అంబేద్కర్ జిల్లాగా ముందుగానే ఎందుకు పేరు పెట్టలేదు? – పవన్ కళ్యాణ్

వైసీపీ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలో భాగంగానే అమలాపురంలో అల్లర్లు చెలరేగాయని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ఎస్సీల్లో పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకతను పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతోనే కోనసీమలో గొడవలు రేపారు అన్నారు.  కుల ఘర్షణలు రావణకాష్టం లాంటివని, ఒక్కసారి అంటుకుంటే దేశమంతా కాలిపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు.

వైసీపీ మంత్రివర్గం నోటికి వచ్చినట్లు మాట్లాడి గొడవలు పెంచే ప్రయత్నం చేయడం తప్ప, తగ్గించే ప్రయత్నాలు చేయడం లేదన్నారు. కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు వెలువడిన గెజిట్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టకుండా, ఇప్పుడు హడావుడిగా కోనసీమ జిల్లాకు ఆ పేరు పెట్టడం వైసీపీ రాజకీయ కుట్రలో భాగమేనన్న అనుమానం వ్యక్తమవుతోందని అన్నారు. బుధవారం మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “పాలన సౌలభ్యం కోసమని వైసీపీ ప్రభుత్వం ఏప్రిల్ 4న కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాల్లో కొన్నింటికి శ్రీ సత్యసాయి, అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు వంటి వారి పేర్లతో నామకరణం చేసింది. అదే రోజు అన్ని జిల్లాలతోపాటు కోనసీమ జిల్లాకు కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టేస్తే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. కావాలని జాప్యం చేయడంలో వైసీపీ ఉద్దేశం ఏంటి? నోటిఫికేషన్ జారీ చేసి అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా వినతులు ఇవ్వాలని కోరడం వెనక ఆంతర్యం ఏమిటి? గొడవలుపడాలనే వీళ్లు కోరుకుంటున్నారు. పేరు మార్పులపై కొన్ని జిల్లాల్లో ఇలానే అభ్యంతరాలు వస్తే వాళ్లకు సమయం ఇవ్వకుండా ఇక్కడ మాత్రమే 30 రోజులుపాటు సమయం ఇచ్చారంటే దీని వెనకనున్న దురుద్దేశం ఏమిటో స్పష్టంగా తెలుస్తోంది. 

రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఏర్పాటు చేసిన కమిషన్లు ప్రతి జిల్లాకు వెళ్లి వాళ్ల వాళ్ల అభ్యంతరాలు తెలుసుకునేవి. ఇప్పుడు మాత్రం సమూహంగా కాకుండా వ్యక్తులుగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వినతులు ఇవ్వాలని అడగడం చూస్తుంటే ప్రభుత్వానికి ఏదో దురుద్దేశం ఉందనే అర్థమవుతోంది.

• దామోదరం సంజీవయ్య గారు పేరు డిమాండ్ చేశాం

జిల్లాలకు జాతీయ నాయకుల పేర్లు పెట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేస్తూ అకాల మరణం పొందిన వైఎస్ఆర్ పేరును కడప జిల్లాకు పెట్టారు. ఆ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చారు. కొన్ని రోజుల తరువాత పేరులోంచి కడపను తొలగించి ఇప్పుడు వైఎస్ఆర్ జిల్లాగా మార్చారు. కృష్టా నది తక్కువగా ప్రవహించే చోట కృష్టా జిల్లా అని, కృష్టా నది ఎక్కువగా ప్రవహించే చోట ఎన్టీఆర్ జిల్లా అని నామకరణం చేశారు. ఆ సమయంలో ఈ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్లు సైతం వచ్చాయి. అలాగే భాషాప్రయుక్త రాష్ట్రాలు ఉండాలని డిమాండ్ చేసి, దాని సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి పేరును ఒక్క జిల్లాకే పరిమితం చేసి ఆయన స్థాయిని తగ్గించామని బాధపడాలో, ఒక జిల్లాకైనా ఆయన పేరు పెట్టారని సంతోషపడాలో తెలియని పరిస్థితి.

అనంతపురం జిల్లాలో కొంత భాగానికి శ్రీ సత్యసాయి జిల్లాగా నామకరణం చేసినప్పుడు కొంతమందికి ఆ పేరు నచ్చలేదు. నా దగ్గరకు వచ్చి దానిపై మాట్లాడాలని కోరారు. అయితే అది ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమని, స్థానికంగా మీ అభిప్రాయాలు తెలపాలని చెప్పాను. తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారి పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని డిమాండ్ చేశాం. కర్నూలు జిల్లాను కర్నూలుగానే కొనసాగనివ్వమని అక్కడ ప్రజలు కోరితే నేను ప్రజాభిప్రాయానికి ఎదురెళ్లను. భవిష్యత్తులో మార్చాల్సి వస్తే మాత్రం రెఫరెండం కోరుతాను. మెజార్టీ ప్రజలు ఆమోదిస్తే పేరు మారుస్తాను.

• ముందస్తు ప్రణాళిక భాగంగానే ఇళ్లకు నిప్పు

సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క పోస్టు పెడితేనే రకరకాల పోలీసు కేసులు పెట్టి వేధిస్తున్నారు. అలాంటిది 30 రోజులు గడువును ప్రభుత్వం ఇచ్చిందంటే ఇక్కడ గొడవలు జరుగుతాయని ముందే తెలుసు. అల్లర్లు జరగాలని కోరుకుంటోంది కాబట్టే.. ఘర్షణ వాతావరణం కల్పించి భావోద్వేగాలను రెచ్చగొట్టింది. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ నివాసాలకు నిరసనకారులు నిప్పుపెట్టడం ఇందులో భాగమే. మంత్రిది సొంత ఇల్లు కాదు అద్దె ఇల్లు. దాడికి ముందే మంత్రి కుటుంబీకులను పోలీసులు అక్కడ నుంచి తరలించారు. ఇవన్ని చూస్తుంటే ముందస్తు ప్రణాళికలో భాగంగానే దాడులు జరిగాయని తెలుస్తోంది.

గతంలో కాకినాడకు చెందిన ఒక ఎమ్మెల్యే నన్ను వ్యక్తిగతంగా దూషించి, నిరసన తెలిపిన జనసేన నాయకులపై దాడులకు పాల్పడితే వారిని కేవలం పరామర్శించడానికి వెళ్తేనే 144 సెక్షన్ విధించి నా పర్యటన పూర్తయ్యే వరకు పోలీసులు చాలా అలర్ట్ గా ఉన్నారు. అలాంటిది నెల రోజులుగా కోనసీమ ప్రాంతంలో భావోద్వేగాలు చెలరేగే అవకాశం ఉన్నపుడు ఇంకెంత అప్రమత్తంగా ఉండాలి? అలా కాకుండా మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లు తగలబడుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం చూస్తుంటే ఇది ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని అర్ధమవుతోంది. పోలీస్ వ్యవస్థను మీ చేతుల్లో పెట్టుకొని దాడులకు జనసేన కారణమని మాట్లాడటం సిగ్గుచేటు.

• అంబేద్కర్ గారి పేరు వాడుకొంటూ… ఆయనిచ్చిన స్ఫూర్తిని వదిలేశారు

ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ అంబేద్కర్ గారి పట్ల గౌరవభావం ఉంటుంది. ఆయన పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరం. అంబేద్కర్ పేరును రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని వదిలేస్తున్నారు తప్ప ఆయన అందించిన స్ఫూర్తిని కొనసాగించడం లేదు. వైసీపీ ప్రభుత్వానికి నిజంగా ఆయన మీద ప్రేమ ఉంటే రాష్ట్రంలో 26 జిల్లాలు ఉండగా ఒక్క కోనసీమకే ఆయన పేరు ఎందుకు పెట్టాలని అనుకుంటోంది? కడప జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టొచ్చు కదా? కనీసం కడప జిల్లాలో ఒక ప్రాంతానికైనా ఆ మహనీయుడి పేరు పెట్టారా?  జిల్లాకు పేర్లు పెట్టేటప్పుడు చాలా సున్నితంగా వ్యవహరించాలి.

• ఎస్సీల భూములు 11వేల ఎకరాలు లాక్కొన్నారు

ఎస్సీలపై నిజంగా ప్రేమ ఉన్నట్లు నటిస్తోన్న వైసీపీ ప్రభుత్వం గత మూడేళ్లుగా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.10 వేల కోట్లను వివిధ సంక్షేమ పథకాలకు దారి మళ్లించింది. ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం దళితుల భూములు 11 వేల ఎకరాల మేర లాక్కున్నారు. సివిల్స్, గ్రూప్-1 పరీక్షలకు ప్రీపేర్ అయ్యే ఎస్సీ యువతకు ఫీజులు ఆపేశారు. హైదరాబాద్, ఢిల్లీ లాంటి చోట్ల మెరుగైన శిక్షణ పొందే అవకాశం లేకుండా చేశారు.  అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని రద్దు చేశారు. ఇన్ని రకాలుగా వాళ్లకు రావాల్సిన పథకాలను ఆపేసి… వాళ్ల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్లు మాయ చేస్తోంది.

• వైసీపీకి వ్యతిరేకంగా ఏం చేసినా తప్పే

ఎస్సీల గురించి మాట్లాడుకోవాలంటే.. అమరావతికి చెందిన ఎస్సీ రైతుల మీదే ఈ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించింది. సామర్లకోట మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్సీ యువకుడు శ్రీ గిరీష్ బాబు వైసీపీ నాయకుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం కడప జిల్లా ప్రొద్దుటూరులో దళిత బాలిక మానమర్యాదలు తీసేశారు. పలమనేరులో మిస్బా అనే 10వ తరగతి బాలిక వైసీపీ నాయకుల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. విశాఖలో ఓ మంత్రి పోలీసు అధికారిని కాలర్ పట్టుకుని బెదిరించారు. కోర్టు వీళ్లకి వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇస్తే న్యాయమూర్తులు, వాళ్ల కుటుంబ సభ్యులపై కామెంట్స్ చేస్తారు.

ఉద్యోగులు జీతాలు రావడం లేదని రోడ్డు మీదకు వస్తే వాళ్లదే తప్పంటారు. కరోనా సమయంలో నర్సీపట్నంకు చెందిన డాక్టర్ సుధాకర్ ప్రభుత్వం సరిగా లేదని మాట్లాడినందుకు ఆయన్ను మానసికంగా చిత్రవధ చేసి చనిపోయేలా చేశారు. మత్స్యపురి పంచాయతీ సర్పంచ్ గా గెలిచిన ఎస్సీ వర్గానికి చెందిన మా ఆడబిడ్డను వేధించి ఇంటి మీద దాడి చేసి ఆ నివాసాన్ని కూల్చేశారు.

• ఎమ్మెల్సీ మాజీ డ్రైవర్ హత్యోదంతం పక్కదారి పట్టించేందుకే

కేంద్ర మంత్రి శ్రీ రాందాస్ అథావలే బీఎస్సీ నాయకులు అడిగిన ప్రశ్నకు చెప్పిన లెక్కల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దక్షిణ భారత దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 5,857 దుర్ఘటనలు జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా, సీతానగరంకు చెందిన శ్రీ వరప్రసాద్ అనే ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడు వైసీపీ నాయకుల వేధింపులకు, శిరోముండనం చేశారన్న కోపంతో ఏకంగా రాష్ట్రపతి శ్రీ రాంనాథ్ కోవింద్ గారికి నక్సల్స్ లో చేరేందుకు అనుమతి కోరుతూ లేఖ రాసిన పరిస్థితి. ప్రకాశం జిల్లా, కొండేపి గత నెలలో శ్రీ రామబ్రహ్మం అనే అతని మీద వైసీపీ నాయకులు అటాక్ చేశారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కొత్త ఎత్తుగడ మొదలు పెట్టారు. ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర పని చేసిన డ్రైవర్ హత్యోదంతం అందరిలోనూ కలకలం రేపింది. ఆ మర్డర్ కేసును పక్కదారి పట్టించాలనే దురుద్దేశంతోనే కోనసీమ చిచ్చుకు అధికార పక్షం తెరలేపింది.

వైసీపీ ప్రభుత్వం పట్ల ఎస్సీల్లో ఉన్న వ్యతిరేకతను మళ్లించే ప్లాన్ లో భాగంగానే వారి ఇళ్ల మీద వారే దాడులు చేయించుకున్నారు. నిజంగా దాడులు జరిగే పరిస్థితులు ఉన్నప్పుడు 144 సెక్షన్ విధించి మీ మంత్రుల ఇళ్ల వద్ద వేల సంఖ్యలో పోలీసుల్ని ఎందుకు మోహరించలేదు? ఒక్క మాట మాట్లాడితేనే వందల మంది పోలీసుల్ని పెడతారే. అలాంటిది ఇంత తీవ్రంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థను ఎందుకు అప్రమత్తం చేయలేదు. దీని వెనుక డిజైన్ ఉంది. గొడవ జరగాలని వైసీపీ నాయకులు కోరుకున్నారు.

• ఇన్ని తప్పులు మీరు చేసి మమ్మల్ని అంటారా?

రాష్ట్ర హోంమంత్రి గారిని అడుగుతున్నాను.. కోడికత్తి ఘటన కేసు ఏమైంది? దాని విచారణ ఎంత వరకు వచ్చింది? శ్రీ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఏమయ్యింది? ఒక రోజు గుండెపోటు వచ్చిందన్నారు. తర్వాత లేదు చంపేశారన్నారు. గుండెపోటు నుంచి గొడ్డలి పోటు వరకు పట్టుకొచ్చారు. ఇవన్నీ వారు చెప్పిన కథనాలే. విశాఖలో సీఐఎస్ఎఫ్ ఆధీనంలో ఉన్న ఎయిర్ పోర్టులో ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే ఆ రోజున ఏం మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని నమ్మలేము.. తెలంగాణ పోలీసులు కావాలి అన్నారు కాదా. ఈ రోజు అదే పోలీసు వ్యవస్థను శాసించే స్థితిలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కోడికత్తి కేసు మీద విచారణ ఎందుకు జరగడం లేదు. నిందితులకు ఎందుకు శిక్ష పడలేదు. విచారణ జరగకపోగా వారికి సంబంధించిన వారికి పదవులు ఇచ్చారని

విన్నాను. శ్రీ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత మా తండ్రి మరణం అనుమానాస్పదం, ఎవ్వరూ పట్టించుకోవడం లేదంటూ ఢిల్లీ వరకు వెళ్తే ఇప్పటి వరకు తేల్చలేకపోయారు. ఇన్ని తప్పులు మీ దగ్గర పెట్టుకుని మీ మీద మీరే దాడులు చేయించుకుని సానుభూతి పెంచుకునే స్థాయిలో మీరుండి మమ్మల్ని అనడం భావ్యమా? అలాగే ఒక ఆడ బిడ్డ మానమర్యాదలకు భంగం వాటిల్లితే తల్లి పెంపకం సరిగా లేదని మాట్లాడం ఎంత వరకు సబబు?

• కుల ఘర్షణలు రావణ కాష్టం లాంటివి

మేము సమాజం, కులాలు కలిసి ఉండాలని కోరుకునే వాళ్లం. 2018లో ఇదే తూర్పు గోదావరి జిల్లాకు వెళ్ళి అన్ని కులాలను కూర్చోబెట్టి మాట్లాడి ఐక్యత తీసుకువచ్చాం. మా గురించి మీరు అలా మాట్లాడడం భావ్యం కాదు. మీ వద్ద ఇన్ని తప్పులు పెట్టుకుని మీరా మాకు చెప్పేది. ఈ రోజున ఒకటే కోరుకుంటున్నాం. ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలు కావచ్చు. కులాల ఘర్షణలు రావణ కాష్టం లాంటివి. ఇవి ఒక్కసారి రాజుకుంటే ఆరవు. దీనికి వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. గతంలో తునిలో మీరేం చేశారో అందరికీ తెలుసు. ప్రీ ప్లాన్డ్ గా బోగీలు తగులబెట్టించేసి దాన్ని ఇంకొకరి మీదకు తోసేశారు. ఈ రోజున మీ సొంత మంత్రులు, ఎమ్మెల్యేల మీద మీరే దాడి చేయించుకుని మీరే మాట్లాడుతున్నారు. యువత కూడా అడగాల్సిందిపోయి ఇలాంటి పరిస్థితుల్లోకి నెడుతున్నారు. ఇలాంటి కుత్సితపు రాజకీయ పోకడలు, విభజన రాజకీయాలు చేసే నాయకుల పట్ల యువత అప్రమత్తంగా ఉండి. దయచేసి యువత భావోద్వేగాలకు లోను కావద్దు. ప్రతి ఒక్కరికీ ఇది నా విన్నపం. ఒక్కసారి ఇలాంటి గొడవలు మొదలైతే ఆగవు. అవి దేశమంతా అంటుకునే పరిస్థితులు ఉంటాయి. ప్రతి ఒక్కరు చాలా సున్నితంగా, భాధ్యతగా వ్యవహరించాలి.

• మాట అనే ముందు ఆలోచించి మాట్లాడండి

మరీ ముఖ్యంగా అది వైసీపీ మంత్రి వర్గం బాధ్యత. మీరు నోటికి వచ్చిందల్లా మట్లాడడం తప్పు. గొడవలు తగ్గించే ప్రయత్నం చేయండి. పెంచే ప్రయత్నం చేయవద్దు. గొడవలు మీరే సృష్టించి దాన్ని పెంచి పెద్ద చేసే పరిస్థితిలో ఉన్నారు. వైసీపీలో మేధావులు ఉన్నారు. శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి పెద్దలు ఉన్నారు. మీ అనుభవం కులాల విచ్చిన్నానికి దారి తీస్తే ఒకసారి మీ పెద్దరికాన్ని గురించి మీరే ఆలోచించుకోవాలి. మీ మీద నాకు గౌరవం ఉంది. జరుగుతున్న సంఘటనలు ఒకసారి సరి చూసుకోండి. ఒక మాట అనే ముందు ఆలోచించుకోండి. యువత కూడా దయచేసి భావోద్వేగాలకు లోను కావద్దు. సంయమనం పాటించండి. వారు 30 రోజులు గడువిచ్చారు. కోనసీమవాసులు మీ నిర్ణయం మీరు తీసుకోండి. ఇబ్బంది అయితే రెఫరెండం అడగండి. లేదంటే కోనసీమ వాసులంతా కలసి మీ నిర్ణయం మీరు తీసుకోండి. కోనసీమలో అన్ని కులాలు ఉన్నాయి. అంతా కలిసే నిర్ణయం తీసుకోండి. ఎలాంటి దాడులకు తావివ్వకుండా శాంతి భద్రతలు పరిరక్షించే విధంగా తోడ్పాటునందించండి.

• శాంతిభద్రతల్ని పరిరక్షించాల్సిన బాధ్యత పోలీస్ శాఖదే

పోలీస్ శాఖ వారికి నా విన్నపం. వీరంతా సివిల్ సర్వీసెస్ నుంచి వచ్చినవారు.  మీరే పక్కన ఉండి రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తున్న వ్యక్తుల గురించి ఏమీ మాట్లాడకుండా, రేపటి రోజున సమాజం విచ్ఛిన్నం అయిపోతే మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. దీనికి మీదే మోరల్ ఆబ్లిగేషన్ అవుతుంది. అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినా శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన మీరు, వ్యవస్థల్ని పరిరక్షించాల్సిన ఐఏఎస్ లు బాధ్యత తీసుకోండి. మంత్రి వర్గంలో ఉన్న వారికి వారు చేస్తున్న తప్పులు చెప్పి సరిదిద్దండి.

• అంతా ఆహ్వానించే పరిస్థితులు కల్పించాలి  

జిల్లాల విభజన చేసినప్పుడు మొదట బాలాజీ జిల్లా అని పేరు పెట్టారు. అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు దాన్ని తిరుపతిగానే కొనసాగించారు. మరి ఇక్కడ ఎందుకు అభ్యంతరం వచ్చింది. నిన్నటి గొడవ ఒక కులానికి సంబంధించింది కాదు. నేను ఒక కులానికి పిలుపునివ్వడం లేదు. మొత్తం కోనసీమ వాసులంతా సంయమనం పాటించాలని పిలుపు ఇస్తున్నాను. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారు మహానుభావుడు. ఆయన పేరు పెట్టాలంటే అంతా ఆహ్వానించే పరిస్థితులు కల్పించాలి. ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్లి అందరితో మాట్లాడాలి. ప్రేమగా చెప్పి వివరిస్తే ప్రజలు వింటారు. అయినా శ్రీ అంబేద్కర్ లాంటి మహానుభావుడ్ని ఒక్క జిల్లాకు పరిమితం చేస్తామా? అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది మేథావులు ఆయన్ని కొనియాడారు. ఆయన్ను నిజంగా గౌరవించాలి అంటే ఎస్సీ సబ్ ప్లాన్ సక్రమంగా అమలు చేసి వారి కాళ్ల మీద వారు నిలబడే పరిస్థితులు కల్పించాలి.

• మా ప్రభుత్వంలో అయినా కచ్చితంగా రెఫరెండం పెడతాం

ఇది ప్రజాస్వామ్యం. ఏకస్వామ్యమో, కులస్వామ్యమో కాదు. అభ్యంతరాలు ఉంటే రెఫరెండం పెట్టాలి. నేను కర్నూలు జిల్లాకు శ్రీ దామోదరం సంజీవయ్య గారి పేరు పెడదామనుకున్నప్పుడు మా ప్రభుత్వంలో అయినా కచ్చితంగా రెఫరెండం పెడతాం. ఆ దిశగానే ముందుకు వెళ్తాం. కొంత మంది రాజకీయ నాయకులు ఎప్పుడూ కులాలు కలవకూడదు, గొడవలు పడుతూనే ఉండాలి అని కోరుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్ని కులాల మధ్య వివాదాలు సృష్టించి పబ్బం గడుపుకోవడం కిందే చూస్తాను. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు ఉన్నతమైన వ్యక్తులు అయితే ఇంత గొడవలు జరిగేవి కాదు. ప్రభుత్వమూ చేతులు కట్టుకుని కూర్చునేది కాద”ని అన్నారు.