నిలదీయటంతో మంత్రి వెల్లంపల్లికి మతిభ్రమించిందన్నారు. రాష్ట్రంలో రోజురోజుకీ జనసేన పార్టీకి పెరుగుతున్న ప్రజా మద్దతు చూసి వైసీపీ నేతల వెన్నులో వణుకు మొదలైందన్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి పట్టం గట్టిన అన్ని వర్గాల ప్రజలు ఈ రోజున వైసీపీ నేతల్ని తమకు జరిగిన అన్యాయంపై నిలదీస్తున్నారన్నారు. గడప గడప కార్యక్రమంలో వైసీపీ నేతలు బిక్కుబిక్కుమంటూ తిరుగుతున్నారని , ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహాన్ని వైసీపీ శాసనసభ్యులు తట్టుకోలేక తూ తూ మంత్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని గాదె వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు.

పేదలకు దూరమైన సంక్షేమం

మాది సంక్షేమ ప్రభుత్వం, మేము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దేశానికే తలమానికం అంటూ గొప్పలు చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం పేద బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమాన్ని నిబంధనల పేరుతో సంక్షోభంలోకి నెట్టివేసిందని జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి విమర్శించారు. రోజుకో నిబంధన విధిస్తూ సంక్షేమ పథకాల్లో భారీ కోతలు విధిస్తున్నారని, దీంతో లక్షలాది మంది అభాగ్యుల జీవితాలు ఎలాంటి ఆదరణ లేక చిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరీ దుర్మార్గంగా ఒంటరి మహిళలకు ఇచ్చే పింఛన్ లలోనూ కఠిన నిబంధనలు విధించి వారిని మరింత మానసిక క్షోభకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఒంటరి మహిళలకు ఇచ్చే పింఛన్ లలోని నిబంధనలను ఒక్కసారిగా 35 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు పెంచటం పేదల పట్ల వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న నిరంకుశానికి నిదర్శనం అన్నారు. ఇప్పటికే అమ్మఒడి, చేయూత వంటి పథకాలలో కఠినమైన నిబంధనలు విధించి ఎంతో మందికి లబ్ది చేకూరకుండా చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర పరిపాలనా నిఘంటువులో అభివృద్ధి అనే పదాన్నే తీసేసారని కనీసం ప్రజలకు సంక్షేమాన్ని అన్నా సక్రమంగా అంధించాలని కోరారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రానున్న రోజుల్లో ప్రజల పక్షాన జనసేన పెద్దఎత్తున ఉద్యమిస్తుఒదని, ప్రజలెవ్వరూ అధైర్య పడాల్సిన పనిలేదని, రానున్న రోజుల్లో ప్రజా ప్రభుత్వం వస్తుందని ఆళ్ళ హరి అన్నారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు అడపా మాణిక్యాలరావు, ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, నగర కార్యదర్శి నెల్లూరి రాజేష్, బాలు, సతీష్, మధులాల్, మహంకాళి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.