మద్యం.. ఇసుక మాఫియాలతో దోపిడీ తప్ప ఏం పాలన చేశారు?

*తాగినంత మద్యం తప్ప గుక్కెడు మంచి నీరు ఇవ్వలేదు
*ప్రజల మధ్య తిరిగితే సమస్యలు తెలుస్తాయి
*ముఖ్యమంత్రి, మంత్రి వస్తే తీర ప్రాంత గ్రామాల్లో ప్రజల కష్టాలు చూపిస్తాం
*మత్స్యకారుల సమస్యలు తెలుసుకునేందుకే జనసేన యాత్ర
*ఆదివారం నరసాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ సభ
*నరసాపురం మీడియా సమావేశంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్

ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి వచ్చి ప్రజల మధ్య తిరిగితే ప్రజల బాధలు తెలుస్తాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. గ్రామాల్లో అడుగడుగునా సమస్యలు తిష్టవేసి ఉన్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం ఈ మూడేళ్ళ పాలనలో మద్యం, ఇసుక దోపిడీ మినహా ఈ ప్రభుత్వం అభివృద్ధి మీద దృష్టి సారించలేదని తెలిపారు. ప్రభుత్వం ఆదాయం కోసం సామాన్యుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టిందని, మద్యం అమ్మకాలు పెంచుతోందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఈ రోజున ఉన్న సమస్యల పైనుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నమే అని అభిప్రాయపడ్డారు. శనివారం నరసాపురంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మత్స్యకార వికాస విభాగం ఆధ్వర్యంలో పర్యటించి తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార గ్రామాల్లో ఉన్న సమస్యలపై ఒక అవగాహన తెచ్చుకోవడం జరిగింది. భవిష్యత్తులో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మత్స్యకారులకు ఏ విధంగా అండగా నిలబడగలమన్న భరోసాని వారికి కలిగించే ప్రయత్నం చేస్తున్నాం. కాకినాడ రూరల్ ప్రాంతంలో మత్స్యకార గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు వారు చూపిన అభిమానం అంతా ఇంతా కాదు.

వాలంటీర్ వ్యవస్థతో రిమోట్ పాలన

ఇప్పుడు రాబోయే రెండేళ్లలో రూ.17 వేల కోట్లతో అడిగిన వారికల్లా మంచినీరు ఇస్తామంటూ చేస్తున్న ప్రకటనలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఈ మూడేళ్లలో మద్యం గురించే తప్ప మంచి నీళ్ళ సమస్య ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి గానీ, వారి మంత్రులకు గానీ గుర్తు రాలేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మత్స్యకార గ్రామాల్లో మాతో కలసి పాదయాత్రకు రండి. తీర ప్రాంతంలోని ఏ మత్స్యకార గ్రామంలో మంచినీటి పథకం ఉందో చెప్పండి. మత్స్యకారుల ఆరోగ్యం కోసం మీరు చేపట్టిన చర్యలు ఏంటి? తూర్పు గోదావరి జిల్లాకి రూ. 1700 కోట్లు, పశ్చిమ గోదావరి రూ.1300 కోట్లు ఇస్తామంటూ ప్రకటనలు చేసుకుంటూ పోవడం మినహా క్షేత్ర స్థాయిలో ఎక్కడా అభివృద్ధి లేదు. ఏ మత్స్యకార గ్రామానికి వెళ్లినా పెద్దలు, మహిళలు మంచినీటి పథకం కావాలి. మా ఆరోగ్యాలు, మా బిడ్డల ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. స్థానిక శాసనసభ్యులు ప్రజలకు కనబడడం లేదు. 2500 మంది ఓటర్లు ఉన్న గ్రామాల్లోనే ఎమ్మెల్యేలు ఈ మూడేళ్లలో పర్యటించలేదు. ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది. ముఖ్యమంత్రి వాలంటీర్ వ్యవస్థని పెట్టుకుని రిమోట్ కంట్రోల్ తో పాలన నడుతున్నామని అనుకుంటున్నారు.

రోడ్లు లేవు.. కాలువలు లేవు

ఇక్కడ చూస్తే మత్స్యకారుల సమస్యలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మత్స్యకారులకు దగ్గరయినట్టు మభ్యపెట్టి మార్పు వస్తుందని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు పార్టీ కోసం యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. సమాజంలో కష్టపడి పని చేసిన వారికి ఈ ప్రభుత్వం ఉపయోగపడింది శూన్యం. ఈ రోజు వరకు ఎక్కడా కాలువలు తవ్వలేదు. రోడ్లు వేయలేదు. రక్షణ గోడలు కావాలని యువత అడుగుతున్నారు. ప్రభుత్వం ఏ ప్రాంతంలోనూ సమస్యల పరిష్కారానికి ముందుకు రావడం లేదు. సంక్షేమూ లేదు.

సమస్యలు చెప్పుకోవడానికి జనసేన పార్టీ నుంచి టోల్ ఫ్రీ నెంబర్ పెడితే మూడు రోజుల్లో వెయ్యి మందికి పైగా తమ సమస్యలు చెప్పుకున్నారు. మా సమస్యలు జనసేనాని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లమని బాదతో చెప్పుకొంటున్నారు. మత్స్యకార భరోసా 40 శాతం మందికి మాత్రమే ఇచ్చారు. ఇచ్చే రూ. 10 వేలలో అవినీతి జరుగుతోంది. జనసేన ఫ్లెక్సీ కడితే కేసులు పెడుతున్నారు. జెండా కడితే భయపెడుతున్నారు.

20వ తేదీ నరసాపురంలో నిర్వహించే బహిరంగ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపైనా, జీవో 217తో మైదాన ప్రాంతాల్లో వేట ఆధారంగా జీవనం సాగించే మత్స్యకారుల పొట్ట ఈ ప్రభుత్వం ఏ విధంగా కొడుతుందో వివరిస్తారు. అబద్దపు ప్రఛారాలతో ఈ జీవో మత్స్యకారులకు ఉపయోగపడుతుందని చెబుతూ 2500 మత్య్సకార సొసైటీలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మత్స్యకారుల సమస్యలను ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షులు జనసేనాని పవన్ కళ్యాణ్ కు రేపటి సభా వేదిక పై నుంచి వివరిస్తారు.

మూడు రాజధానుల తతంగానికి ముఖ్యమంత్రే పూర్తి బాధ్యుడు

రాజధాని వ్యవహారంలో ముఖ్యమంత్రి ఒక్క కేబినెట్ మంత్రితో కూడా చర్చించింది లేదు. ఈ మొత్తం తతంగానికి ముఖ్యమంత్రి బాధ్యుడు. అసెంబ్లీలో మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించుకుంటున్నామని ప్రకటన చేసి, కొత్త రూపంలో తెస్తున్నా మంటూ మంత్రులతో ప్రకటనలు చేయిస్తూ ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తున్నారు. నిజాయతీగా పరిపాలన చేయాలి. ఈ ప్రభుత్వం ప్రతి అంశంలో రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తోంద”ని అన్నారు.

మత్స్యకార గ్రామాల్లో పర్యటన

నాదెండ్ల మనోహర్ మత్స్యకార అభ్యున్నతి యాత్రలో భాగంగా శనివారం భీమవరం, నరసాపురం నియోజక వర్గాలలో పర్యటించారు. పాతపాడు, కాళీపట్నం, ముత్యాలపల్లి, పేరుపాలెం, మొగల్తూరు ప్రాంతాలలో మత్స్యకారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, కందుల దుర్గేశ్, పి.ఎ.సి. సభ్యులు కనక రాజు సూరి, పంతం నానాజీ, పితాని బాలకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, మత్స్యకార వికాస విభాగం చైర్మన్ బొమ్మిడి నాయకర్, నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనోకాంత్ రెడ్డి, పార్టీ నేతలు శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి, కూసంపూడి శ్రీనివాస్, కరాటం సాయి, కె. చిదంబరం, తూర్పు గోదావరి జిల్లా అసెంబ్లీ నియోజక వర్గాల ఇంచార్జ్ లు పాల్గొన్నారు.