ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్ధుల్ని ప్రకటించిన వైసిపి

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరగనున్న ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల్ని ప్రకటించింది. టీచర్స్ ఎమ్మెల్సీలో పార్టీ అభ్యర్ధిని రంగంలో దింపడం లేదని వైసీపీ ప్రదాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

ఏపీలో త్వరలో ఆరు స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యే కోటాలో జరిగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రెండు ఖాళీలున్నాయి. మరో నాలుగు స్థానాలకు మార్చ్ 29వ తేదీతో పదవీ కాలం ముగియనుంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా, చల్లా రామకృష్ణారెడ్డి మరణంతో రెండు స్థానాలు ఖాళీ కాగా..తిప్పేస్వామి, సంధ్యారాణి, వీర వెంకట చౌదరి, షేక్ మొహ్మద్ ఇక్బాల్ స్థానాల పదవీకాలం ముగియనుంది. ఈ స్థానాలకు సంబంధించి వైఎఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల్ని ప్రకటించింది. అనంతపురం నేత మొహ్మద్ ఇక్బాల్‌కు మరోసారి అవకాశం లభిస్తుండగా..కర్నూలు జిల్లాకు చెందిన చల్లా రామకృష్ణారెడ్డి మరణంతో ఆయన కుమారుడికి అవకాశం కల్పించింది పార్టీ. అదే విధంగా తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మరణంతో ఆయన కుమారుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీగా పార్టీ అవకాశం కల్పిస్తోంది. ఇక విజయవాడ నుంచి కార్పొరేటర్ మొహ్మద్ కరీమున్నీసా, శ్రీకాకుళం జిల్లా నుంచి దువ్వాడ శ్రీనివాస్, సీనియర్ నేత సి రామచంద్రయ్యలకు పార్టీ ఆవకాశం కల్పించినట్టు ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి  స్పష్టం చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధులు

చల్లా భగీరధరెడ్డి

బల్లి కళ్యాణ చక్రవర్తి

సి రామచంద్రయ్య

మొహ్మద్ ఇక్బాల్

దువ్వాడ శ్రీనివాస్

కరీమున్నీసా

వీటితో పాటు ఏపీలో రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు సైతం ఎన్నిక జరగనుంది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి పార్టీ అభ్యర్ధిని నిలబెట్టడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.