‘యాక్షన్’ నష్టం విశాల్‌ భరించాలి

‘యాక్షన్’ సినిమా నష్టాలన్నీ భరించాలని తీర్పునిస్తూ మద్రాస్ హైకోర్టు హీరో విశాల్‌కు షాకిచ్చింది.  ఈ నేపథ్యం లో వెంటనే రూ. 8.29 కోట్లను నిర్మాతలకు చెల్లించాలని ఆదేశించింది. వాస్తవానికి ‘యాక్షన్’ సినిమాను తక్కువ బడ్జెట్‌తో నిర్మించాలని మొదటిగా నిర్మాతలు భావించారు. అయితే ఆ చిత్రం కనీసం రూ. 20 కోట్లు కలెక్ట్ చేయకపోతే నష్టాలను తానే భరిస్తానని విశాల్ వారికి భరోసా ఇవ్వడంతో చివరికి రూ. 44 కోట్లతో నిర్మించారు.

కాగా, ‘యాక్షన్’ సినిమా భారీ పరాజయం పొందింది. దీనితో నష్టాన్ని పూడ్చే క్రమంలో తన తదుపరి చిత్రం ‘చక్ర’ను ట్రైడెంట్ బ్యానర్‌పై నిర్మిస్తానని విశాల్ నిర్మాతలకు మాటిచ్చాడు. అయితే ఆ మాటను పక్కన పెట్టి ‘చక్ర’ సినిమాను విశాల్ తన నిర్మాణ సంస్థపై తెరకెక్కించాడు. దీనితో ఆ సినిమా ఓటీటీ విడుదలను నిలిపివేయడమే కాకుండా.. తమకు న్యాయం చేయాలంటూ నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు నిర్మాతలకు విశాలే డబ్బులు చెల్లించాలని చెప్పడమే కాకుండా.. ‘చక్ర’ సినిమాను ఓటీటీలో విడుదల చేసుకునేందుకు అనుమతి కూడా ఇచ్చింది.

మద్రాసు హైకోర్టు తీర్పు నేపథ్యంలో విశాల్‌ నెల రోజుల గ్యాప్‌ లో ఆ మొత్తంను నిర్మాణ సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. లేని పక్షంలో కోర్టు దిక్కారం కింద కేసు నమోదు అవుతుందని హెచ్చించారు. ఈ కేసును పై కోర్టుకు తీసుకు వెళ్లేందుకు విశాల్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరికొందరు మాత్రం ఆ చిత్ర నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటే బెటర్‌ అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి విశాల్‌ ఏం చేస్తాడు అనేది చూడాలి.