శవ రాజకీయాలకు పేటెంట్ హక్కు వైసీపీదే

  • యాత్ర సినిమాపై పెట్టిన శ్రద్ధ ప్రజల భద్రతపై పెడితే బాగుండేది
  • ఆరోగ్యశాఖామంత్రిగా రజినీ అనర్హురాలు
  • ప్రజల అనారోగ్యానికి డయేరియా కారణం కాదంటూ కమీషనర్ చెప్పటం బాధ్యతారాహిత్యం
  • ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉంటే ఎమ్మెల్యే ముస్తఫా ఎక్కడ దాక్కున్నారు
  • ప్రజలు తాగటానికి రక్షిత మంచినీరు అందించలేని స్థితిలో నగరపాలక సంస్థ పాలకవర్గం ఉండటం సిగ్గుచేటు
  • మృతి చెందిన గిరిజన యువతి కుటుంబానికి తక్షణమే పరిహారం అందించాలి
  • జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: కలుషిత మంచినీరు తాగి ముక్కుపచ్చలారని ఒక గిరిజన యువతి మృతి చెందటమే కాకుండా ఎంతోమంది అస్వస్థతకు గురై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుంటే వారిని ఆడుకోవాల్సింది పోయి శవ రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలపై ఆరోగ్యశాఖామంత్రి రజిని మాట్లాడటం సిగ్గుచేటని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మండిపడ్డారు. శవ రాజకీయాల పునాదులపై ఏర్పడిన పార్టీ ఏదో ప్రజలందరికీ తెలుసన్నారు.అసలు శవ రాజకీయాలకు పేటెంట్ హక్కే వైకాపాది అంటూ దుయ్యబట్టారు. డయేరియాతో మృతిచెందిన పద్మ పార్ధీవదేహానికి ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి రజినీ బ్యానర్లపై పెట్టిన శ్రద్దలో కాస్తన్నా ప్రజారోగ్యంపై పెడితే బాగుండేదని విమర్శించారు. ప్రచారం ఎక్కువ పని తక్కువలా మంత్రి పనితీరు ఉంటుందని ఎద్దేవా చేశారు. ప్రజలను కాపాడలేని మంత్రి రజినీ ఆరోగ్యశాఖామంత్రిగా అనర్హురాలు అంటూ దుయ్యబట్టారు. పద్మ మృతికి డయేరియా కారణం కాదంటూ సాక్ష్యాత్తూ నగర కమీషనర్ వ్యాఖ్యానించటం దుర్మార్గమన్నారు. తమ చేతకానితనాన్ని , బాధ్యతారాహిత్యాన్ని ఇలా సమర్ధించుకోవటం సిగ్గుచేటన్నారు. స్వయంగా ప్రభుత్వాసుపత్రి సూపరెండెంట్ 19 మంది డయేరియా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అని చెబుతుంటే , కమీషనర్ ఇలా వ్యాఖ్యానించటం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర రాజధాని కేంద్రమైన గుంటూరు నగరంలో తాగటానికి గుక్కెడు రక్షిత మంచినీరు అందించలేని స్థితిలో నగరపాలక సంస్థ పాలకవర్గం , ఉన్నతాధికారులు ఉన్నారంటే ఇంతకన్నా సిగ్గుపడాల్సిన విషయం మరొకటి ఉండదన్నారు .ప్రజలు పదేళ్లు శాసనసభ్యుడిగా అధికారాన్ని ఇస్తే నియోజకవర్గాన్ని అన్నివిధాలా అధః పాతాల్లోనికి తీసుకెళ్లిన ఘనత స్థానిక ఎమ్మెల్యే ముస్తఫాకే దక్కుతుందంటూ ఎద్దేవా చేశారు. ప్రజలు కలుషిత మంచినీరు తాగి తీవ్ర అస్వస్థతతో ప్రభుత్వాసుపత్రిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఉంటే అండగా నిలిచి ధైర్యం చెప్పాల్సిన ముస్తఫా అడ్రెస్ లేకుండా పోయాడని తూర్పారపట్టారు. వైసీపీ ప్రభుత్వంలో నాయకులకు కానీ అధికారులకు కానీ జవాబుదారీతనం లేదని ఆయన విమర్శించారు. యధారాజా తథా నాయకులు అన్నట్లుగా రాష్ట్రంలో పాలన సాగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు దెబ్బతిన్న పైప్ లైన్లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించి కలుషిత నీరు సరఫరా కాకుండా చూడాలని కోరారు. పద్మ మృతితో దిక్కులేకుండా పోయిన ఆమె కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించటంతో పాటూ అన్నివిధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆళ్ళ హరి డిమాండ్ చేశారు. పద్మ అంతిమయాత్రలో డివిజన్ అధ్యక్షుడు కొండూరి శ్యామ్, నగర ఉపాధ్యక్షులు కొండూరు కిషోర్, రెల్లి యువనేత సోమి ఉదయ్ కుమార్, బందెల నవీన్, సయ్యద్ షర్ఫుద్దీన్, కొనిదేటి కిషోర్, నండూరి స్వామి తదితరులు పాల్గొన్నారు.