ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు – రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు, కొంతమంది వాలంటీర్లు ప్రజల డేటాను సేకరించి సంఘ విద్రోహశక్తులకు అందజేస్తున్నారని, దానివల్ల అరాచకాలు జరుగుతున్నాయని వారాహి విజయ యాత్రలో పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేస్తే దొంగల ప్రభుత్వం కొంత మందితో కేసులు పెట్టించిందని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. జనసేన పార్టీ ఏలూరు నియోజవర్గ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ కొంత మంది వాలంటీర్లు చేస్తున్న అత్యాచారాలు, అక్రమాలకు వైసీపీ నాయకులు అండదండలు ఇవ్వడం దుర్మార్గమైన చర్యని మండిపడ్డారు. ఏలూరు జిల్లా దెందులూరులో పదవ తరగతి చదువుతున్న బాలికపై వాలంటీర్ నీలాపు శివకుమార్ అత్యాచారం చేశాడని, నిందితునికి వైసీపీ నాయకులు అండగా ఉంటున్నారన్నారు. బాలిక ఇంటికి వెళ్లి ఎవరూ లేని సమయంలో వారి తల్లిదండ్రుల ఆధార్ కార్డులు కావాలని చెప్పి బాలికను లొంగదీసుకుని వాలంటీర్ శివకుమార్ అత్యాచారం చేశాడన్నారు. ఈ విషయం తల్లిదండ్రులు చెబితే చంపేస్తానని బెదిరించి పలుమార్లు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్నారు. వాలంటీర్ శివకుమార్ పై బాలిక తల్లిదండ్రులు ఏలూరు దిశ పోలీస్ స్టేషన్ కి వెళ్లగా అధికారులు లేరని ఫిర్యాదు తీసుకోలేదన్నారు. కేసు నమోదుకు తాత్సారం చేశారన్నారు. చివరకు తల్లిదండ్రుల ఒత్తిడి నేపథ్యంలో ఎట్టకేలకు అక్టోబర్ 5వ తేదీన కేసు నమోదు చేశారని, దర్యాప్తు చేయకుండా నిందితులను మీరే పట్టుకు రావాలని బాధితులకు పోలీసులు తెలిపారన్నారు. హత్యలు, దొంగతనాలు, అత్యాచారాలు, దోపిడీలు, దౌర్జన్యాలు చేసే వారిని బాధితులే పట్టుకుంటే ఇక పోలీసు వ్యవస్థ ఎందుకని రెడ్డి అప్పలనాయుడు నిలదీశారు. వాలంటీర్ కు స్థానిక వైసిపి నాయకులు అండగా ఉండడం వల్లే పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే బాలికను అత్యాచారం చేసిన వాలంటీర్ శివకుమార్ ను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డీఐజీ, ఎస్పీలకు రెడ్డి అప్పలనాయుడు సూచించారు. శనివార పేటలో రుణాలు ఇప్పిస్తానని ఒక మహిళను వాలంటీర్ మోసం చేయడమే కాకుండా అగత్యానికి పాల్పడ్డాడని, ఆ వాలంటీర్ పై బాధితురాలు ఎమ్మెల్యే ఆళ్శ నానికి ఫిర్యాదు చేసిందని, ఏ విధమైన చర్యలు తీసుకోలేదన్నారు. కొంత మంది వాలంటీర్ల అండతో వైసిపి ప్రజా ప్రతినిధులు అరాచకాలుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈనెల 19వ తేదీన ఏలూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో అజెండా అంశాలపై 50 మంది కార్పొరేటర్లు చర్చించాలని, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే ఆళ్ల నానికి దండ వెయ్యలేదని, గౌరవించలేదని అశోక్ నగర్ లోని హిందూ స్మశాన వాటికలో ఉన్న షెడ్డును కుట్రపూరితంగా కూల్చివేయించాడన్నారు. మళ్లీ ఆ ప్రాంతంలో షెడ్డు నిర్మించేందుకు 97 లక్షల 57 వేల రూపాయలు నిధులు కేటాయిస్తున్నట్లు 8వ అంశంలో పేర్కొనడంపై రెడ్డి అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శవాల మీద పేలాలు ఏరుకుంటున్నట్లుగా ఎమ్మెల్యే, మేయర్ల వ్యవహార శైలి ఉందన్నారు. కేవలం కమీషన్ల కోసమే ఉన్న వాటిని కూల్చివేసి మళ్లీ నిర్మాణాలకు ముందుకు వస్తున్నారని దుయ్యబట్టారు. కౌన్సిల్లో 22 అంశాలపై చర్చ జరగాలని, ప్రజల పక్షాన నిలవాలని కార్పొరేటర్లకు సూచించారు. కౌన్సిల్ లో ఉన్న ముగ్గురు టిడిపి కార్పొరేటర్లు అన్ని అంశాలపై చర్చకు పట్టు పట్టాలని అభ్యంతరాలు ఉంటే నిలదీయాలి, డీసెంట్ ఇవ్వాలన్నారు. జనసేన పార్టీకి చెందిన ఒక్క కార్పొరేటర్ ఉన్నా కౌన్సిల్లో అవినీతి, అక్రమాలు, జరిగేలా ఏకపక్షంగా అధికారపక్షం తీర్మానాలు చేస్తుంటే అడ్డుకొని, నిలదీసి డీసెంట్ ఇచ్చేవారన్నారు. స్టాండింగ్ కమిటీ తీసుకునే నిర్ణయాలను అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అత్యవసరంగా కొన్ని నిర్ణయాలు మాత్రమే స్టాండింగ్ కమిటీ తీసుకునే హక్కు ఉందన్నారు. అయితే కోట్లాది రూపాయల పనులను కూడా కౌన్సిల్ తీర్మానాలు లేకుండా చేస్తున్నారన్నారు. కార్పొరేషన్ కు ఆదాయం ఎలా వస్తుంది? ఏ విధంగా వస్తుంది? ఎంత ఖర్చు అవుతుంది అన్న విషయాలపై గౌరవ వేతనంగా తీసుకుంటున్న కార్పొరేటర్లు కౌన్సిల్లో చర్చించాలన్నారు. ఎమ్మెల్యే, మేయర్లు వాస్తవాలను దాచిపెట్టి ఇంకా ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వారి మోసాలను ప్రజలు గ్రహించారని ఇక నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. మీడియా సమావేశంలో జనసేన పార్టీ ఏలూరు నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, నాయకులు సరిది రాజేష్, అల్లు సాయి చరణ్, బొత్స మధు, పసుపులేటి దినేష్, నూకల సాయి ప్రసాద్‌, బొండా రాము, ఎండి ప్రసాద్, వినోద్, వల్లూరి వంశీ తదితరులు పాల్గొన్నారు.