విద్యుత్ సబ్సిడీ ఒక్క జిల్లాకి మాత్రమే ఇవ్వడానికి కారణం..?: మండలి రాజేష్

  • రైతులకు కులాలు అంటగట్టి ఆక్వా రైతుల వ్యవహారంలో జిల్లాల వారీగా వివక్ష చూపుతున్న వైసీపీ
  • రాష్ట్రం మొత్తం మీద ఒక్క గుంటూరు జిల్లాకి మాత్రమే సబ్సిడీ ఇవ్వడానికి కారణం ఏంటో చెప్పాలి
  • పక్క జిల్లాలో సబ్సిడీ వస్తుంటే కృష్ణా జిల్లా శాసనసభ్యులు ఏం చేస్తున్నారు
  • సింహాద్రి రమేష్ గారు పక్క జిల్లాలో వచ్చే సబ్సిడీ ఎంజాయ్ చేస్తున్నారు
  • విశ్వాసం చూపడం మినహా పేర్ని నాని పీకేదేమీ లేదు
  • మంత్రి జోగి రమేష్ ఆక్వా రైతులకు చేసిందేమీ లేదు
  • ఆక్వా విద్యుత్ సబ్సిడీ వ్యవహారంలో ప్రభుత్వ తీరుని ఖండిస్తున్నాం

అవనిగడ్డ: పాదయాత్రలో ఆక్వా రైతులకు రూపాయికే యూనిట్ విద్యుత్ ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి అడ్డంగా మోసం చేశారని జనసేన పార్టీ నాయకులు మండలి రాజేష్ అన్నారు. గత ఆరు నెలలుగా ఎప్పటి నుంచో వస్తున్న విద్యుత్ సబ్సిడీ కూడా ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం నిలువునా ముంచిందన్నారు. ఆక్వా రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండించారు. శుక్రవారం సాయంత్రం అవనిగడ్డ నియోజకవర్గం, నాగాయలంక మండల కేంద్రంలో ఆక్వా రైతులు, స్థానిక పార్టీ నాయకులతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ.. రైతులకు కులాలు అంటగట్టిన వైసీపీ ప్రభుత్వం ఆక్వా రైతుల వ్యవహారంలో జిల్లాల వారీగా వివక్ష చూపుతోంది. రాష్ట్రం మొత్తం మీద ఒక్క గుంటూరు జిల్లాకి మాత్రమే సబ్సిడీ ఇవ్వడానికి కారణం ఏంటో చెప్పాలి. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు గారికి పెద్ద ఎత్తున ఆ జిల్లాలో చెరువులు ఉండడమే అందుకు కారణం. పక్క నియోజకవర్గంలో సబ్సిడీ వస్తుంటే అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు గారు చోద్యం చూస్తున్నారు. తన నియోజకవర్గంలో రైతుల పక్షాన కనీసం విద్యుత్ శాఖ అధికారులతో కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. ఆయన కూడా పక్క జిల్లాలో చెరువులు సాగు చేసుకుంటూ అక్కడ వచ్చే పవర్ సబ్సిడీ ఎంజాయ్ చేస్తున్నారు. అటు మాజీ మంత్రి పేర్ని నాని గారు ఓట్లు వేసిన మచిలీపట్నం నియోజకవర్గాన్ని వదిలి తాడేపల్లి ప్యాలెస్ లో కాపురం పెట్టారు. అక్కడ ముఖ్యమంత్రి గారికి విశ్వాసం చూపే పనిని భుజాన వేసుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు సినిమా తీస్తే థియెటర్ల దగ్గర వాలిపోతారు. టిక్కెట్ల రేట్లంటూ గోల పెడతారు. ప్రచార రథం సిద్ధం చేసుకుంటే మిలటరీ రంగులు రాజ్యాంగం గుర్తుకు వస్తుందీయనకు. చివరికి టీవీ షోకు వెళ్తే ప్యాకేజీ అంటూ నోరుపారేసుకుంటున్నారు. ప్యాకేజీ ఎవరు ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? నువ్వు మగాడివైతే ఆధారాలతో నిరూపించు. నీకు దమ్ముంటే నీ నియోజకవర్గంలో ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ ఇప్పించు. లేదంటే మూసుకుని ఇంట్లో కూర్చో. మంత్రి జోగి రమేష్ గారు.. ఈయన గారు పెద్ద జోకర్. వాసూలు రాజా. చెరువు తవ్వితే ఎకరానికి రూ. 20 వేలు కప్పం కట్టాలి ఆయనకు. రైతుల దగ్గర వసూళ్లు అయితే చేస్తారు గాని.. వారికి విద్యుత్ సబ్సిడీ ఇప్పించడం చేతకాదు. అత్యంత తీర ప్రాంతం ఉన్న పెడనలో ఆక్వా రైతులకు సబ్సిడీ ఇప్పించడం తెలియదు. విద్యుత్ శాఖ అధికారులు రైతుల మీటర్లు పీక్కుపోతున్నా వీళ్లెవరూ పట్టించుకోరు. ఆక్వా రైతుల సమస్యల మీద జనసేన పార్టీ తరఫున పోరాటం చేస్తాం. వెంటనే విద్యుత్ సబ్సిడీ విడుదల చేయకుండా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శులు గాజుల శంకరరావు, పద్యాల వెంకట ప్రసాద్, మత్స్యాకర వికాస విభాగం రాష్ట్ర కార్యదర్శి లంకె యుగంధర్, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాధ్యక్షులు గుడివాక శేషుబాబు, మర్రె గంగయ్య, చింతా వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు రేమాల మురళీ, లేబాక అంకాలరావు, బండ్రెడ్డి మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.