ఆదాయ మార్గాలు పెంచకుండా అప్పులతో ఏపీని ఏం చేద్దామనునుకుంటున్నారు?

* ఆంధ్రప్రదేశ్ రుణ భారం రూ.8 లక్షల కోట్లకు తీసుకొచ్చారు
* నెలకు సగటున రూ.9 వేల కోట్లు అప్పు చేస్తున్నారు
* జనసేన పార్టీ పీ.ఏ.సీ. సభ్యులు కొణిదెల నాగబాబు

వైసీపీ ప్రభుత్వం ఉత్పత్తి, ఉపాధి, ఆదాయ వనరులను పెంచే మార్గాలను అన్వేషించకుండా కేవలం అప్పులతోనే పరిపాలన సాగించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏం చేద్దామనునుకుంటున్నారో చెప్పాలని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రుణ భారం తాజా గణాంకాలు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. ‘కాగ్’ నివేదిక ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగే సమయానికి ఏ.పీ. రుణ భారం రూ.1,04,409 లక్షల కోట్లు ఉంది. 2014 జూన్ 1వ తేదీ నుంచి 2019 మార్చి 31 వరకు ఏ.పీ.రుణ భారం రూ.3,14,495 లక్షల కోట్లకు చేరితే, ప్రస్తుత ప్రభుత్వం చేసిన అప్పులు, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను తాకట్టుపెట్టి, మద్యం అమ్మకాలు, ఇతరత్రా ఆదాయ వనరుల్ని తనఖా పెట్టి తీసుకొచ్చిన అప్పులన్నీ లెక్కగడితే మొత్తంగా రాష్ట్ర అప్పు రూ. 8 లక్షల కోట్లకు పైగా తేలిందన్నారు. వైసీపీ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి రెట్టింపు అప్పులు చేస్తున్న విధానంపై దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని శ్రీ నాగబాబు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలనలోనే ఏదో అద్భుతం సాధించేశాము అనే భ్రమలో ఉన్నారని, సంక్షేమ పథకాల పేరుతో లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ప్రజలకు పాతిక శాతం పంచి, డెబ్భైశాతం నిధులు వీళ్ల జేబుల్లో వేసుకుంటున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు న్యాయంగా అందాల్సిన సొమ్మును ఏదో ఒక మెలికతో కొర్రీ పెట్టి వైసీపీ స్వప్రయోజనం కోసం వారి అకౌంట్లలోకి తరలిస్తున్నట్లు స్పష్టం చేసారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు, గుర్తింపు పత్రాలు, ఆదాయ వనరులు అంటూ రకరకాల మెలికలతో జనాన్ని ఇరకాటంలో పెట్టకుండా ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందజెయ్యాలని డిమాండ్ చేశారు.
* రుణభారంపై వివరణ ఇవ్వాలి రూ.8 లక్షల కోట్ల రుణభారం ఎలా అయిందో, అంత సొమ్ము దేనికి ఖర్చు పెట్టారో వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే అన్నారు. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం పైకి చెప్పేదానికి, ఆచరణలో జరిగే దానికి పొంతన లేకుండా పోతోందని అన్నారు. మూడేళ్ల పాలనలోనే శ్రీ జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలపై మోయలేని అప్పులు మోపారని దుయ్యబట్టారు. ఈ లెక్కన రానున్న రెండేళ్లలో రాష్ట్రానికి ఏ స్థాయిలో రుణ భారం మిగల్చనున్నారో అని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రూ.3,14,495 లక్షల కోట్లు అప్పు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మీరేదో ఉద్దరిస్తారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 151 మెజార్టీ సీట్లతో మీకు అధికారం అప్పచెప్తే అప్పులలో పోటీ పడి గత ప్రభుత్వంలో ఉన్న రుణ భారాన్ని మూడేళ్లలో రెండింతలు పెంచేసారని ఆవేదన వ్యక్తం చేశారు.