రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆడపడుచుల మానప్రాణాలకు భద్రత లేదు

• తెలంగాణాలోనూ ఆడపడుచుల అదృశ్యాలు పెరిగిపోయాయి
• తెలంగాణ యువత దగాపడింది.. గాయపడింది..
• గద్దరన్న స్ఫూర్తితో ఒడిదుడుకులున్నా జనసేనను ముందుకు నడిపిస్తున్నాం
• సార్వత్రిక ఎన్నికల్లో జనసేన – బీజేపీ అభ్యర్ధులను గెలిపించండి
• సూర్యాపేట సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్

‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆడపడుచుల మానప్రాణాలకు భద్రత లేని పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్రతో పాటు తెలంగాణలోనూ ఆడపడుచుల అదృశ్యాలు ఎక్కువైపోయాయి. వెనుకబాటుకు గురైన తెలంగాణ అభివృద్ధి సాధించాలన్నా.. ఆడపడుచుల మాన ప్రాణాలకు భద్రత కావాలన్నా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని డబుల్ ఇంజన్ సర్కారు తెలంగాణలో అధికారంలోకి రావాల’ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. శ్రీ మోదీ గారి నాయకత్వంలో బీసీలకు అండగా ఉండే విధంగా అవతరించిన భారతీయ జనతా పార్టీకి జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నట్టు తెలిపారు. అందర్నీ సమంగా చూసే దృష్టితో శ్రీ మోదీ గారి నాయకత్వంలోని బీజేపీ సర్కారు సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ నినాదంతో ముందుకెళ్తున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన – బీజేపీ అభ్యర్ధులకు మద్దతుగా సూర్యాపేట శ్రీ పొట్టి శ్రీరాములు సర్కిల్ లో నిర్వహించిన విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రసంగించారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఈ సభలో పాల్గొన్నారు. సూర్యాపేట సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ “నీళ్ళు, నిధులు, నియమకాలలో చూపిన తేడాలే తెలంగాణ సాధనకు కారణమయ్యాయి. జనసేన పార్టీ ఆవిర్భావానికి కూడా తెలంగాణ ప్రాంతంలోని నల్గొండ జిల్లానే మూల కారణం. తమ్ముడు చిత్రం ఘన విజయం తర్వాత 100 రోజుల పండుగ ఆడంబరాలు లేకుండా నిర్వహించాలని అప్పట్లో నిర్ణయించాం. నల్గొండ జిల్లాలోని ఓ ఫ్లోరోసిస్ బాధిత గ్రామాన్ని దత్తత తీసుకుని వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని సంకల్పిస్తే కొన్ని రాజకీయ శక్తులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నాయి. అప్పట్లో నా శ్రేయోభిలాషులు, అభిమానులు ప్రజా సేవ చేయాలంటే రాజకీయ రంగప్రవేశమే సరైన మార్గమని సూచించారు. నల్గొండలో ఓ ఫ్లోరోసిస్ బాధిత గ్రామానికి నీరందించలేకపోయిన పరిస్థితుల్లో చేసిన సంకల్పమే జనసేన పుట్టుకకు కారణం. తర్వాత 2009లో జిల్లాలోని ఫ్లోరోసిస్ బాధిత గ్రామాల్లో తిరిగాను. వారి కష్టాలు కళ్లారా చూశాను. అప్పుడు నాకు అర్ధం అయ్యింది.. తెలంగాణ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడం కోసం తెలంగాణకు మద్దతు ఇస్తూనే అత్యధిక శాతం ఉన్న బీసీ కులాల రాజ్యాధికారానికి కృషి చేయాలి అని.
• తెలంగాణ తల్లికి చేయగలిగినంతా చేస్తాను
గాయపడ్డ ప్రజా పాట.. విప్లవ నౌక గద్దరన్న బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి అంటూ చేసిన గర్జన తాలూకు స్ఫూర్తి నన్ను ప్రభావితం చేసింది. గద్దరన్న అనారోగ్యంతో ఉన్నప్పుడు పలుకరించేందుకు వెళ్లినప్పుడు ఆయన అన్న మాటలు ఇంకా నాకు గుర్తున్నాయి. తెలంగాణ యువత ధగా పడింది. తెలంగాణ యువత గాయపడింది. రాజకీయం గొప్ప కార్యక్రమం. ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, అడ్డంకులు వచ్చినా యువత పక్షాన, ఆడపడుచుల పక్షాన నిలబడాలి. కులం, మతం బేధం లేకుండా అందరికీ అండగా నిలబడాలి అన్న ఆ గద్దరన్న మాటలే జనసేన పార్టీని ముందుకు నడిపిస్తున్నాయి. సనాతన ధర్మం, సోషలిజాన్ని పక్క పక్కన నడపవచ్చని తెలంగాణ ఉద్యమకారులు చాటి చెప్పారు. శ్రీ దాశరథి రంగాచార్య గారు, శ్రీ గద్దరన్నలు విప్లవానికి చిహ్నమైన ఎరుపు రంగు, సనాతన ధర్మానికి గుర్తుగా కాషాయాన్ని కలిపి ముందుకు వెళ్లారు. శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా కులం, మతం బేధం లేకుండా దేశం మొత్తాన్ని సమ దృష్టితో చూస్తారు. అందుకే వారికి జనసేన మనస్ఫూర్తిగా మద్దతిస్తోంది. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 100కుపైగా అసెంబ్లీ స్థానాల్లో, జనసేన 8 సీట్లలో పోటీ చేస్తున్నాయి. కోదాడ నుంచి జనసేన అభ్యర్ధిగా శ్రీ మేకల సతీష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున సూర్యాపేట నుంచి శ్రీ సంకినేని వెంకటేశ్వరరావు, హుజూరాబాద్ నుంచి శ్రీమతి శ్రీలత రెడ్డి గారు, తుంగతుర్తి నుంచి శ్రీ కడియం రామచంద్రయ్య బరిలో ఉన్నారు. వీరి విజయానికి మనస్ఫూర్తిగా కృషి చేయాలని కోరుకుంటున్నాను. జనసేన – బీజేపీ శ్రేణులు కలసికట్టుగా కృషి చేయండి. దశాబ్దంగా రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని జనసేన పార్టీ నిలబడింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పరిస్థితులు తట్టుకుని నిలబడ్డామంటే అందుకు తెలంగాణ యువత తాలూకు పోరాట స్ఫూర్తే కారణం. నాకు పునర్జన్మనిచ్చిన తెలంగాణ తల్లికి నేను నిలబడేంత.. నేను చేయగలిగినంత చేస్తాను” అన్నారు. సభలో మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ బూర నరసయ్య గౌడ్, జనసేన, బీజేపీ, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.