రాష్ట్రంలో శాంతిభద్రతల నాశనానికి వైసీపీయే కారణం

* పిచ్చి చేష్టలతో అలజడి సృష్టిస్తున్నారు
* శ్రీ పవన్ కళ్యాణ్ విమానాన్ని అడ్డుకోవడం అత్యంత దుర్మార్గం
* గన్నవరం విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడిన శ్రీ నాదెండ్ల మనోహర్

శాంతియుత వాతావరణంలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు నిరసన తెలపడానికి వస్తున్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గార్ని అడ్డుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు వైసీపీ ప్రభుత్వ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగబోయే పార్టీ పీఏసీ సభ్యులు, సీనియర్ నాయకుల సమావేశంలో పాల్గొనేందుకు శనివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చేందుకు సిద్ధమైన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని బేగంపేట ఎయిర్పోర్ట్ లోనే పోలీసులు అడ్డుకున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ గన్నవరం ఎయిర్పోర్ట్ డైరెక్టర్ కు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక విమానానికి అనుమతి ఇవ్వవద్దని లేఖ రాయడంతో ఎయిర్ పోర్టు అధికారులు ముందస్తు చర్యలో భాగంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రయాణించే ప్రత్యేక విమానం ల్యాండింగ్ కు అనుమతి నిరాకరించారు. దీంతో ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ లోనే చాలాసేపు నిరీక్షించిన తర్వాత పోలీసులు అసలు విషయం తెలియజేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు రానుండడంతో ఆయనను రిసీవ్ చేసుకునేందుకు ముందుగానే విమానాశ్రయానికి చేరుకున్న శ్రీ మనోహర్ గారికి ఎయిర్పోర్ట్ అధికారులు ఈ విషయాన్ని తెలియజేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి విమానం ల్యాండింగ్ కు అనుమతి లేకపోవడంతో శ్రీ మనోహర్ గారు అధికారులతో మాట్లాడి, చాలాసేపు వేచి చూసి అనంతరం విమానాశ్రయం బయట మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ “రాజకీయాల్లో గౌరవభావం ఉండాలి. ఒకరంటే ఒకరు మర్యాదగా వ్యవహరించుకునే తీరు ఉంటేనే హుందాగా రాజకీయాలు ఉంటాయి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల మీద, అధికార పార్టీ కక్షపూరిత ధోరణి మీద మా పార్టీ నాయకులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదివారం ప్రత్యేకంగా సమావేశం అయ్యేందుకు రావడాన్ని అడ్డుకునే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. శాంతిభద్రతలకు పూర్తిగా విఘాతం కలిగిస్తుంది వైసీపీనే. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి గన్నవరం విమానాశ్రయం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి ఎంతో హుందాగా, శాంతియుతంగా వస్తారు. మా పార్టీ సమావేశానికి వస్తున్న మా అధ్యక్షుల వారి మూలంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అని పోలీసులు చెప్పడం అత్యంత దారుణం. మొదటి నుంచీ ప్రతిపక్షాల మీద అణిచివేత ధోరణితో వ్యవహరిస్తున్న వైసీపీ ప్రభుత్వం దానిని ఇప్పుడు పరాకాష్టకు తీసుకువెళ్లింది. రాష్ట్రంలోకి ఎవరు రావాలో కూడా నిర్ణయించే పరిస్థితికి వెళ్లిపోయింది. ఇది ప్రజాస్వామ్యానికి తీరని అవమానం. దీని రాష్ట్ర ప్రజలంతా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైసీపీ అనుసరిస్తున్న వైఖరి ప్రజాస్వామ్యానికి చెంపపెట్టు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తే కనీసం నిరసన తెలపడానికి కూడా వెళ్లకుండా అడ్డుకోవడం హేయమైన చర్య. ఈ చర్యలను జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది” అన్నారు. శ్రీ మనోహర్ గారి వెంట పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు ఉన్నారు.