ముస్లింల దెబ్బ ఎలా ఉంటుందో వైసీపీకి రుచి చూపిస్తాం.

  • ముస్లింలపై ముఖ్యమంత్రికి ఎందుకింత కక్షో అర్ధం కావట్లేదు.
  • పేద ముస్లింలపై జగన్ రెడ్డిది సవతిప్రేమ.
  • వైసీపీ ముస్లిం వ్యతిరేక నిర్ణయాలపై రగిలిపోతున్న ముస్లిం మైనారిటీలు.
  • షాదీ కా తోఫాలో కఠిన ఆంక్షలు ఎత్తి వేయాలంటూ గుంటూరు కలక్టరేట్ ఎదుట ఈ నెల 29న ముస్లిం మైనారిటీల మహాధర్నా
  • జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ నాయుబ్ కమాల్

గుంటూరు, ముస్లిం మైనారిటీల ఓట్లతో గద్దెనెక్కిన వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారి సంక్షేమాన్ని గాలికొదిలేసిందని, ముస్లింలకు సంక్షేమ పథకాలు అందకూడదనే దురుద్దేశంతోనే షాదీ కా తోఫా వంటి పథకాలపై సైతం కఠిన ఆంక్షలు విధించిందని, ఈ క్రమంలో ముస్లింలకు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల్లో అంక్షలు ఎత్తివేయాలని ఈ నెల 29 శనివారం నాడు గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ముస్లిం మైనారిటీలు మహాధర్నా చేపడుతున్నట్లు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ నాయబ్ కమాల్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ముస్లిం పేదలకు పెళ్లికానుకగా ఇచ్చే షాదీ కా తోఫా పథకానికి పెట్టిన ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముస్లిం మైనారిటీలకు వైసీపీ ప్రభుత్వం చేసిన, చేస్తున్న ద్రోహం మరే ప్రభుత్వం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు ఇచ్చే పథకానికి చదువుతో ఏంపని అని ప్రశ్నించారు. ఇదే తరహాలో ప్రస్తుత శాసనసభ్యుల్లో పదవ తరగతిలోపు చదివిన వారిని వెంటనే రాజీనామా చేయించాలని ఆయన కోరారు. ముస్లింలకు ఇంత అన్యాయం జరుగుతున్నా నిమ్మకునేరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషాకి సిగ్గూ, శరం ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ముస్లింలను వైసీపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, రానున్న ఎన్నికల్లో ముస్లిం మైనారిటీల దెబ్బ ఎలా ఉంటుందో ఈ నయవంచన వైసీపీ ప్రభుత్వానికి తెలిసేలా చేస్తామన్నారు. శనివారం నాడు జరిగే ఈ మహాధర్నాలో జిల్లా వ్యాప్తంగా ఉన్న జనసేన పార్టీ శ్రేణులు, వీరమహిళలు, జనసైనికులు, వివిధ విభాగాల నేతలు పెద్దఎత్తున పాల్గొనాలని నాయుబ్ కమాల్ పిలుపునిచ్చారు.