ఏలూరు వింత వ్యాధి బాధితుల్లో మరో ఇద్దరు మృతి.. ఇతర అనారోగ్య సమస్యలే కారణం

ఏపీలోని ఏలూరు వాసుల్లో వింత వ్యాధి బాధితుల్లో ఇద్దరు మరణించారు. ఈ వ్యాధి కారణంగా తీవ్ర అస్వస్థతకు గురవుతున్న రోగులకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఏలూరు వాసుల్లో ఇప్పుడు వింత వ్యాధి గుబులు రేపుతోంది. తాజాగా ఈ వ్యాధితో మరో ఇద్దరు మరణించారు. ఈ వ్యాధి కారణంగా తీవ్ర అస్వస్థతకు గురవుతున్న రోగులను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే మొత్తం 30మందిని తరలించగా.. వారిలో సుబ్బరావమ్మ (56), అప్పారావు (50) బుధవారం మృతి చెందారు.

అయితే సుబ్బరావమ్మ కరోనాతో.. అప్పారావు టీబీతో బాధపడుతున్నారని.. వారి వల్లే చనిపోయారని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఆదివారం రాత్రి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మైనేని శ్రీధర్ చనిపోవడం విషాదం నింపింది.

కరోనా వింత వ్యాధి బారినపడ్డ బాధితుల సంఖ్య 592కి చేరింది. ఇప్పటివరకు 511 మంది రోగులను డిశ్చార్జ్ చేయగా.. ప్రస్తుతం 46 మంది ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.పరిస్థితి విషమంగా ఉన్న మరో 33 మంది గుంటూరు, విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

రోజురోజుకు వింత వ్యాధి విస్తరిస్తుండడం.. దానికి కారణం తాగునీటిలో ‘లెడ్’ అవశేషాలు పెరగడం అన్న నివేదికల నేపథ్యంలో ఏలూరులో ఇప్పుడు టెన్షన్ వాతావరణం నెలకొంది.