నీటి తటాకాలు.. బురద రోడ్లు.. అస్తవ్యస్తంగా జగనన్న కాలనీలు

• జగనన్న మోసాన్ని ఎండగట్టిన జనసేన శ్రేణులు
• రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ డిజిటల్ క్యాంపెయిన్
• గృహనిర్మాణ శాఖ మంత్రి నియోజకవర్గంలో పోలీసుల ఆంక్షలు… అరెస్టులు

నీటి తటాకాలు.. బురద రోడ్లు.. మొండి గోడలు.. పైకి తేలిన పునాదులు.. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీల దుస్థితి ఇది. నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో ఇంటి పట్టాలు ఇచ్చి జగన్ సర్కార్ చేసిన మోసాన్ని ప్రపంచానికి తెలియజెప్పే బృహత్తర కార్యక్రమానికి జనసేన పార్టీ శ్రీకారం చుట్టింది. చినుకు పడితేనే వరదలు వచ్చే జగనన్న కాలనీల స్వరూపాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజెప్పే కార్యక్రమాన్ని నిర్వహించింది. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జగనన్న కాలనీలను జనసేన 

పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు సందర్శించి అక్కడున్న వాస్తవ పరిస్థితిని ఫోటోలు, వీడియోల ద్వారా ప్రపంచానికి తెలియచెప్పారు. జగనన్న కాలనీల కోసం సేకరించిన భూమిలో కోట్లాది రూపాయలు వెనకేసుకున్న వైసీపీ నేతలు, పేదలకు పట్టాలు పంపిణీ పేరుతో వారిని నిండా ముంచిన వైనాన్ని కళ్లకు కట్టారు. కనీసం ఇల్లు కట్టుకోవడానికి కూడా వీలు లేని ప్రాంతాల్లో వారు పడుతున్న బాధలు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన జనసేన నేతలను సైతం కదిలించాయి. చాలా చోట్ల లబ్ధిదారులే తమ వెతలను బాధలను చెబుతూ స్వయంగా జగనన్న కాలనీల వద్దకు జనసేన నాయకులను తీసుకువెళ్లి పరిస్థితిని వివరించారు. ఇక గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న పెడన నియోజకవర్గంలో జగనన్న కాలనీ దుస్థితిని వివరించే ప్రయత్నం చేసిన జనసేన శ్రేణులను పోలీసుల సాయంతో అడ్డుకుని అక్రమ అరెస్టులకు పాల్పడ్డారు. జగనన్న కాలనీల మోసాన్ని బట్టబయలు చేసిన డిజిటల్ క్యాంపెయిన్ లో పార్టీ పీఏసీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇంచార్జులు, వీర మహిళలు, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులతోపాటు మండల కమిటీల సభ్యులు సైతం తమ తమ పరిధిలో క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టారు.
• గోదావరి జిల్లాల్లో…
జగనన్న కాలనీల పేరుతో వైసీపీ ప్రభుత్వం పేదలను నిలువునా ముంచిదని జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇంఛార్జ్ శ్రీ కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో జన సైనికులు, వీరమహిళలతో పాటు వెళ్లి జగనన్న లే అవుట్లను పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు నీట మునిగిన పునాదులను ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాకినాడ రూరల్

, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో పీఏసీ సభ్యులు శ్రీ పంతం నానాజీ, శ్రీ పితాని బాలకృష్ణ, వివిధ నియోజకవర్గాల్లో ఇంచార్జులు, జన సైనికులు, వీర మహిళల ఆధ్వర్యంలో జగనన్న కాలనీల పరిశీలన కార్యక్రమం జరిగింది. అడుగు లోతు నీటిలో మునిగిన అసంపూర్తి నిర్మాణాలను ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల పరిధిలోని జగనన్న కాలనీలన్నింటీలోనూ వర్షపు నీటితో నిండి ఉన్న దృశ్యాలే దర్శనమిచ్చాయి. వర్షాలు తగ్గి రెండు రోజలు గడుస్తున్నా నీరు పోయే దారిలేక, కాలనీల్లో రోడ్లు సైతం నీటిలో నిండి ఉన్నాయి. కొన్ని కాలనీల్లో మొకాలు లోతు బురదతో నిండిపోయాయి. ఇళ్ల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావుతో పాటు అన్ని నియోజకవర్గాల ఇంఛార్జులు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించారు.
• ఉమ్మడి కృష్ణాలో ఉద్రిక్తతల మధ్య..
ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన శ్రేణుల జగనన్న కాలనీల సందర్శన కార్యక్రమం ఉద్రిక్తతల నడుమ సాగింది. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న పెడన నియోజకవర్గం కేంద్రంలో పైడమ్మతల్లి కాలనీకి సమీపంలో జగనన్న కాలనీ సందర్శనకు వెళ్లిన శ్రీ యడ్లపల్లి రామ్ సుధీర్, ఇతర నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. జగనన్న కాలనీలు సాక్షిగా మంత్రి జోగి రమేష్ అక్రమాలు బయటపడతాయనే తమను అక్రమంగా అరెస్టు చేయించినట్టు ఈ సందర్భంగా పార్టీ నాయకులు మండిపడ్డారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేన శ్రేణులు జగనన్న కాలనీల మోసాన్ని బట్టబయలు చేశాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ పెనమలూరు, గన్నవరం, పెడన, అవనిగడ్డ తదితర నియోజకవర్గాల పరిధిలో స్థానిక పార్టీ నాయకులతో కలసి జగనన్న కాలనీలు సందర్శించారు. తాను సందర్శించిన అన్ని కాలనీల్లోనూ మోకాల్లోతు నీరు నిలిచి ఉండడాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
• పడవలో కాలనీ పరిశీలన
మచిలీపట్నం నియోజకవర్గ కేంద్రానికి సమీపంలోని కరగ్రహారం జగనన్న కాలనీని ఆ నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ బండి రామకృష్ణ పడవలో వెళ్లి సందర్శించాల్సి వచ్చింది. అది నీటి సరస్సా, జగనన్న కాలనీనా అధికార పార్టీ నాయకులే చెప్పాలని డిమాండ్ చేశారు. పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో శ్రీ తాడిశెట్టి నరేష్, శ్రీ బూరగడ్డ శ్రీకాంత్ ల ఆధ్వర్యంలో అన్ని మండలాల పరిధిలో జగనన్న కాలనీల దుస్థితిని పార్టీ శ్రేణులు ఎండగట్టాయి. విజయవాడ పట్టణ వాసుల కోసం ఇబ్రహీంపట్నం వద్ద జగన్న కాలనీని పార్టీ అధికార ప్రతినిధి శ్రీ పోతిన మహేష్ సందర్శించి వైసీపీ మోసాన్ని ఎండగట్టారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు గన్నవరం నియోజకవర్గం వణుకూరు లేఅవుట్ దుస్థితిని కళ్లకు కట్టారు. మైలవరం నియోజకవర్గంలో ఇంఛార్జ్ శ్రీ అక్కల రామ్మోహన రావు, నూజివీడు నియోజకవర్గంలో శ్రీ బర్మా ఫణిబాబు, శ్రీ మరీదు శివరామకృష్ణల ఆధ్వర్యంలో నాలుగు మండలాల పరిధిలో జగనన్న లేఅవుట్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించారు.
• చెరువుల్ని తలపించిన ఉమ్మడి గుంటూరు జిల్లా జగనన్న కాలనీలు
ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ జగనన్న కాలనీల సందర్శన కార్యక్రమం జరిగింది. తాడికొండ నియోజకవర్గ కేంద్రంలో నీటి మడుగు మధ్య ఉన్న జగనన్న కాలనీ చిత్రాలను బంధించి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. శ్రీ నయూబ్ కమాల్ ఆయనతో పాటు జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సూచన మేరకు తెనాలి నియోజకవర్గం సిరిపురం, తెనాలి శివారు గోలిడొంకల్లోని జగనన్న కాలనీల్లో దుస్థితిని స్థానిక నాయకులు చిత్రించారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ బండారు రవికాంత్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీ ఇస్మాయిల్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గం, దుగ్గిరాల మండలం పెద్దకొండూరు శివార్లలో మూడేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన జగనన్న కాలనీలో వర్షాలకు బురదమయంగా మారిన రోడ్లను నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసైనికులు కళ్లకు కట్టారు. నరసాపురం పట్టణ పరిధిలో రాష్ట్ర కార్యదర్శి శ్రీ సయ్యద్ జిలానీ జగనన్న కాలనీల దుస్థితిని ఎండగట్టారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో పార్టీ శ్రేణులు జగనన్న కాలనీల పేరిట జరిగిన మోసాన్ని సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.
• ప్రకాశం జిల్లావ్యాప్తంగా…
ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అస్తవ్యస్తంగా ఉన్న జగనన్న కాలనీలను జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో నిర్వహించారు. కొత్తపట్నం మండలంలోని జగనన్న కాలనీని శ్రీ రియాజ్ పార్టీ శ్రేణులతో కలసి వెళ్లి పరిశీలించారు. పర్చూరు నియోజకవర్గం, చిన్నగంజాం మండల కేంద్రంలోని జగనన్న కాలనీ దుస్థితిపై పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పెదపూడి విజయ్ కుమార్ వివరించారు. గిద్దలూరు, దర్శి నియోజకవర్గాల్లో ఇంఛార్జులు శ్రీ బొటుకు రమేష్, శ్రీ బెల్లకొండ సాయిబాబు, సంతనూతలపాడు నియోజకవర్గం మద్దిపాడు మండలలో పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి రాయపాటి అరుణల ఆధ్వర్యంలో జగనన్న కాలనీల మోసాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా ఎండగట్టారు.
• నెల్లూరు జిల్లాలో..
నెల్లూరు నగర పరిధిలో జగనన్న కాలనీల్లో కనీస మౌలిక వసతులు లేక పడుతున్న ఇబ్బందులను ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ మనుక్రాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వీడియోలు, ఫోటోలు చిత్రించి డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించారు. సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలంలో శ్రీ బొబ్బేపల్లి సురేష్, సూళ్లూరుపేటలో శ్రీ ఉయ్యాల ప్రవీణ్, ఆత్మకూరు నియోజకవర్గంలో శ్రీ నలిశెట్టి శ్రీధర్ తదితరుల ఆధ్వర్యంలో అన్ని మండలాల పరిధిలో నీట మునిగిన జగనన్న కాలనీలను, మొండి గోడలు, పునాదులు దాటని నిర్మాణాలను సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.
• రాయలసీమ జిల్లాల్లో పునాదుల్లోనే..
ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగానూ జనసేన శ్రేణులు జగనన్న కాలనీల సందర్శన కార్యక్రమం చేపట్టాయి. తిరుపతి నగర వాసులకు పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఇచ్చిన జగనన్న కాలనీ దుస్థితిని తిరుపతి నగర అధ్యక్షులు శ్రీ రాజారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పరిశీలించాయి. వైసీపీ ఎర్రమట్టి అక్రమ మైనింగ్ కోసమే జనావాసాలకు పనికిరాని చోట లేఅవుట్లు వేశారన్నారు. శ్రీకాళహస్తి పట్టణ సమీపంలోని రాజీవ్ నగర్ జగనన్న కాలనీని ఇంఛార్జ్ శ్రీమతి వినూత కోట సందర్శించి బురద రోడ్లను సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. మదనపల్లి, చంద్రగిరి, గంగాధర నెల్లూరు తదితర నియోజకవర్గాల్లోనూ జనసేన శ్రేణులు జగనన్న కాలనీల మోసంపై డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించాయి. మదనపల్లిలో జగనన్న కాలనీ స్విమ్మింగ్ పూల్ ని తలపించింది.
ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పరిధిలోని బుడుగుంటపల్లి గ్రామంలోని జగనన్న కాలనీని పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ తాతంశెట్టి నాగేంద్ర, ఇంఛార్జ్ శ్రీ బోనాసి వెంకట సుబ్బయ్యల ఆధ్వర్యంలో సందర్శించారు. 1966 మంది లబ్దిదారులకు ఇళ్లు మంజూరు చేస్తే అందులో కేవలం 250 ఇళ్లు మాత్రమే పాక్షికంగా నిర్మాణం పూర్తయ్యాయి. రహదారుల మధ్య ఉన్న పెద్ద పెద్ద గోతుల్లో దిగి జనసేన నాయకులు తీసిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో రాజంపేట, కడప, రాయచోటి తదితర నియోజకవర్గాల్లోనూ జనసేన శ్రేణులు జగనన్న కాలనీలు అస్తవ్యస్తంగా ఉన్న వైనాన్ని ఎండగట్టారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో పేద ప్రజలను కన్నీరు పెట్టిస్తున్న జగనన్న కాలనీలను జనసేన శ్రేణులు సందర్శించారు. జగన్నాథగట్టు ప్రాంతంలో ఒక్క ఇల్లు కూడా నిర్మాణం పూర్తి చేసుకోని జగనన్న కాలనీ వద్ద పాణ్యం ఇంఛార్జ్ శ్రీ చింతా సురేష్ ఆధ్వర్యంలో వీడియోల్లో బంధించి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతపురం రూరల్ మండలం, కొమిడి గ్రామంలో జగనన్న కాలనీలోని అస్తవ్యస్త పరిస్థితులను ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ ఆధ్వర్యంలో ప్రపంచం దృష్టికి తీసుకువచ్చాఋ. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీ భవాని రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని పోతులకుంట లేఅవుట్ వద్ద పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ శ్రేణులు జగనన్న కాలనీల వైఫల్యాన్ని ఎండగట్టాయి.
• నీటి గుంతల మధ్య గుంకలం లేఅవుట్..
ఉమ్మడి విజయనగరం జిల్లాలో జగనన్న కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. చాలా చోట్ల పొలాల మధ్య స్థలాలు కేటాయించడంతో ఇటీవల కురిసిన వర్షాలకు నీట మునిగాయి. కాలనీలకు వెళ్లే ప్రధాన రహదారులు, మౌలిక సదుపాయాలు లేకపోవడంతో అన్ని చోట్ల ఇళ్లు పునాదుల స్థాయి దాటలేదు. రాష్ట్రంలోనే అతి పెద్ద లేఅవుట్లలో ఒకటైన గుంకలంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి పర్యటించారు. స్థలాలు కేటాయించి మూడేళ్లు గడిచినా రెండింతల నిర్మాణాలు కూడా పూర్తికాలేదు. చిన్నపాటి వర్షానికే లేఅవుట్ లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. గతేడాది ఈ లే అవుట్ ను శ్రీ పవన్ కల్యాణ్ గారు పరిశీలించిన సంగతి విదితమే. నెలిమర్ల, గజపతినగరం నియోజకవర్గాల్లో శ్రీమతి లోకం మాధవి, శ్రీ మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో జగనన్న కాలనీలను పరిశీలించారు. లేఅవుట్లకు వెళ్లే రోడ్లలో గ్రావెల్ రోడ్లు వేసి వదిలేయడంతో చినుకు పడితే బురదమయంగా మారిపోతున్నాయి. ఇళ్ళ నిర్మాణాలు చేపట్టేందుకు లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో పునాదుల స్థాయిలోనే పనులు ఆగిపోయాయి. బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
• చెరువుల్లా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జగనన్న కాలనీలు..
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల జగనన్న కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. ఇచ్చాపురం, ఎచ్చెర్ల, పాతపట్నం, ఆమదాలవలస, టెక్కలి, పాలకొండ, రాజాం, నరసన్నపేట నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పేదల కోసం ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తున్నామని వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. గ్రామాలకు దూరంగా.. లోతట్టు ప్రాంతాల్లో, నది ఒడ్డున కాలనీలకు స్థలాలు కేటాయించారు. కనీస స్థాయిలో రోడ్లు, తాగునీటి తదితర మౌలిక వసతులు కల్పించడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు కాలనీలు జలమయమయ్యాయి. దీంతో లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. పార్టీ నేతలు శ్రీ దాసరి రాజు, శ్రీ విశ్వక్షేన్, శ్రీ గేదెల చైతన్య, శ్రీ పెడాడ రామ్మోహన్, శ్రీ కణితి కిరణ్, శ్రీ గర్భాన సత్తిబాబు, శ్రీ ఎన్ని రాజు తదితరులు ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.
• విశాఖ జిల్లాలో మునిగిన పునాదుల మధ్య..
ఉమ్మడి విశాఖ జిల్లాలో జగనన్న కాలనీలు పెద్ద పెద్ద చెరువులను తలపిస్తున్నాయి. చెరువులో ఇళ్లు కట్టుకుంటున్నారా? అన్నట్లు కొన్ని చోట్ల దృశ్యాలు దర్శనమిచ్చాయి. గ్రామాలకు దూరంగా లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించడంతో ఈ దుస్థితి నెలకొంది. చాలా చోట్ల వర్షపు నీరు ఇళ్ల నిర్మాణాల్లోకి చేరింది. పునాదులు నీట మునిగాయి. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండంలోని తంగుడుబిల్లి లేఅవుట్ ను నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ పంచకర్ల సందీప్, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీమతి ఉషాకిరణ్ ఆధ్వర్యంలో జనసైనికులు, వీరమహిళలు సందర్శించారు. ఇటీవల కురిసిన వర్షాలకు లేఅవుట్ పూర్తిగా జలమయమైంది. లేఅవుట్‌ పక్కనున్న కొండ పైనుంచి వచ్చిన వరద నీరు కాలనీని ముంచెత్తింది. వరద ఉధృతికి ఇళ్ల నిర్మాణాల కోసం వేసిన పునాదుల కింద ఉన్న మట్టి కొట్టుకుపోయింది. అనకాపల్లి, నర్సీపట్నం నియోజకవర్గాల్లో శ్రీ పరుచూరి భాస్కరరావు, శ్రీ సూర్యచంద్ర ఆధ్వర్యంలో జగనన్న కాలనీలను సందర్శించి… కాలనీల పరిస్థితిని సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోల రూపంలో పోస్టు చేశారు.