మహిళలకు జరిగే న్యాయం గురించి వైసీపీ దగ్గరే నేర్చుకోవాలి: శేషుబాబు

కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం మీ సొంత చెల్లికి ఆస్తుల పంపకం చేయకుండా పక్క రాష్ట్రానికి పంపించిన మీ దగ్గరే మహిళలకు రక్షణ దొరుకుతుంది, న్యాయం జరుగుతుందంటే హాస్యాస్పదంగా ఉందని, సీఎం జగన్ ను ఉద్దేశించి అవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు విమర్శించారు. ఇంకొక చెల్లెలు వైఎస్ సునీత న్యాయం కావాలని మొరపెట్టుకున్నా స్పందించని మీరు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది, ప్రతిపక్షంలో ఉండగా వివేకానంద రెడ్డి హత్య గురించి సిబిఐ ఎంక్వయిరీ వేయాలని డిమాండ్ చేసిన మీరు అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు దాటినా ఎందుకు సిబిఐ ఎంక్వయిరీ వేయలేకపోయారని దుయ్యబట్టారు. దొంగలే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉందని తెలుసుకున్న సునీత న్యాయం జరుగుతుందని నమ్మకం లేక హైకోర్టుకు వెళ్లి సిబిఐ ఎంక్వయిరీకి అనుమతి తెచ్చుకోగా, అసలు ముద్దాయిలు కుడితిలో పడ్డ ఎలుకలు లాగా కొట్టుకుంటున్నారనీ, మీకు చేతనైతే ముందు మీ కుటుంబంలో ఉన్న సోదరీమణులకు న్యాయం చేసి రక్షణ కల్పించండి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు వచ్చనీ హితవు పలికారు. బాపట్ల జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్లో నిండు గర్భిణీ మీద జరిగిన గ్యాంగ్ రేప్ విషయంలో మీరు చెప్పే మహిళల రక్షణ ఎక్కడికి పోయింది, మీ తాడేపల్లి ప్యాలెస్ కి కూతవేటు దూరంలో ఉన్న విజయవాడలో మహిళ అత్యాచారానికి గురైతే మీ దిశ చట్టం ఎవరికి చుట్టంగా మారిందిని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాష్ట్రమంతా గగ్గోలు పెడుతున్న సుగాలి ప్రీతి కేసు విషయంలో సిబిఐ ఎంక్వైరీ వేస్తానన్న మీరు ఇప్పటివరకు ఎందుకు వేయలేకపోయారని నిలదీశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై దాడుల విషయంలో మీరు పాలనలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం 25% చొప్పున వృద్ధిరేటు ఉందని, మీకు చేతనైతే మహిళలకు రక్షణ కల్పించి రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ సోదరుడు నని అప్పుడు చెప్పుకోండి అంతేకానీ ఊకదంపుడు ఉపన్యాసాలు, పీకే ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ, ఇంకా రాష్ట్రంలో ఉన్న మహిళలను కించపరిస్తే జనసైనికులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.