యాస్ తుపాను.. హెచ్చరికలు జారీ చేసిన ఏపీ విపత్తు నిర్వహణ శాఖ

అతి తీవ్ర తుపాను ‘యాస్’ తీరం వైపుగా పయనిస్తోంది. వాతావరణశాఖ ప్రకటన ప్రకారం ప్రస్తుతం తూర్పు, మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను… 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుంది. 26వ తేదీ మధ్యాహ్నం ఉత్తర ఒడిశా – పశ్చిమబెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ స్పందించింది. తుపాను కారణంగా ఈరోజు, రేపు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నెల్లూరు నుంచి ఉత్తరాంధ్ర తీరం వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. సముద్ర అలలు 2.9 మీటర్ల నుంచి 4.5 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడతాయని చెప్పింది. తీరప్రాంత, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.