రైతు భరోసాలో రద్దుల పర్వం!

*కొత్తగా 2.70 లక్షల మందికి మొండిచెయ్యి
*నిబంధనల్లో మార్పులే కారణం
*సాకులేవైనా భారం తగ్గించుకోవడానికే సర్కారు తంటాలు

రైతు భరోసా…. ఏపీలో అన్నదాతలకు అండగా నిలవాల్సిన పథకం. ప్రభుత్వ కోతలతో కుంచించుకుపోతోంది. ఏపీలో మొత్తం 74 లక్షల మంది భూ యజమానులు, 16 లక్షల మంది కౌలు రైతులున్నారనేది అంచనా. మొత్తం మీద 90 లక్షల మంది సాగుదారులున్నారు. కొందరు రైతులు రకరకాల కారణాలతో సొంతంగా పొలాలు సాగు చేయలేక కౌలుకు ఇస్తున్నారు. ప్రభుత్వం అందించే రైతు భరోసాతోపాటు, అనేక రాయితీలు నేరుగా భూ యజమానులకు చేరుతున్నాయి. కౌలు రైతులకు ఎలాంటి హక్కులు లేవు కాబట్టి వారికి ప్రభుత్వ సాయం అందడం లేదు. 2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని 64 లక్షల మంది సాగుదారులకు రైతు భరోసా అందిస్తామని ఇప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి అయితే వచ్చారు కానీ, హామీని తుంగలో తొక్కారు. ఏటికేడాది రైతు భరోసా లబ్దిదారుల సంఖ్యలోనూ కోతలు వేస్తూ ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు.
*తాజాగా మరోసారి కోత
2019 ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా భారం తగ్గించుకునే ఎత్తుగడలు అమలు చేశారు. అప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏపీలో 50.58 లక్షల మంది రైతులకు ఏటా రూ.6000 చొప్పున పీఎం కిసాన్ యోజన పథకం కింద సాయం అందిస్తోంది. ఇదే అదనుగా భావించిన జగన్ సర్కార్ రైతు భరోసాకు తూట్లు పొడిచింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వైసీపీ ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.12,500 సాయం అందించాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాయం కూడా కలిపితే ఒక్కో రైతుకు మొత్తం 18500 రావాల్సి ఉంది. అయితే కేంద్రం ఇచ్చే రూ.6000కు కొంత జోడించి ఒక్కో రైతుకు రూ.13,500 మాత్రమే ఇస్తున్నారు. హామీ ఇచ్చిన రూ.12,500 కంటే మరో వెయ్యి అదనంగా ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇలా మొదట్లోనే రైతు భరోసాకు తూట్లు పొడిచారు. ఇక ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా 64 లక్షల మంది లబ్దిదారులకు కాకుండా 50.47 లక్షల మందికి మాత్రమే పథకాన్ని వర్తింప చేస్తున్నారు. తాజాగా వీరిలో మరో 2.70 లక్షల మందికి కోత వేసి 48.77 లక్షల మంది మాత్రమే రైతు భరోసాకు అర్హులని ప్రకటించారు. రైతు భరోసా లబ్దిదారుల ఎంపికలోనూ కులాల చిచ్చు పెట్టారు. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను మాత్రమే భూమి లేని కౌలు రైతులుగా గుర్తిస్తున్నారు. అలాగని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులందరికీ రైతు భరోసా సాయం అందుతోందా అంటే అదీ లేదు. ఒక ఇంట్లో ఒకరికే రైతు భరోసా అనే కొత్త నిబంధన తీసుకువచ్చారు. ఇక ఎవరైనా ఇంట్లో ఉన్నత విద్య అభ్యసిస్తూ ఉన్నా కూడా వారిని రైతు భరోసా లబ్దిదారుల జాబితా నుంచి తొలగించారు. దీంతో తాజాగా 2.70 లక్షల మంది రైతులు రైతు భరోసాకు అర్హత కోల్పోయారు. అందరూ చదువుకోవాలని ఓ వైపు సీఎం చెబుతున్నారు. మరో వైపు ఉన్నత చదువు చదువుకునే వారు ఇంట్లో ఉంటే ప్రభుత్వ పథకాల్లో కోత వేయడం దేశంలో ఇదే మొదటిసారని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా అప్పుల్లో కూరుకపోయిన రాష్ట్ర సర్కారు భారం తగ్గించుకునే పనిలో పడిందనేది సుస్పష్టం.
*కౌలుదారులకు ఉరి తాడులా మారిన చట్టం
కౌలు రైతుల లబ్ది కోసమంటూ ప్రభుత్వం తీసుకువచ్చిన కౌలుదారుల చట్టం 2020 వారి పాలిట శాపంగా మారింది. భూ యజమాని అనుమతి పత్రం ఇస్తేనే ప్రభుత్వం అందించే సాయం కౌలు రైతుకు అందుతుందని చట్టం చెబుతోంది. భూ యజమానులు ఎవరైనా వారి ఖాతాలో ప్రభుత్వం నుంచి రైతు భరోసా నగదు పడితే, వారి పొలం కౌలుకు చేసే రైతులకు అందిస్తారా? డబ్బెవరికి చేదు. భూ యజమానులు అంగీకార పత్రాలు ఇవ్వడానికి సుముఖంగా లేరు. అంగీకార పత్రాలు ఇస్తే భవిష్యత్తులో భూ హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందనే ఆందోళన కూడా వారిలో ఉంది. దీంతో రాష్ట్రంలో భూ యజమానులు కౌలు రైతులకు అంగీకార పత్రాలు ఇచ్చేందుకు పెద్దగా ముందుకు రాలేదు. 2019 ఎన్నికలకు ముందు కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, నేడు ఆ విషయంపై నోరు మెదపడం లేదు. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు అందించి రైతు భరోసా అందిస్తే ప్రభుత్వంపై ఏటా మరో రూ.3,200 కోట్ల భారం పడుతుంది. అందుకే సీఎం నోరు విప్పడం లేదని రైతు నాయకులు విమర్శిస్తున్నారు.
*ఆంధ్రా రైతులపైనే అప్పుల భారం అధికం
తాజాగా ఓ స్వచ్ఛంధ సంస్థ రైతుల అప్పులపై నిర్వహించిన సర్వేలో ఆందోళన కలిగించే అనేక అంశాలు వెలుగు చూశాయి. దేశంలో ఒక్కో రైతు సగటున రూ.74,000 అప్పు భారం మోస్తున్నాడు. అయితే ఏపీలో మాత్రం ఒక్కో రైతు రూ.2,45,554 అప్పుల భారంతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారు. వీరిలో 93 శాతం మంది కౌలు రైతులేనని తేలింది. కౌలు రైతులు అధిక వడ్డీలకు అంటే 24 నుంచి 36 శాతం వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్నారు. కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వక పోవడమే ఈ దుస్థితికి కారణం. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. పంటల బీమా కూడా సక్రమంగా అమలు కాకపోవడం, ఒక వేళ వచ్చినా కౌలు రైతుకు దక్కకపోవడంతో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. దేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల్లో కౌలు రైతులే అధికంగా ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. ఒక్క ఏపీలోనే మూడేళ్లలో 5 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు…. వీరిలో 3 వేల మంది కౌలు రైతులే ఉన్నారని అంచనా. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.7 లక్షల పరిహారం అందిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక చేతులెత్తేశారు. దీంతో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుంటుంబాలు రోడ్డున పడుతున్నాయి. భూ యజమానుల అంగీకార పత్రాలతో సంబంధం లేకుండా వ్యవసాయం చేసే కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి. అప్పుడే సాగు చేస్తున్న కౌలు రైతుకు కొంతైనా ఉపశమనం లభిస్తుంది.