కైకాల మృతితో తెలుగు సినీపరిశ్రమ మూలస్థంభం ఒరిగిపోయింది: ఆళ్ళ హరి

  • కైకాల సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన గుంటూరు జనసేన

గుంటూరు: విశ్వ విఖ్యాత నటనా చక్రవర్తి, నవరస నటనా సార్వభౌముడు, తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజం కైకాల సత్యనారాయణ మృతితో తెలుగు సినీ పరిశ్రమ మూల స్తంభాన్ని కోల్పోయినట్లైందని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున పరమపదించిన ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ దాదాపు ఆరు దశాబ్దాల కాలంగా తెలుగు సినీపరిశ్రమలో సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో వందలాది పాత్రలు వేసి మెప్పించిన ఒకే ఒక నటుడు సత్యనారాయణ అని కొనియాడారు. పాత తరానికి, కొత్త తరానికి వారధిగా ఉన్న సత్యనారాయణ మృతి సినీ జగత్తు కి తీరనిలోటన్నారు. యముడిగా, సుయోధనుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా ఇలా ఎన్నో పాత్రలతో తెలుగు ప్రజల హృదయాల్లో కైకాల సత్యనారాయణ శాశ్వత స్థానాన్ని పొందారన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్, కోలా అంజి, ఇళ్ల శేషు, వడ్డె సుబ్బారావు, శెట్టి శ్రీను, చిరంజీవి, తిరుపతిరావు, దాసరి రాము, పురాణం కుమారస్వామి, కోలా చిరు దొంత నరేష్ తదితరులు పాల్గొన్నారు.