కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి: జనసేన డిమాండ్

అవనిగడ్డ నియోజకవర్గం: గతంలో గ్రామాలలో కోత విధించిన, విద్యుత్ శాఖ అధికారులు ప్రస్తుతం మండల ప్రధాన కేంద్రాలలో రాత్రి సమయాలలో విద్యుత్ కోతలు విధిస్తూ, ప్రజలకు నరకం చూపిస్తున్నారని అవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలు నివారిస్తూ, నిరంతర సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మండల పార్టీ ఆధ్వర్యంలో గురువారం విద్యుత్ సహాయక ఇంజనీర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శేషుబాబు మాట్లాడుతూ రాత్రి సమయంలో విద్యుత్ కోత కారణంగా చిన్న పిల్లలు, వృద్దులు నిద్ర లేకుండా బాధలు పడుతున్నారని, కూలీలు, సామాన్య ప్రజలు పగలు కూలీ పని చేసుకుని రాత్రి దోమల బాధతో నిద్ర లేక నరక యాతన అనుభవిస్తుంటే, పాలక పక్షంకు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇకమీదట విద్యుత్ కోతలు విధిస్తే, కొవ్వొత్తులతో సబ్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేస్తామని చెప్పారు. ట్రూ అప్ చార్జీలు అని, సర్దుబాటు చార్జీలు అని, విద్యుత్ పన్ను అని, కస్టమర్ చార్జీలు అని, సర్వీసు చార్జీలు అని, బొగ్గు కొనుగోలు చార్జీలు అని, విద్యుత్ స్తంభాలు నిలబెట్టే చార్జీలు అని, 2014 నుండి 2019 వరకు వాడుకున్న కరెంటుకు ఇప్పుడు చార్జీలు అని, 2021లో బొగ్గు కొనుగోలుకు, 2023 లో బొగ్గు కొనుగోలు కు ఇప్పుడు చార్జీలు అని.. వివిధ రూపాలలో వసూలు చేసే ఈ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ను త్వరగా గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్షంలో ఉండగా విద్యుత్ చార్జీలు పెంచనని మాట ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారు గతంలో వాడుకున్న కరెంటు కు ఇప్పుడు చార్జీలు వసూలు చేయడం దారుణం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బొప్పన భాను, వార్డు మెంబర్ మునిపల్లి శ్రీలక్ష్మి, రామచంద్రా పురం గ్రామ వార్డు మెంబర్ కమ్మిలి సాయి భార్గవ, బచ్చు కృష్ణ కుమారి, భోగాది రాజ్యలక్ష్మి, యర్రంశెట్టి సుబ్బారావు, పప్పుశెట్టి శ్రీను, ఫరీద్, గుడివాక రామాంజనేయులు, నలిగిలి రాజేష్, తుంగల నరేష్, గరికిపాటి శ్రీను, మత్తి శ్రీను, రంగనాథ్, గరికిపాటి వెంకటేశ్వరరావు, గంటా ఏడుకొండలు, రేపల్లె రోహిత్, తుంగల చరణ్ తేజ్ తదితరులు పాల్గొన్నారు.