అక్రమ మట్టి తవ్వకాలపై తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన జనసేన పార్టీ

*అక్రమంగా మట్టి తరలిస్తుంటే అధికారులు పట్టించుకోరా: జనసేన పార్టీ బండారు శ్రీనివాస్

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలోని, రావులపాలెం గోదావరి బ్రిడ్జి నది సమీపంలో, గోదావరి నదిపై నిర్మించిన వంతెనకు అతి దగ్గరగా, లంక భూమియందు అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా చాలా రోజులుగా కొనసాగుతున్నాయి. ఇళ్ల స్థలాలు మెరక చేసే పనులు కొరకు, మట్టిని వాడుతున్నట్లు, ప్రభుత్వానికి దొంగ లెక్కలు చూపిస్తూ, అక్రమ మట్టిని, మట్టి మాఫియా, అధికార పార్టీ నాయకులు అండదండలతో ప్రైవేటు లేఅవుట్లుకు అమ్ముకుంటున్నారు. ఈ విషయంపై ప్రభుత్వ జిల్లా అధికారులకు, రావులపాలెం స్థానిక ఎమ్మార్వోకు ఎన్నోసార్లు ఫోన్ ద్వారా ఫిర్యాదును తెలియజేసినా, మెక్కుబడిగా రెండు, మూడు రోజులు అక్రమ మట్టి తవ్వకాలు ఆపి, మరల యథేచ్ఛగా అధికార పార్టీ ముఖ్య నాయకులు అండదండలతో అక్రమమట్టి మాఫియా వారు, లక్షల రూపాయల విలువచేసే అక్రమ మట్టి, బొండు ఇసుకను ప్రతిరోజుకి వందల లారీలు అక్రమ మట్టిని అమ్ముకుంటున్నారు. ఈ అక్రమ మట్టి తవ్వకాలపై, కొన్ని లక్షల రూపాయలు ప్రతిరోజు అధికార పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల నాయకులు, మట్టి మాఫియా వారు సంపాదిస్తూ, అధికార పార్టీ,ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో కలిసి, 60:40 శాతం వాటాలు చొప్పున, ప్రతిరోజు వాటాలను ఇరు పార్టీల వారు, మట్టి మాఫియా వారితో పంచుకుంటూ, పైకి ప్రజలలో పోట్లాడుకుంటున్నట్లు నటిస్తున్నారు. ఈ అధికార, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల నాయకుల పనితీరుకు రాబోయే రోజుల్లో ప్రజలే ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెబుతారని గట్టిగా నమ్ముతున్నాము. కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ ఎంతో ఆవేదనతో కూడిన ప్రసంగము స్థానిక ఎమ్మార్వో కార్యాలయం రావులపాలెం వద్ద, సోమవారం జరిగిన నిరసన సమావేశంలో తెలియజేసారు. ఎప్పుడైనా ఎక్కడైనా అధికార పార్టీ నాయకులతో కలిసి బండారు శ్రీనివాస్ అనే నేను కుమ్ముక్కై నట్లు నిరూపిస్తే, నా రాజకీయ భవిష్యత్తును వదులుకుంటానని, లేనిపోని ఆరోపణలు నాపై చేసి, నిజాయితీగా ఉన్న, నన్ను ప్రజలకు దూరం చేసే ఆలోచనలో కొంతమంది దుర్మార్గులు ఉన్నారని, ఒకవేళ ఎవరైనా తప్పుడు ఆరోపణలు నిరూపిస్తే, రావులపాలెం సెంటర్లో ఎంతటి శిక్షకైనా సిద్ధపడతానని, నేను చాలెంజ్ ను బహిరంగంగా విసురుతున్నానని ఎంతో ఆవేదనతో కూడిన ప్రసంగం చేశారు. నేను కష్టంతో పైకి వచ్చిన వాడినని, నేను ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండే వాడిని కాదని, నా ఊపిరి ఉన్నంతవరకు నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తానని, నా అదినాయకుడు జనసేనాని ఆశయాల కోసం, ప్రజల మనిషి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల కోసం ఎంత కష్టం వచ్చినా నిలబడి, నియోజకవర్గము ప్రజలను గెలిపించి తీరతానని, ఈ అక్రమ లంక మట్టి, బొండు ఇసుక తోలకాలను ఆపకపోతే, అధిక వరదలకు గోదావరి బ్రిడ్జి కి ప్రమాదం ఏర్పడే సూచనలు ఉన్నాయని, ఇరవై, పాతిక అడుగుల లోతు వరకు పెద్ద పెద్ద జెసిబి లతో వందల లారీల అక్రమ మట్టిని తరలిస్తూ, అక్రమ సంపాదనే ధ్యేయంగా అధికార, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున వందలాదిగా కార్యకర్తలతో, భారీ ర్యాలీతో, శ్రీ కృష్ణదేవరాయ కాపుకళ్యాణ మండపం నుండి పాదయాత్రగా, స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ కార్యాలయానికి చేరుకుని స్థానిక ఎమ్మార్వోకు, అక్రమ మట్టి తవ్వకాలను ఆపాలని, నిరోధించాలని వినతిపత్రంను మండల, గ్రామ నాయకులతో పాటు జనసైనికులు, వీరమహిళలు, కార్యకర్తలతో వెళ్ళి అందజేయడం జరిగింది.