వీరమహిళలు సరికొత్త రాజకీయ విప్లవానికి నాంది పలకాలి

• గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ముందుకు వెళ్లాలి
• వీర మహిళలు రాజకీయాలతో పాటు సగటు మనిషికి సాయపడేలా పనిచేయాలి
• త్వరలో వీర మహిళా విభాగం జిల్లా, మండల స్థాయి కమిటీలు
• వీర మహిళ విభాగం ప్రాంతీయ కమిటీల సభ్యుల సమావేశంలో నాదెండ్ల మనోహర్

వీర మహిళలు రాజకీయాలతో పాటు సగటు మనిషికి సాయపడేలా పని చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు పిలుపునిచ్చారు. సరికొత్త రాజకీయ వ్యవస్థకు వీర మహిళలు రూపునివ్వాలని కోరారు. స్వేదం చిందించే అన్నదాతకు, గ్రామీణ కూలీలకు జనసేన పార్టీ అండగా నిలిచే విధంగా ప్రత్యేక కార్యక్రమాలకు ప్రాంతీయ మహిళా కమిటీలు రూపకల్పన చేయాలని సూచించారు. బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ వీర మహిళా విభాగం ప్రాంతీయ కమిటీల సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సేంద్రీయ సాగు.. గ్రామీణ మహిళలకు ఆర్థిక సాధికారిత అంశం మీద ప్రాంతాల వారీగా చేపడుతున్న కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “గ్రామీణుల జీవితాల్లో వెలుగులు నింపేలా వీర మహిళలు కృషి చేయాలి. మొదట ప్రాంతీయ కమిటీల్లోని ప్రతి వీర మహిళ ఒక కార్యక్రమాన్ని కొత్త ఆలోచనను మొదలుపెట్టండి. పది మందికీ స్ఫూర్తిని నింపేలా ఆ కార్యక్రమాలు ఉండాలి. ఎలాంటి గొప్ప మార్పు అయినా ఓ చర్య ద్వారానే మొదలు కావాలి. ఆ మార్పు మీ ద్వారా సాకారమవ్వాలి. జనసేన పార్టీకి వీర మహిళలే ప్రత్యేక బలం.. బలగం. పవన్ కళ్యాణ్ గారు మీ నుంచే ఓ కొత్త మార్పుకు శ్రీకారం చుట్టాలని కోరుకుంటున్నారు. ఆ మార్పు తీసుకువచ్చేందుకు మీరంతా సిద్ధం కావాలి. కేవలం వీర మహిళలు అంటే రాజకీయాలకే పరిమితం కాకుండా ఉన్నంతలో పది మందికి సహాయపడే వ్యక్తులుగా తీర్చిదిద్దాలన్నది మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష.
• చేతులు దులుపుకొనే కార్యక్రమాలు వద్దు
వీర మహిళా విభాగం ప్రాంతీయ కమిటీల ఆధ్వర్యంలో ‘గ్రామీణ ప్రాంతాల్లో సేంద్రీయ సాగు – మహిళా సాధికారత’ అనే అంశాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను అప్పగించారు. మీరు మొదట కొంత మంది మహిళలను గుర్తించి వారిని బృందాలుగా తీర్చిదిద్దండి. వారికి ఆర్ధిక తోడ్పాటు అందించే కార్యక్రమాలు మొదలుపెట్టండి. ఈ కార్యక్రమాలు మరో పది మందిని కదిలించేలా ఉండాలి. ఏదో వితరణ చేసి చేతులు దులుపుకొనే ప్రక్రియలు చేపట్టవద్దు. ప్రతి జిల్లా నుంచి ఒక వినూత్న ఆలోచనతో ముందుకు వెళ్దాం. మీ ఆలోచనలు గ్రామీణ మహిళలకు రైతు కూలీలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. మొదటి నుంచి చివరి వరకు గ్రామీణులకు మేలు జరిగేలా జనసేన పార్టీ తరఫున పూర్తి బాధ్యతలు స్వీకరించండి.
• జిల్లా స్థాయి మహిళా సదస్సులు నిర్వహించండి
సేంద్రీయ సాగుకు ఎంతో భవిష్యత్తు ఉంది. అయితే అది మొదలు పెట్టిన తర్వాత మూడు నుంచి నాలుగు దఫాలు పంట సాగు చేసిన తర్వాత మాత్రమే ప్రకృతి సిద్ధమైన పంటగా గుర్తిస్తారు. అవసరం అయితే దీనికి సంబంధించి నిపుణులతో చర్చించండి. వచ్చే నెలాఖరు నాటికి అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు మొదలుకావాలి. మే నెలాఖరులోపు జిల్లా స్థాయి వీర మహిళా విభాగం సమావేశాలు ప్రాంతాల వారీగా పూర్తి చేయాలి. ఈ సమావేశాల అజెండా ఒక్కటే జనసేన పార్టీలో వీర మహిళలకు భాగస్వామం కల్పించాలి. పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎలా పని చేయాలి అనే అంశాల మీద చర్చించండి. ప్రాంతీయ కమిటీలు ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు వేయలేదు. జిల్లా అధ్యక్షులతో చర్చించి ముందుగా జిల్లాల వారీ సమావేశాలు నిర్వహించండి. వీర మహిళా విభాగం ప్రాంతీయ కమిటీలు చేపట్టే ప్రతి కార్యక్రమంలో పార్టీ నాయకులందరినీ భాగస్వాముల్ని చేయండి. సమావేశాలకు అందర్నీ ఆహ్వానించండి. త్వరలో వీర మహిళా విభాగానికి సంబంధించి జిల్లా స్థాయి, మండల స్థాయి కమిటీల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. ఆ ప్రక్రియలో ప్రాంతీయ కమిటీల తరఫున మీ వంతు భాగస్వామ్యం ఉండేలా చూసుకోండి. ఎవరి జిల్లా బాధ్యతలు వారికి అప్పగించాం. మీకు అప్పగించిన బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాం. ఇది రాజకీయాల్లో సరికొత్త మార్పుకు నాంది కావాలి” అన్నారు.
* స్వచ్ఛంద సేవా ఉద్యమం తరహాలో ముందుకు వెళ్దాం- పి.హరిప్రసాద్
అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ మాట్లాడుతూ.. “వీర మహిళా విభాగం ఆధ్వర్యంలో మొదలు పెట్టబోయే ఈ వినూత్న కార్యక్రమాన్ని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లిన స్వచ్ఛంద సేవా ఉద్యమం తరహాలో ముందుకు తీసుకువెళ్లాలి. ఒక గొప్ప లక్ష్యంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొదలు పెట్టదలచిన ఈ కార్యక్రమాన్ని వీర మహిళలు చిత్తశుద్దితో ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. జనసేన పార్టీకి మహిళా సానుభూతిపరులు మొదటి నుంచి ఎక్కువే. అయితే వారు కేవలం సభలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. వారిని గుర్తించి రోజు వారీ పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చేసే విధంగా వీర మహిళా విభాగం ప్రాంతీయ కమిటీలు పాటు పడాలి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల మీద దృష్టి సారించాల”న్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.