మా పార్టీకి ఓటు వేయవా? అంటూ ఇనుప రాడ్లతో వైసిపి కార్యకర్తల దాడి..

ఎపిలో నాలుగు విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. కాగా, అక్కడక్కడా చదురుముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని నిన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ చెప్పారు. అయితే, కష్ణాజిల్లా వత్సవాయి మండలం తాళ్లూరులో ఓటు వేయలేదని ఓ వ్యక్తిపై దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పెద్ది తిరపతయ్య ఓటు వేయలేదని తనపై వైసిపి కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. దాదాపు 20 మంది వరకూ వచ్చి ఇనుప రాడ్లు, కర్రలతో దాడిచేశారని, తలకు, కాళ్లకు తీవ్రగాయాలు అయ్యాయని తెలిపారు. అంతేకాకుండా తనపై దాడి జరుగుతున్నప్పుడు అడ్డుకోబోయిన తన కుమారుడు ఉపేంద్ర, కుమార్తె ధనలక్ష్మిలపై కూడా దాడి చేసి గాయపరిచారన్నారు. తీవ్ర గాయాలపాలైన తిరపతయ్యను కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే ఖమ్మం జిల్లా మధిరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులను మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య పరామర్శించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్సై సోమేశ్వరరావు బాధితుల నుంచి ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేస్తామని, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. ఎస్‌టి సామాజిక వర్గానికి చెందిన తిరపతయ్య, అతని కుటుంబసభ్యులపై దాడి చేయడం దుర్మార్గమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.