సొంత బాబాయిని హత్య చేసిన వారిని వెనకేసుకొచ్చేవారా మనల్ని పాలించేది?

*బాబాయి కూతురు న్యాయపోరాటానికి అడ్డుపడుతున్నది ఎవరు?
*ఎస్సీలు, బీసీలు, కాపులకు తీరని అన్యాయం చేసిన వైసీపీ ప్రభుత్వం
*వైసీపీ పాలనలో సొంత సామాజిక వర్గానికి తప్ప అన్ని వర్గాలకు అన్యాయమే
*సంపద సృష్టించి సంక్షేమం చేయడానికి జనసేన ప్రాధాన్యం
*అమరావతి కుల రాజధాని అయితే విపక్షంలో ఉన్నప్పుడు మద్దతు ఎందుకిచ్చారు?
*పదిమందికి ఉపాధినిచ్చేలా యువతను తీర్చిదిద్దుతాం
*కత్తిపూడిలో జరిగిన వారాహి విజయ యాత్ర తొలి బహిరంగ సభలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్

సొంత బాబాయి హత్య కేసులో చేతికి రక్తపు మరకలు అంటుకున్న వ్యక్తి మనల్ని పాలిస్తున్నాడు.. చిన్నాయన కూతురు తన తండ్రి హత్యకు కారకులెవరో తెలియాలని పోరాడుతుంటే, చంపిన వారిని వెనకేసుకొస్తున్న వారి పాలనలో మనం ఎంత భద్రంగా ఉన్నామో ప్రజలు ఆలోచించాలి..? 18 ఎస్సీ పథకాలను రద్దు చేసిన ప్రభుత్వంలో, బీసీ సబ్ ప్లాన్ అటకెక్కించిన నాయకత్వంలో, కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేదే లేదని తెగేసి చెప్పిన నాయకుడి పాలనలో మనమున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సంపదను దోచి, మళ్లీ దాన్ని ప్రజలకు పంచి పెట్టే నాయకులు కావాలో, సంపద సృష్టించి అన్నీ వర్గాలకు పంచి పెట్టే పాలన కావాలో ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. వారాహి విజయ యాత్రలో భాగంగా బుధవారం తొలి బహిరంగ సభ కత్తిపూడిలో జరిగింది. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… ‘‘ అధికార మదంతో ఎన్ని అడ్డంకులు, ఎన్ని వ్యూహాలు పన్నినా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ శాసనసభలో అడుగు పెట్టకుండా ఎవరూ ఆపలేరు. నిజాయతీ గల శాసన సభ్యులు చట్ట సభల్లో ప్రజా సమస్యలపై మాట్లాడితే ఎలా ఉంటుందో చూపిస్తాం. ప్రజల గొంతు బలంగా వినిపిస్తాం. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు జనసేన పార్టీ ఒంటరిగా వస్తుందా? ఉమ్మడిగా వస్తుందా? అనే విషయాన్ని ఇంకా నిర్ణయించలేదు. ఆ రోజు వస్తే కచ్చితంగా ప్రజల మధ్యనే పారదర్శకంగా చెబుతాం. కుట్రలు, కుతంత్రాలతో గత ఎన్నికల్లో నేను ఓడిపోయాలా చేశారు. లక్ష మంది ఓటర్లు ఉన్న భీమవరంలో 1.08 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇది కుట్ర కాకా ఇంకేంటి? ఈ సారి అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఎవడు ఆపుతాడో నేను చూస్తాను. యాత్ర రథనానికి వారాహి అనే పేరు నేను కోరుకుంటే రాలేదు. నేను నిత్యం పూజించే ఆ తల్లి చల్లని దీవెనలు నా వెంట ఉన్నాయి కనుకే ఈ వాహనానికి వారాహి అనే పేరు వచ్చింది.
*సంక్షేమానికి జనసేన వ్యతిరేకం కాదు… వైసీపీ విధానానికే మేం వ్యతిరేకం
సంపద సృష్టించి దాన్ని అర్హులకు తగిన విధంగా అందించడాన్ని మేం సమర్థిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న వెయ్యిమంది కౌలు రైతు కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున నా సొంత సంపదను సహాయంగా అందించాం. వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాల ద్వారా నా కష్టం నుంచి వచ్చిన సంపదను సాయంగా ఇవ్వగలిగాం. అంటే అక్కడ సంపదను సృష్టించబట్టే మేం వారికి అండగా నిలబడగలిగాం. దీన్ని మేం నమ్ముతాం. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమ రాదు.. ఉద్యోగాలు లేవు.. పన్నుల బాదుడుతో ప్రజలు నలిగిపోతున్నారు. మరో పక్క భవిష్యత్తును తాకట్టు పెట్టి అప్పులు చేసి సంక్షేమం అంటున్నారు. ఇదేం తీరు..? అప్పులు చేసి గొప్పతనం అంటే ఎలా..? సంపద సృష్టికి రాష్ట్రంలో అపార అవకాశాలున్నా దాన్ని వినియోగించుకోకుండా, అప్పులు చేసి డబ్బులు పంచడం అంటే భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేయడమే. జనసేన ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉంటాయి. దానికి తగినట్లుగా రాష్ట్రంలో అన్నీ మార్గాల ద్వారా సంపదను పెంచి సంక్షేమాన్ని అద్భుతంగా అమలు చేసే బాధ్యతను తీసుకుంటాం. చెత్త పన్ను దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ల ఫీజులు వరకు అన్నీ పన్నులు పెంచేశారు. ప్రజల దగ్గర వసూలు చేసిన డబ్బునే మళ్లీ పంచుతూ రాబిన్ హుడ్ లా ముఖ్యమంత్రి మాట్లాడటం చూస్తే నవ్వొస్తోంది.
* అమరావతిపై ఎందుకు మాట మార్చారు..?
ప్రతిపక్ష నాయకుడిగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఉన్నపుడు అమరావతికి సేకరించిన భూమి సరిపోదని, మరో 5 వేల ఎకరాలు సేకరించాలని చెప్పారు. అమరావతి రాజధానిగా సంపూర్ణ మద్దతు తెలిపారు. అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు అయోమయంలో ఉన్నారు. కులం తాలుకా రాజధాని అని వైసీపీ ఇప్పుడు ప్రచారం చేస్తోంది. మరి అలాంటప్పుడు విపక్షంగా ఉన్నపుడే దాన్ని వ్యతిరేకించి ఉండాల్సింది. ఇప్పుడు కొత్తగా మూడు రాజధానుల నాటకం ఆడుతున్నారు. ఇదంతా ఆంధ్రప్రదేశ్ ను వెనక్కు తోయడానికి మాత్రమే అనేది ప్రజలు గమనించాలి. ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి మాదాపూర్ శివారున ఉండేది. కొన్ని సంవత్సరాల్లోనే ఇప్పుడు టెక్ ప్రాంతంగా మారింది. అభివృద్ధి రాత్రికి రాత్రి జరగదు. దానికి పాలకుల ముందు చూపు, సమయం చాలా అవసరం. జనసేన పార్టీ కచ్చితంగా రాష్ట్రానికి అమరావతి రాజధానిగా కట్టుబడి ఉంది. అమరావతిలో అన్నీ కులాలున్నాయి. వారిని కలిపే ఆలోచన, పాలసీలను వైసీపీ ప్రభుత్వం తీసుకొస్తే కచ్చితంగా స్వాగతించే వాడిని. అది జరగలేదు.
*కొత్త జంటకు పెళ్లి రిజిస్ట్రేషన్ తో పాటు రేషన్ కార్డు
కొత్తగా పెళ్లి అయిన దంపతులకు పెళ్లి కానుక, షాదీ ముబారక్ వంటి పథకాలను వైసీపీ ప్రభుత్వం అమలు చేయలేదు. ఇటీవల పథకాలు అమలు చేస్తున్నా బోలెడు నిబంధనలు పెట్టారు. జనసేన ప్రభుత్వంలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు పెళ్లి రిజిస్ట్రేషన్ ధ్రువపత్రంతో పాటు కొత్త రేషన్ కార్డు అందించేలా పథకం తీసుకొస్తాం. నవ దంపతులు కొత్త ఇల్లు నిర్మించుకోవాలని భావిస్తే, తప్పనిసరిగా వారికి తగిన ప్రాధాన్యం ఇస్తాం. బీపీఎల్ వారికే కాకుండా కొత్తగా పెళ్లియిన వారందరికీ దీనిని వర్తింపజేస్తాం.
*పాపం పసివాడా… చిన్నాయనను చంపిందెవరో చెప్పు..?
పాపం పసివాడులా మాట్లాడే ఈ ముఖ్యమంత్రి సొంత చిన్నాయనను చంపిన వారిని శతవిధాలా రక్షించేందుకు తాపత్రయ పడుతున్నారు. బాబాయి కూతురు న్యాయం పోరాటం చేస్తుంటే దాన్ని కనీసం పట్టించుకోని ఈయన క్లాస్ వార్ గురించి మాట్లాడుతుంటే వింతగా అనిపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ బలవంతుడు, రాజకీయ బలహీనుడు అనే రెండు వర్గాల మధ్యనే పోరు నడుస్తోంది. తన తండ్రిని హత్య చేసిన వారి కోసం న్యాయపోరాటం చేస్తున్న డాక్టర్ సునీతకు కోర్టులో కనీసం వాదించేందుకు అడ్వకేట్లు దొరకని పక్షంలో సొంతంగా కేసు వాదించుకుంటూ వ్యవస్థలోని రాజకీయ బలవంతానికి సజీవ సాక్షిగా నిస్సహాయంగా నిలబడిపోయింది. కేసులో అన్నీ చేతులు సీఎం ఇంటి వైపే చూపిస్తున్నాయి. అయినా న్యాయం అందని పరిస్థితి. కోట్లాది మంది అభిమానులు ఉన్న వారిని సైతం ముఖ్యమంత్రి ఎదుట చేతులు కట్టుకునేలా చేసిన సీఎం క్లాస్ వార్ గురించి మాట్లాడటానికి సరిపోరు.
*అన్ని వర్గాలకు ఎక్కడ న్యాయం చేశారు..?
ఓ నాయకుడు గట్టిగా అనుకుంటే కులాల మధ్య సఖ్యత తీసుకురాగలడు.. అలాగే విద్వేషాలు రెచ్చగొట్టగలడు. ఎస్సీ, బీసీ నాయకులతో నన్ను తిట్టించి.. మళ్లీ మనం మనం తిట్టుకునేలా చేయడమే వైసీపీ నైజం. మనం తిట్టుకుంటే వారు ఆనందపడతారు. ప్రజల్లో చీలిక తెచ్చి ఆనందపడతారు. ఎన్నికల సమయంలో వైసీపీకి బీసీల గర్జనలు గుర్తుకొస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాత్రం బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించి, ఎన్నికల్లో 16,800 మంది బీసీల పదవులకు వైసీపీ ఎసరు పెట్టింది. తెలంగాణలో 18 బీసీ కులాలను తొలగిస్తే వైసీపీ సర్కారు పక్క రాష్ట్రం పెద్దలతో కనీసం మాట్లాడింది లేదు. ఈ ముఖ్యమంత్రి మాట్లాడితే నా ఎస్సీ సోదరులు అంటారు.. వారి సంక్షేమానికి కీలకమైన 18 సంక్షేమ పథకాలను తీసేశారు. దళిత డ్రైవర్ ను చంపేసి ఇంటికి పార్శిల్ చేసిన వ్యక్తులకు ఏ పార్టీ వంత పాడుతుందో యువత అర్ధం చేసుకోవాలి. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేది లేదని చెప్పినా… వైసీపీకి ఓటేస్తే కాపులకు ప్రాధాన్యం లేదు. రాష్ట్రంలో సుమారు 600 నామినెటేడ్ పోస్టుల్లో ఏకంగా 500 వరకు తన సొంత సామాజిక వర్గానికే కట్టబెట్టిన వ్యక్తి. అందరినీ అందలం ఎక్కిస్తానంటే నమ్మడం సాధ్యమా..? ప్రజలు ఆలోచించాలి.
*యువత ఉద్యోగాలు ఇచ్చేలా షణ్ముఖ వ్యూహం
జనసేన ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత షణ్ముఖ వ్యూహంలో యువతకు స్వయం ఉపాధి చూపించడంపైనే పెడతాం. ఎంతో నైపుణ్యం ఉన్న యువత రాష్ట్రంలో ఉన్నారు. వారికి సరైన పెట్టుబడి లేక నిస్సహాయంగా ఉండిపోతున్నారు. జనసేన ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గంలో ఏటా 500 మందిని ఎంపిక చేసి, వారికి వెంటనే రూ.10 లక్షల మేర సాయం చేసేలా ప్రణాళిక ఉంటుంది. ఏదైనా యూనిట్ నెలకొల్పి వారు పదిమందికి ఉపాధి చూపితే రాష్ట్రంలో నిరుద్యోగం ఉండదు.. అద్భుతమైన సంపద సృష్టి సాధ్యమే. దీనికి ఏటా రూ.10 వేల కోట్లు అవుతుందని అంచనా. వైసీపీ పాలనలో కేవలం ఇసుక దోపిడీపైనే ఏటా రూ.10 వేల కోట్లు పక్కదారి పడుతున్నాయి. దాన్ని నిలువరించి అయినా యువతకు అవసరమైన పథకాన్ని పక్కాగా అమలు చేస్తాం.
*పంచాయతీలకు పుష్కలంగా నిధులు
వైసీపీ పాలనలో పంచాయతీలకు నిధులు లేవు. కనీస పనులు కానరావడం లేదు. కేరళలో పంచాయతీలకు సుమారు 40 శాతం మేర నిధులు కేటాయిస్తారు. పక్కాగా స్థానిక సంస్థల పాలన ఉంటుంది. కేంద్రం నుంచి జనాభా ప్రాతిపదికన ఒక్కో పంచాయతీకు రూ.7 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు కేంద్రం నిధులు వస్తాయి. అవి అందడం లేదు. దీంతో కనీసం పారిశుద్ధ్య పనులు జరగడం లేదు. దీనికి తోడు ప్రతి ఇంటి నుంచి వసూలు చేస్తున్న రూ.90 చెత్త పన్నును ఏం చేస్తున్నారో తెలియదు. జనసేన ప్రభుత్వంలో పంచాయతీల నిధులు కచ్చితంగా వారికి అందేలా పనిచేస్తాం. దీనికి సమగ్ర ప్రణాళికను ప్రకటిస్తాం.
*ఇసుక దోపిడీకి చెక్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి సంబంధించిన రూ.450 కోట్లు ఎటు పోయాయో తెలియదు. ఇసుక పాలసీ పేరుతో వైసీపీ ప్రభుత్వం 3 కంపెనీలకు ఇసుక నిర్వహణ కట్టబెట్టింది. చిత్తూరుకు చెందిన ఓ బడా నాయకుడి కంపెనీలు ఉన్నాయి. అసలు కంపెనీలను పక్కన పెట్టి వైసీపీ నేతలు ఆజమాయిషీ చెలాయిస్తున్నారు. జనసేన ప్రభుత్వంలో ఇసుకపై ఆధారపడిన వారికి కాంట్రాక్టులు కేటాయిస్తాం. పేదలకు ఉచిత ఇసుక అందించేందుకు కట్టుబడి ఉన్నాం. అలాగే ఇసుక కాంట్రాక్టులను సైతం దానిపై ఆధారపడిన వారికే ఇస్తాం. మైనింగ్ వనరుల దోపిడీని సాగనివ్వం. పోలవరం పూర్తి కావాలంటే జనసేన ప్రభుత్వంతోనే సాధ్యం. పోలవరం పూర్తి కోసం మా ప్రణాళికను త్వరలోనే ప్రజల ముందు పెడతాం. కేంద్రంతో సఖ్యతగానే నడుచుకుంటాం. అయితే రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. దివ్యాంగులకు పూర్తిగా అండగా నిలుస్తాం.
*ఆవేశంతో కాదు.. ఆలోచించి ఓటు వేయండి
ప్రజా సమస్యల కోసం వీధి పోరాటాలు చేశాం. మీ కోసం చట్టసభల్లో పోరాడే అవకాశం ఇవ్వండి. గొప్ప దేశభక్తుల స్ఫూర్తిని నిలువెల్లా నింపుకున్న మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. పార్టీ కార్యకర్తల ధనానికే రూపాయి రూపాయి లెక్క చెప్పే నేను, ప్రజా ధనానిక అంతే కచ్చితంగా లెక్క చూపిస్తాను. రూపాయి అవినీతి లేకుండా పాలన అందిస్తాం. ఈ సారి సార్వత్రిక ఎన్నికలు నవంబరు, డిసెంబరులోనే వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘంతో వైసీపీ పెద్దల సంప్రదింపులు పూర్తయ్యాయని సమాచారం. ఈ సారి కచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తు గోదావరి జిల్లాల వారి చేతులోనే ఉంటుంది. యువతరం, ప్రజలు ఆవేశంతో కాదు.. ఆలోచించి జనసేనను ఆశీర్వదించండి. అద్భుతమైన పాలన అందించే బాధ్యతను నేను తీసుకుంటాను. ఆంధ్రప్రదేశ్ ను ఎవరు బతికిస్తారో, దారి చూపుతారో నిండు మనసుతో ఆలోచించి బలంగా గ్లాసు గుర్తుపై ఎన్నికల ఓటు వేయండి’’ అని పిలుపునిచ్చారు.