అమెరికా సుప్రీంకోర్టు జడ్జిగా బారెట్‌ ప్రమాణ స్వీకారం

ఆమీ కానే బారెట్ అమెరికా సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిత జడ్జిగా బారెట్ అమెరికా సుప్రీంకోర్టులో కీలకంగా మారనున్నారు. ఆమీ బారెట్‌ను డెమోక్రాట్లు వ్యతిరేకించినా.. రిపబ్లికన్ సేనేటర్లు మాత్రం ఆమెకే పట్టం కట్టారు. 52-48 ఓట్ల తేడాతో రిపబ్లికన్ సేనేటర్లు ఆమీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో సుప్రీంకోర్టు జడ్జిగా బారెట్ నియమితురాలయ్యారు. ఆ వెంటనే ఆమె వైట్‌హౌజ్ లాన్స్‌లో జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా న్యాయవ్యవస్థపై తన మార్క్ ప్రభావాన్ని చూపించాలనుకున్న ట్రంప్‌కు ఇదో పాజిటివ్ సంకేతమే. అయితే అమెరికా ప్రజలపై ప్రభావం చూపనున్న అబార్షన్‌, ఒబామాకేర్ లాంటి అంశాలపై బారెట్ తీర్పులు కీలకంకానున్నాయి. అమెరికా సుప్రీంకోర్టులో 48 ఏళ్ల బారెట్ చేరికతో కన్జర్వేటివ్‌ల సంఖ్య పెరిగినట్లు అయ్యింది. 2017లో నీల్ గోర్‌సుచ్‌, 2018లో బ్రెట్ కవనాగ్‌లను ట్రంప్ నియమించిన విషయం తెలిసిందే.

బారెట్ నియామకం పట్ల స్పందించిన ట్రంప్‌.. అమెరికా చరిత్రలో ఇదో చరిత్రాత్మక దినం అన్నారు. మన దేశ న్యాయ కోవిదుల్లో బారెట్ అత్యుత్తమురాలు అని, తన వృత్తిలో బారెట్ అసాధారణ న్యాయ నిర్ణయాలను వెల్లడిస్తారన్నారు. బారెట్ చేత మరో సుప్రీం జస్టిస్ క్లారెన్స్ థామస్ ప్రమాణ స్వీకారం చేయించారు.