వైసీపీ రైతు వ్యతిరేకి

• పంట నష్టం వివరాల సేకరణలోనూ అలక్ష్యమే
• తడిసిన ప్రతి గింజనీ ప్రభుత్వం కొనుగోలు చేయాలి
• నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందుల పాల్జేస్తున్నారు
• రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు దక్కని భరోసా
• రూ.6 లక్షల కోట్లు అప్పు చేసి ఏం సాధించారు?
• తూర్పుగోదావరి జిల్లా సమనస గ్రామంలో నీట మునిగిన పొలాలను పరిశీలించిన శ్రీ నాదెండ్ల మనోహర్

రాష్ట్రంలో 70శాతం మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి బతుకుతుంటే పాలకులు మాత్రం రైతుల ను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. భారీ వర్షాలతో పంటలు దెబ్బ తింటే కనీసం నష్టం వివరాలను కూడా సక్రమంగా సేకరించడం లేదన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న శ్రీ మనోహర్ గారు సోమవారం ఉదయం అమలాపురం సమీపంలోని సమనస గ్రామంలో పంట పొలాలకు వెళ్ళి మొలకలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో, రైతు సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. అప్పు చేసి సాగు చేసిన కౌలు రైతు శ్రీ మధుర సాయిబాబు భారీ వర్షాలతో పంట నీట మునగటంతో గుండె పోటు వచ్చి మరణించారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరఫున రూ.50 వేలు ఆర్థిక సాయం చేశారు. అనంతరం శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఏ విధంగా ఉందో పచ్చటి కోనసీమను చూస్తే అర్థం అవుతోంది. ఇక్కడి రైతాంగంలో తీవ్ర ఆవేదన ఉంది. మన వ్యవసాయాన్ని నిలబెట్టిన గొప్ప రైతులు కోనసీమలో ఉన్నారు. ఇప్పుడు వారే ఆవేదనకు లోనైతే వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్తుంది. పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం సక్రమంగా వివరాలు సేకరించి ప్రతి రైతునీ ఆదుకోవాలి. వైసీపీ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల నుంచి తగిన సమాచారం కూడా రైతులకు ఇవ్వడం లేదు. క్షేత్ర స్థాయిలో అధికార యంత్రాంగం ప్రతి రైతునీ కలసి పూర్తి స్థాయిలో అంచనాలు రూపొందించాలి. ఈ విషయంలోనూ అలక్ష్యమే. గతంలో వ్యవస్థలు ఏ విధానాన్ని తెచ్చినా అందరికీ ఉపయోగపడే విధంగా ఉండేవి. ఇప్పుడు అది కాస్త 30 శాతం మందికి మాత్రమే ఉపయోగపడేలా ముందుగానే నిర్ణయించి.. మండలానికి ఇంతే పరిహారం ఇవ్వండని అధికార యంత్రాంగాన్ని ఆదేశిస్తున్నారు. ఇది అన్యాయమైన విధానం. ఇది కచ్చితంగా రైతు వ్యతిరేక పాలనే.

• ఇన్ పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు

ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల, తుపాన్ల మూలంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఇలాగైతే రైతులు, కౌలుకు సాగు చేసేవారి పరిస్థితి ఏమిటి? విపత్తుల మూలంగా కలిగిన నష్టం అంచనాలు ఇప్పటి వరకు రూపొందించలేదు. రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు భరోసా లేదు. ఎందుకు పెట్టారో తెలియడం లేదు. ప్రభుత్వం నుంచి ఆర్ధిక సాయం వస్తుందని ఎదురు చూస్తున్న రైతులకు నిరాశ ఎదురవుతోంది. ఈ ప్రభుత్వం రైతుల్ని అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతోంది. కనీసం ఇన్ పుట్ సబ్సిడీ కూడా అందకుండా నిబంధనలు పెట్టింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ఇలా నష్టం వాటిల్లినప్పుడు ప్రభుత్వం నుంచి పరిహారం వస్తుందని ఆశించిన రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇన్ పుట్ సబ్సిడీ సరిగా రాలేదు. గత సంవత్సరం పంట తాలూకు డబ్బు ఈ రోజుకీ రైతుల ఖాతాల్లో జమ కాలేదు. వైసీపీ ప్రభుత్వ పరిపాలన రైతుకి వ్యతిరేకంగా జరుగుతుంది. ఎక్కడా రైతుకి అనుకూలంగా జరగడం లేదు. ప్రతి ప్రాంతంలో నష్టం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి. రూ.ఆరు లక్షల కోట్లు రుణాలు తీసుకువచ్చారు. ఏం సాధించారు. 70 శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న రాష్ట్రం కాబట్టి రైతాంగాన్ని ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి స్పందించాలని జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం.

• నష్టం ఏ విధంగా లెక్కించారు?

బాతులు తినేందుకు కూడా
పనికిరాకుండా పోయాయి ఈ వడ్లు. కనీస మద్దతు ధర దక్కడం లేదు. పంటను ఎవరూ కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఇంత పంట నష్టం జరిగితే నష్టం తాలూకు అంచనాలు ఏ ప్రాతిపదికన రూపొందించారో రైతులకు అర్ధం కావడం లేదు. ఎన్ని ఎకరాలు పోయినట్టు రాశారో తెలియని పరిస్థితి. తడిసిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. సర్వే నంబర్ లెక్కన అంచనాలు వేస్తున్నారు. గతంలో మండలం, గ్రామం యూనిట్ గా అంచనాలు రూపొందించి పరిహారం అందించేవారు. దాన్ని పూర్తిగా మార్చేశారు. అందరికీ పనికొచ్చే విధానాలు అమలు చేయాలి తప్ప తమకు నచ్చిన విధంగా చేస్తే కష్ట జీవులు నష్టపోతారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఖండిస్తున్నాం. ప్రభుత్వం ముందుకు వచ్చి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలి” అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్, అమలాపురం ఇంఛార్జ్ శ్రీ శెట్టిబత్తుల రాజబాబు, పీఏసీ సభ్యులు శ్రీ పితాని బాలకృష్ణ, శ్రీ పంతం నానాజీ, వివిధ నియోజకవర్గాల ఇంఛార్జులు పాల్గొన్నారు.