బ‌డుల విలీనంతో రూ. కోట్లు వృధా….నాడు-నేడు న‌వ్వుల పాలు

* ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు లేక తరగతి గదులకు తాళం
* జ‌గ‌న్ ప్ర‌భుత్వ అనాలోచిత విధానం

ఒక ప‌క్క విద్యార్థుల‌లో ఆవేద‌న‌…
మ‌రో ప‌క్క త‌ల్లిదండ్రులలో అసంతృప్తి…
ఒక చోట ఖాళీ బ‌డులు…
మ‌రో చోట కిక్కిరిసిన త‌ర‌గతులు…
కోట్లాది రూపాయ‌ల వృధా…
ఆశించిన ఫ‌లితం శూన్యం…
– జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న పాఠ‌శాల‌ల విలీనం నిర్ణ‌యం వాస్త‌వంలో ఆవిష్క‌రించిన అంశాలివి!
ఒక నిర్ణ‌యం వ‌ల‌న క‌లిగిన ఫ‌లితాన్ని మ‌రో నిర్ణ‌యం నీరుగార్చిందంటే… ఆ రెండు నిర్ణ‌యాలు కూడా స‌రైన‌వి కావ‌నే అర్థం!
కూలంక‌షమైన చ‌ర్చ లేకుండా… సంబంధిత వ‌ర్గాలతో స‌మాలోచించ‌కుండా… లోటు పాట్ల గురించి అవ‌గాహ‌న లేకుండా… ప‌క‌డ్పందీ ప్ర‌ణాళిక లేకుండా… అత్యుత్సాహంతో, అనాలోచితంగా తీసుకునే ఎలాంటి నిర్ణ‌యాలైనా వాస్త‌వంలో విఫ‌ల‌మవుతాయ‌న‌డానికి ‘నాడు-నేడు మ‌న‌బ‌డి’, ‘పాఠ‌శాల‌ల విలీనం’ విధానాలే ఉదాహ‌ర‌ణ‌లుగా నిలిచాయి.
ఒక్క ఈ విష‌యంలోనే కాదు… విద్యావిధానానికి సంబంధించి అనాలోచితంగా తీసుకున్న అనేక నిర్ణ‌యాలు మొత్తం వ్య‌వ‌స్థ‌నే నీరుగార్చే విధంగా త‌యార‌య్యాయి!
విద్యార్థులు, త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయులు… ఇలా ఏ వ‌ర్గం వారికీ కొరుకుడు ప‌డ‌ని అసంబద్ధ విధానాల వ‌ల్ల అంద‌రిలోనూ అసంతృప్తే మిగిలింది. ఇవ‌న్నీ అర్థం కావాలంటే పూర్వాప‌రాల్లోకి వెళ్లాలి.
* నీరుగారిన నాడు-నేడు!
జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల్లో వ‌స‌తుల‌ను మెరుగుప‌ర‌చ‌డానికి ‘మ‌న‌బ‌డి నాడు-నేడు’ ప‌ధ‌కానికి 2019 న‌వంబ‌ర్ 14న శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో వేర్వేరు విభాగాల అజ‌మాయిషీలో ఉన్న మొత్తం 44,512 స్కూళ్ల‌లో మౌలిక స‌దుపాయాల‌ను మూడు ద‌శ‌ల్లో 2024 క‌ల్లా మెరుగుప‌ర‌చాల‌ని, ఇందుకోసం రూ.16,000 కోట్లు ఖ‌ర్చు చేయాల‌ని నిర్ణ‌యించారు. పంచాయితీరాజ్‌, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ, గిరిజ‌న సంక్షేమ‌, మైనారిటీ సంక్షేమ‌, జువైన‌ల్‌, మిష‌న‌రీస్ డిపార్టుమెంట్ అధీనంలో ఉన్న అన్ని స్కూళ్‌అలోను ఈ నిధుల‌ను ఖ‌ర్చు చేయాల‌ని త‌ల‌పోశారు.
“ఇలాంటి ప‌ధ‌కాన్ని చేప‌ట్ట‌డం దేశం మొత్తం మీద ఇదే ప్ర‌ధ‌మం…” అంటూ ఘ‌నంగా ప్ర‌చారం చేసుకున్నారు. ఇందులో మొద‌టి ద‌శ కింద 15, 715 స్కూళ్ల‌లో దాదాపు రూ.3,700 కోట్లు ఖ‌ర్చు చేసి స‌దుపాయాలు క‌ల్పించారు. ఈ ప‌నులు పూర్తి కావ‌డానికి మ‌రో రూ.300 కోట్లు ఇంకా ఖ‌ర్చు చేయాల్సి ఉంది.
ఇక రెండో ద‌శ కింద 25 వేల స్కూళ్ల‌లో రూ. 11,267 కోట్లు ఖ‌ర్చు చేయాల‌ని నిర్ణ‌యించారు. కొన్ని స్కూళ్ల‌లో ప‌నులు మొద‌లు పెట్టి దాదాపు రూ. 245 కోట్లు ఖ‌ర్చు చేశారు. అయితే మొదటి ద‌శ ప‌నుల‌కు సంబంధించి బిల్లుల బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌డంతో రెండో ద‌శ ప‌నులు చేప‌ట్ట‌డానికి చాలా మంది కాంట్రాక్ట‌ర్లు ముందుకు రాలేదు. పాత బిల్లులు చెల్లించ‌క‌పోతే ప‌నులు కొన‌సాగించేది లేదని తేల్చిచెప్పారు. మొత్తంమీద ప‌నులు జ‌రిగినంత వ‌రకు చూస్తే చాలా పాఠ‌శాల‌లు కొత్త రంగుల‌తో, స‌దుపాయాల‌తో మెరుగు ప‌డ్డాయి.
ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. ‘నాడు-నేడు’ ప‌నుల ల‌క్ష్యం పూర్తిగా నెర‌వేర‌కుండానే హడావుడిగా, అనాలోచితంగా జ‌గ‌న్ ప్రభుత్వం ‘పాఠశాల‌ల విలీనం’ అనే కొత్త నిర్ణ‌యం తీసుకుంది. ఇక్క‌డే వ‌చ్చింది చిక్కు. ‘మ‌న‌బడి’ ప‌ధ‌కం కోసం చేసిన కోట్లాది రూపాయ‌ల ఖ‌ర్చంతా, ‘విలీనం’ నిర్ణ‌యం వ‌ల్ల నీరుగారిపోయే ప‌రిస్థితి త‌లెత్తింది.
*ఎందుకొచ్చిన విలీనం?
ఇంతవ‌ర‌కు విద్య‌కు సంబంధించి ప్రాథ‌మిక‌, ప్రాథ‌మికోన్న‌త‌, ఉన్నత అనే అంచెలు ఉన్నాయి. దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో కొన్ని వ్య‌త్యాసాలు ఉన్న‌ప్ప‌టికీ ఇంచుమించు అన్ని చోట్లా ఇలాంటి అంచెలే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో జాతీయ విద్యావిధానం పేరిట కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాల‌కు కొన్ని సూచ‌న‌లు చేసింది. దాని ప్ర‌కారం ప్రీ ప్రైమ‌రీ (1వ త‌ర‌గ‌తికి ముందు), ఫౌండేష‌న‌ల్ (రెండో త‌ర‌గ‌తి వ‌ర‌కు), సెకండ‌రీ (3 నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు) మూడు అంచెలు ఉండాల‌నేది ఆ సూచ‌న‌ల్లో ఒక‌టి. విభిన్న భాష‌లు, భౌగోళిక తీరుతెన్నులు, వేర్వేరు సంస్కృతులు మిళిత‌మై ఉండే దేశంలో ఒకే త‌ర‌హా విద్యా విధానాన్ని అమ‌లు చేయ‌డానికి కొన్ని ప‌రిమితులు ఉంటాయ‌నేది అంద‌రికీ తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేంద్రం సూచించిన ఈ నేష‌న‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ పాల‌సీని కేర‌ళ‌, త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్ లాంటి కొన్ని రాష్ట్రాలు వ్య‌తిరేకించాయి. మ‌రి కొన్ని రాష్ట్రాలు సాధ్యాసాధ్యాలు, ప‌రిమితులు, ఇత‌ర‌త్రా అంశాల‌ను దృష్టిలో పెట్టుకుని చ‌ర్చ‌లు, స‌ర్వేలు జ‌రిపే ప‌నిలో ప‌డ్డాయి.
అయితే జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్రం రాష్ట్రంలోని స్థితిగ‌తులు, పేద‌రికం, భౌగోళిక ప‌రిస్థితులు, విద్యార్థుల గ్రాహ్య‌త‌, త‌ల్లిదండ్రుల సంసిద్ధ‌త‌, ఉపాధ్యాయుల అభిప్రాయాలు, విద్యావేత్త‌ల సూచ‌న‌లు లాంటివేమీ పెద్దగా ప‌రిగ‌ణించ‌కుండానే పాఠ‌శాల‌ల విలీనంపై నిర్ణ‌యానికి వ‌చ్చేసింది. హ‌డావుడిగా జీవో జారీ చేసి ఆ నిర్ణ‌యాన్ని అమ‌లు ప‌రిచేసింది. దీని ప్ర‌కారం 3 నుంచి 5వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ఉన్న విద్యార్థుల‌ను స‌మీపంలోని సెకండ‌రీ స్కూళ్ల‌లో విలీనం చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. దాంతో అప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు స‌మీపంలో ఉండే బ‌డుల్లో చ‌దువుకునే పిల్ల‌లు రెండు మూడు కిలోమీట‌ర్ల దూరంలోని మ‌రో బ‌డికి త‌ర‌లిపోవాల్సి వ‌చ్చింది. దాంతో ఈ విలీనం నిర్ణ‌యంపై అటు త‌ల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయుల్లో సైతం వ్య‌త‌రేక‌త వ్య‌క్త‌మైంది. చాలా చోట్ల ఆందోళ‌ల‌ను జ‌రిగాయి. ఇప్ప‌టికీ జ‌రుగుతూనే ఉన్నాయి. అయినప్ప‌టికీ జ‌గ‌న్ ప్‌ంభుత్వం మొండిగా ముందుకు పోతోంది.
*అటు వృధా… ఇటు వ్య‌ధ‌…
ఈ విలీనం విధానం వ‌ల్ల ఇంత వ‌ర‌కు మ‌న‌బ‌డి ప‌ధ‌కం కింద పెట్టిన వేలాది కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చులో అధిక‌భాగం వృధా అయ్యే ప‌రిస్థితులు త‌లెత్తాయి. దాంతో పాటు ఒక చోట ఖాళీ బ‌డులు క‌నిపిస్తుండ‌గా, మ‌రో ప‌క్క ఒకే హాలులో వేర్వేరు త‌ర‌గ‌తుల‌ను కిక్కిరిసిన‌ విద్యార్థుల‌తో తర‌గ‌తులు న‌డ‌పాల్సిన విచిత్ర దృశ్యాలు క‌ళ్ల ముందు నిలుస్తున్నాయి. ఇవేంటో చూడాలంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నెల‌కొన్న ఉదాహ‌ర‌ణ‌ల‌ను కొన్న‌యినా ప‌రిశీలించాలి.
* విద్యార్థుల‌ను వేరే స్కూళ్ల‌కు త‌ర‌లించ‌డంతో ల‌క్ష‌లాది, కోట్లాది రూపాయ‌ల ఖ‌ర్చుతో మెరుగుప‌రిచిన బ‌డులు చాలా చోట్ల నేడు ఖాళీగా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. అదే స‌మ‌యంలో 3, 4, 5 త‌ర‌గ‌తుల పిల్ల‌ల‌ను త‌ర‌లించిన ఉన్న‌త పాఠ‌శాలల్లో గ‌దుల కొర‌త‌, స‌దుపాయాల లేమి త‌లెత్తింది. దీంతో కొన్ని చోట్ల ఒకే హాలులో రెండు మూడు త‌ర‌గ‌తుల విద్యార్థుల‌ను కిక్కిరిసిపోయేలా కూర్చోబెట్టి పాఠాలు చెప్పాల్సి వ‌స్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల‌పై విద్యార్థులు, త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.
* ముఖ్య‌మంత్రి సొంత జిల్లా క‌డ‌ప‌లోనే త‌ల్లిదండ్రులు నిర‌స‌నల‌కు దిగారు. పులివెందుల నియోజ‌క వ‌ర్గం వేంప‌ల్లెలోని చింత‌ల‌మడుగుప‌ల్లె ప్రాథ‌మిక పాఠ‌శాల‌లకు ల‌క్ష‌లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేశారు. అయితే వీటి నుంచి 3, 4, 5 త‌ర‌గ‌తుల‌కు చెందిన 200 మంది విద్యార్థుల‌ను హైస్కూల్లో విలీనం చేయాల‌ని నిర్ణ‌యించడ‌మే ఇందుకు కార‌ణం.
* తూర్పుగోదావ‌రి జిల్లా రంగంపేట మండలంలో 12 ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల‌ను మ‌న‌బ‌డి కింద అభివృద్ది చేసి, అద‌న‌పు గ‌దుల‌ను కూడా సిద్ధం చేశారు. కానీ విలీనం వ‌ల్ల ఇప్పుడ‌క్క‌డ కేవ‌లం 1, 2 త‌ర‌గ‌తులు, అంగ‌న్‌వాడీ పిల్ల‌లు మాత్ర‌మే మిగిలారు. ఖాళీగా ప‌డి ఉన్న త‌ర‌గ‌తులకు తాళాలు వేశారు. జుత్తాడ పాఠ‌శాల కోసం రూ. 25 లక్ష‌లు ఖ‌ర్చు చేయ‌గా, అందులోని 5 గ‌దుల్లో మూడు గ‌దుల‌కు తాళాలు వేలాడుతున్నాయి.
* బాప‌ట్ల జిల్లాలో 50 బ‌డుల‌ను ఆధునికీక‌రించి కూడా వాటిలోని విద్యార్థుల‌ను 73 హైస్కూళ్ల‌లో విలీనం చేశారు.
* నెల్లూరు జిల్లా సంగం మండ‌లం త‌రుణ‌వాయి పాఠ‌శాల‌లో 5 వ త‌ర‌గ‌తి వ‌ర‌కు 63 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ రూ. 16 లక్ష‌లు పెట్టి వ‌స‌తులు క‌ల్పించినప్ప‌టికీ విలీనం వ‌ల్ల ఇప్పుడు 5 గ‌దుల‌కు కేవ‌లం 22 మంది పిల్ల‌లు మిగిలారు.
* అనంత‌పురం జిల్లాలో రూ. 399 కోట్లకు పైగా ఖ‌ర్చు చేసి 1294 పాఠ‌శాల‌ల్లో ప‌నులు చేసినా, వీటిలో వంద‌లాది బ‌డుల‌ను విలీనం చేయ‌డంతో ప్ర‌జాధ‌నం వృధా అయింది.
ఇవి కేవ‌లం కొన్ని ఉదాహ‌ర‌ణలు మాత్ర‌మే. ఇలా ఏ జిల్లాలో చూసినా ఒక వైపు ముస్తాబై బోసిపోతున్న బ‌డులు, మ‌రోవైపు కిక్కిరిసిపోయి స‌త‌మ‌త‌మ‌వుతున్న త‌ర‌గ‌తులు క‌నిపిస్తున్నాయి.
*అవ‌క‌త‌వ‌క విద్యావిధానాలు…
జ‌గ‌న్ ప్ర‌భుత్వం విద్య విష‌యంలో అనాలోచితంగా తీసుకునే అనేక నిర్ణ‌యాలు స‌రైన ఫ‌లితాల‌ను ఇవ్వ‌లేక‌పోగా, అన‌వ‌స‌ర‌మైన గంద‌ర‌గోళానికి దారితీశాయి. ప్ర‌భుత్వం ప్ర‌చారానికి, పైపై మెరుగుల‌కు మాత్ర‌మే పాధాన్య‌త ఇస్తూ మౌలికమైన అంశాల‌ను విస్మ‌రించడ‌మే ఇందుకు కార‌ణం. ముఖ్యంగా బోధ‌నా విధానాల‌ను మెరుగు ప‌ర‌చాల్సిన అవ‌సరం ఎంతో ఉంది. ఇప్ప‌టికి కూడా టీచ‌ర్ల‌కు మెరుగైన శిక్ష‌ణ ఇచ్చే సదుపాయాలు కానీ, ఏర్పాట్లు కానీ లేవు. ఉపాధ్యాయుల ఖాళీల‌ను భ‌ర్తీ చేసే దిశ‌గా చ‌ర్య‌లు కూడా స‌రిగా క‌నిపించ‌డం లేదు.
* ఇంగ్లిషు మీడియం విష‌యం కూడా ఇలాగే గంద‌ర‌గోళానికి దారితీసింది. స‌రైన ఫౌండేష‌న్ కోర్సుల‌ను నిర్వ‌హించ‌కుండా ఒక్క‌సారిగా ఇంగ్లిషు మీడియం ప్ర‌వేశ పెట్టాల‌నుకోవ‌డం విమ‌ర్శ‌ల‌కు గురైంది. టీచ‌ర్ల‌కు అందుకు త‌గిన నైపుణ్యం ఉందా లేదా అనే ఆలోచ‌న లేకుండానే ప్ర‌క‌ట‌న చేశారు. ఆఖ‌రికి ఈ విష‌యం ఇప్పుడు కోర్టు ప‌రిశీల‌న‌లో ఉంది.
* అలాగే స్టేట్ బోర్డు నుంచి సెంట్ర‌ల్‌బోర్డు ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ విధానంలోకి మార్చాల‌నుకోవడం కూడా హ‌డావుడి నిర్ణ‌యంగానే మిగిలిపోయింది. స‌రైన చ‌ర్చ‌, సంసిద్ధ‌త లేకుండా చేసిన ప్ర‌క‌ట‌న అయోమ‌యానికి దారితీసింది.
* రాష్ట్రంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు దాదాపు 60 వేల నుంచి 80 వేల వ‌ర‌కు ఉపాధ్యాయుల అవ‌స‌రం ఉంది. కానీ టీచ‌ర్ల ఖాళీల భ‌ర్తీకి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు. ఇందుకు బ‌దులు జూనియ‌ర్ టీచ‌ర్ల‌ను సీనియ‌ర్ స్థానాల్లోకి మారుస్తున్నారు. కొంద‌రు ప్రాథమిక స్కూళ్ల టీచ‌ర్ల‌ను హైస్కూళ్ల‌కు కేటాయించ‌డం కూడా ఫ‌లిత‌మివ్వ‌లేదు. వీరికి పెద్ద త‌ర‌గ‌తుల‌కు బోధించే నైపుణ్యం ఉందో లేదో చూడ‌కుండానే ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో కొన్ని చోట్ల గంద‌ర‌గోళ ప‌రిస్థితులు త‌లెత్తాయి. ఆఖ‌రికి అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్ల‌ను కూడా టీచ‌ర్లుగా తీసుకోవ‌డం విమ‌ర్శ‌ల‌కు గురైంది.
* విద్యా వాలంటీర్ల కార్య‌క్ర‌మంలో భాగంగా శిక్ష‌ణ లేని ప‌ట్ట‌భ‌ద్రుల‌ను కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో తీసుకోవ‌డం కూడా ఫ‌లిత‌మివ్వ‌లేదు.
* బ‌డుల విలీనం ‘విద్యాహ‌క్కు’ చ‌ట్టానికి వ్య‌తిరేక‌మ‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ చ‌ట్టం ప్ర‌కారం త‌మ నివాసాల‌కు ఒక కిలోమీట‌రు ప‌రిధిలోనే బ‌డులు ఉండేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. కానీ విలీనం వ‌ల్ల విద్యార్థులు రెండు మూడు కిలోమీట‌ర్ల దూరంలోని హైస్కూళ్ల‌కు వెళ్లాల్సి రావ‌డం ప్ర‌తికూల ఫ‌లితాల‌ను ఇస్తుంద‌నే విమ‌ర్శ‌లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆడ‌పిల్ల‌లు, గిరిజ‌న ప్రాంతాల్లోని పిల్ల‌ల‌కు ఇది విద్య‌నే దూరం చేస్తుంద‌నే భయాందోళ‌న‌లు వ్య‌క్తమ‌వుతున్నాయి.
* విలీనం వ‌ల్ల ఖాళీ అయిన బ‌డులు క్‌‌మేణా ప్రైవేటు పార్టీల చేతుల్లోకి వెళ‌తాయ‌ని, అసాంఘిక కార్య‌కలాపాల‌కు నెల‌వుల‌వుతాయ‌నే భ‌యాలు కూడా ఉన్నాయి.
ఇలా అనేక అవ‌క‌త‌వ‌క నిర్ణ‌యాలు, అనాలోచిత ప్ర‌క‌ట‌న‌లు, అసంబ‌ద్ద ఆదేశాలు, హ‌డావుడి చ‌ర్య‌ల‌తో జ‌గ‌న్ ప్ర‌భుత్వం విద్యా రంగంలో తీవ్ర అయోమ‌య ప‌రిస్థితుల‌ను సృష్టించింద‌న‌డంలో సందేహం లేదు.