స్వామీ ఏమిది? మీకో రూలూ – మాకో రూలా?

  • జనసేన నాయకుడు గురాన అయ్యలు

విజయనగరం: విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి, వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజలకు తప్పుడు సంకేతాలిస్తున్నారని విజయనగరం జనసేన నాయకుడు గురాన అయ్యలు దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని దశాబ్దాల నుంచి సంప్రదాయబద్ధంగా జరుగుతున్న విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలను కూడా కోలగట్ల, ఆయన అనుయాయులు తమ కబంధ హస్తాల్లో బంధించి జరిపిస్తున్నారని అయ్యలు విమర్శించారు. నిన్నగాక మొన్న సిరిమాను చెట్టును తరలించడంలో నానా రాద్ధాంతం జరిగిన విషయాన్ని అయ్యలు ఈ సందర్భంగా ఉదహరించారు. ఇలాంటి చర్యలతో స్వామి, ఆయన అనుచరులు అమ్మవారి భక్తులకు ఎలాంటి సంకేతాలిస్తున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. భక్తులు, ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా తమకి నచ్చిన విధంగా తాము చేసుకుపోతామనే ధోరణిలో వైసీపీ నాయకులు వ్యవహరించడం దురదృష్టకరమని అయ్యలు పేర్కొన్నారు. అసలు, పూసపాటి వంశీయుల ఆధ్వర్యంలో, వారి నేతృత్వంలో జరగాల్సిన సిరిమాను సంబరాలపై కోలగట్ల వీరభద్రస్వామి, ఆయన మనుషుల పెత్తనం ఏంటని అయ్యలు ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్రతీ విషయంలోనూ జోక్యం చేసుకుంటూ, అన్నీ ఆయన చేతుల్లోకి తీసుకోవడం ఏంటని కూడా స్వామిపై అయ్యలు ధ్వజమెత్తారు. ఆఖరుకి సిరిమాను సంబరం రోజున యువకులు వేసుకునే టీ షర్టుల పంపిణీ కూడా వైసీపీ నాయకుల కనుసన్నల్లో జరగాలనడం దారుణమని అయ్యలు ఆవేదన వ్యక్తం చేశారు. పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం అనేది దేవుడికి సంబంధించిన అంశం కాబట్టి దీనిలో రాజకీయ పార్టీల ప్రమేయం ఉండకూడదన్నారు. దీనిని ద్రష్టిలో పెట్టుకుని ఎంత వరకూ ఉండాలో అంత వరకే ఉండాలని అయ్యలు ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు హితవు పలికారు. వీఐపీలు వెళ్ళే దారికి సంబంధించిన తాళాలు కూడా కోలగట్ల గుప్పెట్లో ఉంచుకుంటున్నారని, గత ఏడాది సాక్షాత్తూ మంత్రి బొత్సకే దిక్కు లేక రోడ్డు మీద నిలబడాల్సి వచ్చిందని అయ్యలు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మీకో రూలూ…మాకో రూలా?
అమ్మవారి పండుగ నేపథ్యంలో ఫ్లెక్సీలు వెయ్యాలని ఔత్సాహికులు అనుకున్నా.. వద్దంటున్నారని, మరి ఎమ్మెల్ల్యే కోలగట్ల తన మనుమరాలు పుట్టిన రోజున ఊరంతా ఫ్లెక్సీలు ఎలా కట్టారని, అధికారులు ఎలా కట్టనిచ్చారని అయ్యలు ప్రశ్నించారు. సెక్షన్‌-30 అమల్లో ఉందంటూ టీడీపీ, జనసేన నాయకుల కార్యక్రమాలను అడ్డుకుంటున్న వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు ఇవేళ సాధికారత పేరిట విజయనగరంలో బైక్‌ ర్యాలీ ఎలా చేశారని, ఎలా అనుమతిచ్చారని, మీకైతే ఓ రూలూ… మాకైతే మరో రూలా అంటూ అయ్యలు ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులకు అసలు సాధికార యాత్ర చేసే అర్హతే లేదని అయ్యలు దుయ్యబట్టారు. సామాజిక న్యాయం, సాధికారత అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతున్న వైసీపీ నాయకులు విజయనగరం మేయర్‌ విజయలక్ష్మికి ఏం విలువ ఇచ్చారని అయ్యలు ప్రశ్నించారు. డిప్యూటీ మేయర్‌ పదవుల్లో ఒక్కటి కూడా ఎస్టీలకో, ఎస్సీలకో ఎందుకివ్వలేదని నిలదీశారు. స్వంత మనుషుల్ని అందలమెక్కించడాన్నే సాధికారత, సామాజిక న్యాయం అంటారా అని అయ్యలు ప్రశ్నించారు.